Ashwin Record: టెస్ట్ క్రికెట్‌లో తండ్రీకొడులను ఔట్ చేసిన రికార్డు సొంతం చేసుకున్న అశ్విన్
Ashwin Record: టెస్ట్ క్రికెట్‌లో తండ్రీకొడులను ఔట్ చేసిన ఘనతను సొంతం చేసుకున్నాడు అశ్విన్. వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి రోజు ఆటలో అశ్విన్ ఈ రికార్డు సాధించడం విశేషం.
Ashwin Record: వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి రోజు ఆటలో ఐదు వికెట్లు తీయడం ద్వారా టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట రాసుకున్నాడు. అందులో తండ్రీకొడుకులను ఔట్ చేసిన రికార్డు కూడా ఒకటి. టెస్ట్ క్రికెట్ లో ఈ ఘనత సాధించిన ఐదో బౌలర్ అశ్విన్ కావడం విశేషం.
ట్రెండింగ్ వార్తలు
తొలి రోజు విండీస్ ఓపెనర్ తాగ్‌నారాయణ్ చంద్రపాల్ ను ఔట్ చేయడం ద్వారా అశ్విన్ ఈ అరుదైన రికార్డును తన పేరిట రాసుకున్నాడు. ఈ చంద్రపాల్ ఒకప్పటి విండీస్ లెజెండరీ బ్యాటర్ శివనారాయణ్ చంద్రపాల్ తనయుడే కావడం విశేషం. 12 ఏళ్ల కిందట న్యూఢిల్లీలో తాను ఆడిన తొలి టెస్టులోనే ఆ సీనియర్ చంద్రపాల్ ను అశ్విన్ ఔట్ చేశాడు.
మూడుసార్లూ ఈ తండ్రీ కొడుకులే
టెస్ట్ క్రికెట్ లో ఇలా ఒకే బౌలర్ తండ్రీకొడులను ఔట్ చేసిన సందర్భాలు మొత్తం ఐదు ఉన్నాయి. అందులో మూడుసార్లు ఈ సీనియర్, జూనియర్ చంద్రపాల్‌ల వికెట్లే ఆయా బౌలర్లు తీశారు. అశ్విన్ కంటే ముందు ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్, సౌతాఫ్రికా స్పిన్నర్ సిమోన్ హార్మర్ కూడా ఈ తండ్రీ కొడుకులను ఔట్ చేసిన ఘనతను సొంతం చేసుకున్నారు.
సీనియర్ చంద్రపాల్ సుదీర్ఘ టెస్ట్ కెరీర్ దీనికి కారణంగా చెప్పొచ్చు. 1994లో తన టెస్ట్ కెరీర్ మొదలుపెట్టిన చంద్రపాల్.. 2015 వరకూ ఆడటం విశేషం. విండీస్ తరఫున అతడు 164 టెస్టుల్లో 11867 రన్స్ చేశాడు. ఇక అతని కొడుకు తాగ్‌నారాయణ్ చంద్రపాల్ గతేడాదే టెస్ట్ కెరీర్ ప్రారంభించాడు. దీంతో ఈ ముగ్గురు బౌలర్లకు టెస్టుల్లో ఈ తండ్రీకొడుకులను ఔట్ చేసిన ఘనత దక్కింది.
ఈ ముగ్గురు బౌలర్లు కాకుండా టెస్టుల్లో మరో ఇద్దరు బౌలర్లు కూడా తండ్రీకొడుకులను ఔట్ చేసిన రికార్డు సొంతం చేసుకున్నారు. వాళ్లలో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ ఇయాన్ బోథమ్ ఒకరు కాగా.. పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ మరొకరు. ఈ ఇద్దరు కూడా న్యూజిలాండ్ కు చెందిన తండ్రీ కొడుకులు లాన్స్ కెయిన్స్, క్రిస్ కెయిన్స్ లను టెస్ట్ క్రికెట్లో ఔట్ చేశారు.
సంబంధిత కథనం