England Ball change: ఇంగ్లండ్ బాల్ మార్చడం వల్లే గెలిచిందా.. యాషెస్‌పై రచ్చ చేస్తున్న ఆస్ట్రేలియా-cricket news england ball change move in ashes final test needs to be investigate says ponting ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  England Ball Change: ఇంగ్లండ్ బాల్ మార్చడం వల్లే గెలిచిందా.. యాషెస్‌పై రచ్చ చేస్తున్న ఆస్ట్రేలియా

England Ball change: ఇంగ్లండ్ బాల్ మార్చడం వల్లే గెలిచిందా.. యాషెస్‌పై రచ్చ చేస్తున్న ఆస్ట్రేలియా

Hari Prasad S HT Telugu
Aug 01, 2023 01:45 PM IST

England Ball change: ఇంగ్లండ్ బాల్ మార్చడం వల్లే గెలిచిందా? యాషెస్‌పై మరో రచ్చ చేస్తోంది ఆస్ట్రేలియా టీమ్. ఆ టీమ్ మాజీ కెప్టెన్ పాంటింగ్ అయితే ఏకంగా దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాడు.

పాత బంతి స్థానంలో కొత్తగా మెరుస్తున్న బంతి తీసుకున్న ఇంగ్లండ్
పాత బంతి స్థానంలో కొత్తగా మెరుస్తున్న బంతి తీసుకున్న ఇంగ్లండ్

England Ball change: యాషెస్ సిరీస్ కు అదిరే ముగింపు లభించింది. చివరి టెస్టు గెలిచిన ఇంగ్లండ్ సిరీస్ ను 2-2తో డ్రా చేయగలిగింది. అయితే ఈ మ్యాచ్ లోనూ 384 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించిన ఆస్ట్రేలియా ఒక్కసారిగా కుప్పకూలింది. చివరికి 49 పరుగులతో ఓడింది. అయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ వివాదాస్పద రీతిలో బాల్ మార్చడం వల్లే ఇలా జరిగిందని ఆస్ట్రేలియా గుర్రుగా ఉంది.

ఆ టీమ్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అయితే ఏకంగా దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తుండగా.. ఆ టీమ్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా ఈ ఘటనపై నిరాశ వ్యక్తం చేశాడు. నాలుగో రోజు చివర్లో బాల్ మార్చాల్సి రావడమే తమ ఓటమికి కారణమైందని ఖవాజా అంటున్నాడు. ఆస్ట్రేలియా ఓపెనర్లు వార్నర్, ఖవాజా సెంచరీకిపైగా భాగస్వామ్యంతో తమ టీమ్ ను గెలిపించేలా కనిపించారు.

కొత్త బాల్ అసలు స్వింగ్ కాకపోవడంతో ఇంగ్లండ్ పేసర్లు ఎంత ప్రయత్నించినా వాళ్లను ఔట్ చేయలేకపోయారు. అయితే నాలుగో రోజు మార్క్ వుడ్ వేసిన ఓ బాల్ ఖవాజా హెల్మెట్ ను బలంగా తాకింది. దీంతో ఆ బాల్ పాడవడంతో అంపైర్లు మరో బాల్ తీసుకున్నారు. అక్కడి నుంచే కథ మారిపోయింది. ఐదో రోజు ఉదయం ఆస్ట్రేలియా ఓపెనర్లును త్వరగా కోల్పోయింది.

అంతకుముందు బాల్ కంటే ఇది చాలా ఎక్కువ స్వింగ్ అయింది. దీంతో ఆసీస్ మాజీ కెప్టెన్ పాంటింగ్ దీనిపై అనుమానం వ్యక్తం చేశాడు. "పాడైన బంతి స్థానంలో తీసుకున్న బాల్ చాలా భిన్నంగా ఉంది. చాలా కొత్తగా మెరుపు ఎక్కువగా ఉంది. ఆ రెండు బంతులను పక్కపక్కన పెడితే అసలు పోల్చలేము. అదే మ్యాచ్ లో కీలక మలుపు. అందుకే దీనిపై విచారణ జరపాలి" అని స్కై స్పోర్ట్స్ తో మాట్టాడుతూ పాంటింగ్ అన్నాడు.

అటు ఖవాజా కూడా దీనిపై స్పందించాడు. "వాళ్లు బంతిని మార్చగానే ఆ కొత్త బాల్ చాలా భిన్నంగా ఉన్నట్లు అర్థమైంది. అప్పుడే అంపైర్ కుమార్ ధర్మసేన దగ్గరికి వెళ్లి ఈ బాల్ ఎంత పాతది? 8 ఓవర్లు వేసినట్లు కనిపిస్తోంది అని అడిగాను. ఆ బంతి నా బ్యాట్ ను చాలా బలంగా తాకింది. యాషెస్ లో ప్రతి టెస్టులో ఓపెనింగ్ చేశాను.

కానీ ఏ బంతి కూడా అంత బలంగా నా బ్యాట్ ను తాకలేదు. కొత్తగా బ్యాటింగ్ చేయడానికి వచ్చే వాళ్లతో ఈ కొత్త బంతి కాస్త భిన్నంగా ఉందని చెప్పాను. కొన్ని విషయాలు మనం నియంత్రించలేము. ఇది నిరాశ కలిగించింది. ఇంగ్లండ్ ది క్లాస్ బౌలింగ్ అటాక్. వాళ్లకు కాస్త సందు దొరికినా దానిని అద్భుతంగా ఉపయోగించుకుంటారు" అని ఖవాజా అన్నాడు.

Whats_app_banner

సంబంధిత కథనం