తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ind Vs Pak In Wc 2023: ఇండియా, పాకిస్థాన్ వరల్డ్ కప్ మ్యాచ్ తేదీలో మార్పు.. కొత్త డేట్ ఇదే

Ind vs Pak in WC 2023: ఇండియా, పాకిస్థాన్ వరల్డ్ కప్ మ్యాచ్ తేదీలో మార్పు.. కొత్త డేట్ ఇదే

Hari Prasad S HT Telugu

02 August 2023, 10:30 IST

google News
    • Ind vs Pak in WC 2023: ఇండియా, పాకిస్థాన్ వరల్డ్ కప్ మ్యాచ్ తేదీలో మార్పు జరిగింది. కొత్త తేదీకి పాక్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబర్ 15నే నవరాత్రి ప్రారంభం కానుండటంతో భద్రతా పరమైన సమస్యలు వస్తాయని ఈ మ్యాచ్ తేదీ మార్చారన్న విషయం తెలిసిందే.
ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ఒక రోజు ముందుకు..
ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ఒక రోజు ముందుకు..

ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ఒక రోజు ముందుకు..

Ind vs Pak in WC 2023: వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరిగే తేదీలో మార్పు చేశారు. ఇంతకుముందు అక్టోబర్ 15న ఈ మ్యాచ్ నిర్వహించాలని భావించినా.. ఇప్పుడు ఒక రోజు ముందు అంటే అక్టోబర్ 14నే ఈ దాయాదుల మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం తమ మరో మ్యాచ్ షెడ్యూల్ మార్చడానికి కూడా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంగీకరించింది.

అక్టోబర్ 14న ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అహ్మదాబాద్ లోనే జరుగుతుంది. ఇక అంతకుముందు శ్రీలంకతో హైదరాబాద్ లో పాక్ ఆడాల్సిన మ్యాచ్ షెడ్యూల్ కూడా మారింది. అక్టోబర్ 12న ఈ మ్యాచ్ జరగాల్సి ఉండగా.. ఇప్పుడు అక్టోబర్ 10న ఈ మ్యాచ్ జరుగుతుంది. దీనివల్ల ఇండియాతో మ్యాచ్ కు పాకిస్థాన్ టీమ్ కు మూడు రోజుల గ్యాప్ దొరుకుతుంది.

అక్టోబర్ 15నే నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానుండటం, అది గుజరాత్ లో ఘనంగా జరుపుకునే ఉత్సవం కావడంతో ఇండోపాక్ మ్యాచ్ కు భద్రతా పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో మ్యాచ్ తేదీని ఒక రోజు ముందుకు జరిపారు. పాక్ ఆడబోయే రెండు మ్యాచ్ లను రీషెడ్యూల్ చేసే విషయమై ఐసీసీ, బీసీసీఐ.. పాక్ బోర్డును సంప్రదించగా.. దానికి అంగీకరించింది.

ఈ ఒక్క మ్యాచ్ వల్ల వరల్డ్ కప్ లో కొన్ని ఇతర జట్లు ఆడబోయే మ్యాచ్ ల తేదీలు కూడా మారనున్నాయి. ఈ మార్పులన్నింటితో ఐసీసీ త్వరలోనే కొత్త షెడ్యూల్ రిలీజ్ చేయనుంది. పాకిస్థాన్ క్రికెట్ టీమ్ వరల్డ్ కప్ లీగ్ స్టేజ్ లో భాగంగా రెండు మ్యాచ్ లను హైదరాబాద్ లో ఆడనుంది. శ్రీలంక, నెదర్లాండ్స్ లతో పాక్ టీమ్ ఉప్పల్ స్టేడియంలో తలపడనుంది.

ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ తేదీలో మార్పు అభిమానులకు షాక్ లాంటిదే. అక్టోబర్ 15న మ్యాచ్ కోసం ఇప్పటికే వేల మంది ఫ్యాన్స్ లక్షలు ఖర్చు పెట్టి హోటల్ రూమ్స్ బుక్ చేసుకున్నారు. కొందరు హాస్పిటల్ బెడ్స్ నూ వదల్లేదు. ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇప్పుడీ మ్యాచ్ ఒక రోజు ముందుకు జరగడంతో ఆ బుకింగ్స్ ను మార్చుకోవడం వాళ్లకు సమస్యగానే మారనుంది.

తదుపరి వ్యాసం