Ishan Kishan on Bazball: టీమిండియా కూడా బజ్‌బాల్ క్రికెట్ ఆడుతుందా.. ఇషాన్ కిషన్ సమాధానమిదీ
Ishan Kishan on Bazball: టీమిండియా కూడా బజ్‌బాల్ క్రికెట్ ఆడుతుందా? ఈ ప్రశ్నకు ఇషాన్ కిషన్ ఆసక్తికరమైన సమాధానమిచ్చాడు. టెస్ట్ క్రికెట్ ను వేగంగా ఆడుతూ ఇంగ్లండ్ టీమ్ అభిమానులను ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే.
Ishan Kishan on Bazball: టెస్ట్ క్రికెట్ కు ఇంగ్లండ్ పరిచయం చేసిన కొత్త స్టైల్ ఆట బజ్‌బాల్. టీ20, వన్డే తరహాలో టెస్టుల్లోనూ వేగంగా బ్యాటింగ్ చేస్తూ ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకొస్తోంది ఇంగ్లండ్. గత ఏడాదిన్నర కాలంగా ఈ స్టైల్ క్రికెట్ తో వరుసగా మ్యాచ్ లు గెలుస్తోంది. వాళ్ల స్టైల్ యాషెస్ సిరీస్ లో అంతగా వర్కౌట్ కాకపోయినా ఈ బజ్‌బాల్ పై ఓ రేంజ్ లో బజ్ క్రియేటైంది.
మరి ఈ స్టైల్ క్రికెట్ ను టీమిండియా కూడా ఆడుతుందా? ఈ ప్రశ్నకు వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ స్పందించాడు. బజ్‌బాల్ ప్రతి రోజూ ఆడాల్సిన అవసరం లేదని, పరిస్థితులను బట్టి ఈ స్టైల్లో ఆడొచ్చని ఇషాన్ అనడం విశేషం. వెస్టిండీస్ తో జరిగిన రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో ఇండియా ఆడిన తీరు ప్రతి ఒక్కరికీ ఈ బజ్‌బాల్ ను గుర్తు చేసింది.
కేవలం 12.2 ఓవర్లలో 100 పరుగులు చేసి టెస్ట్ క్రికెట్ లో అత్యంత వేగంగా వంద రన్స్ చేసిన టీమ్ గా ఇండియా నిలిచింది. దీంతో ఐదో రోజు వర్షం కారణంగా మ్యాచ్ డ్రాగా ముగిసిన తర్వాత ఇషాన్ ఈ బజ్‌బాల్ స్టైల్ క్రికెట్ పై స్పందించాడు. రెండో ఇన్నింగ్స్ లో అతడు కేవలం 34 బంతుల్లోనే 52 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. టెస్టుల్లో అతనికిదే తొలి హాఫ్ సెంచరీ.
"ఈ జట్టులో అందరు ప్లేయర్స్ కు వాళ్ల పాత్ర ఏంటో తెలుసు. ప్రతి రోజూ దూకుడుగా ఆడాల్సిన అవసరం లేదు. పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఇంగ్లండ్ ఆటతీరు చూస్తే.. పిచ్ లు గురించి కూడా ఆలోచించాలి. మేము ఆడే చాలా పిచ్ లు అంత సులువు కాదు. టర్న్, బౌన్స్ ఉంటుంది.
అలా ఆడటంలో అర్థం లేదని నాకు అనిపిస్తుంది. పరిస్థితిని బట్టి ఆడాలి. పిచ్ అనుకూలంగా ఉంటే వేగంగా పరుగులు చేయొచ్చు. అలా చేయగలిగే ప్లేయర్స్ జట్టులో ఉన్నారు. అందుకే ఎప్పుడూ అలా ఆడాల్సిన అవసరం లేదు కానీ అవసరానికి తగినట్లుగా మాత్రం ఆడొచ్చు" అని ఇషాన్ స్పష్టం చేశాడు.
సంబంధిత కథనం