తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Badminton World Championships: చరిత్ర సృష్టించిన సాత్విక్‌, చిరాగ్‌.. మెడల్‌ ఖాయం

Badminton World Championships: చరిత్ర సృష్టించిన సాత్విక్‌, చిరాగ్‌.. మెడల్‌ ఖాయం

Hari Prasad S HT Telugu

26 August 2022, 11:16 IST

google News
    • Badminton World Championships: బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించారు సాత్విక్‌సాయిరాజ్‌ రంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి. ఈ జోడీ ఇండియాకు మెడల్‌ ఖాయం చేసింది.
బ్యాడ్మింటన్ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ క్వార్టర్ ఫైనల్లో గెలిచిన తర్వాత సాత్విక్, చిరాగ్ జోడీ సంబరాలు
బ్యాడ్మింటన్ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ క్వార్టర్ ఫైనల్లో గెలిచిన తర్వాత సాత్విక్, చిరాగ్ జోడీ సంబరాలు (AP)

బ్యాడ్మింటన్ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ క్వార్టర్ ఫైనల్లో గెలిచిన తర్వాత సాత్విక్, చిరాగ్ జోడీ సంబరాలు

Badminton World Championships: కామన్వెల్త్‌ గేమ్స్‌ బ్యాడ్మింటన్‌ మెన్స్‌ డబుల్స్‌లో గోల్డ్‌ మెడల్‌ గెలిచిన సాత్విక్‌, చిరాగ్‌ జోడీ బ్యాడ్మింటన్ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్‌లోనూ అదే జోరు కొనసాగిస్తోంది. ఈ మెగా ఈవెంట్‌లో ఇండియాకు తొలిసారి ఓ డబుల్స్‌ మెడల్‌ను ఖాయం చేసింది. శుక్రవారం (ఆగస్ట్‌ 26) జరిగిన క్వార్టర్‌ ఫైనల్ మ్యాచ్‌లో సాత్విక్‌, చిరాగ్‌ జోడీ జపాన్‌కు చెందిన యుగో కొబయాషి, టకురో హోకిపై గెలిచింది.

మూడు గేమ్స్‌ పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ఇండియన్‌ జోడీ 24-22, 15-21, 21-14 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో ఇండియాకు కనీసం బ్రాంజ్‌ మెడల్ ఖాయమైంది. క్వార్టర్స్‌లో తొలి గేమ్‌ హోరాహోరీగా సాగింది. ఇండియా, జపాన్‌ జోడీలు ప్రతి పాయింట్‌ కోసం తీవ్రంగా శ్రమించాయి. పోటీ పడి పాయింట్స్‌ సాధించాయి.

దీంతో తొలి గేమ్‌ 24 పాయింట్ల వరకూ వెళ్లింది. చివరికి ఆ గేమ్‌ను 24-22తో సాత్విక్‌, చిరాగ్‌ గెలిచారు. ఇక రెండో గేమ్‌లోనూ ఒక దశలో 11-9తో లీడ్‌లో ఉన్నా తర్వాత అనూహ్యంగా పుంజుకున్న జపాన్‌ జోడీ ఆ గేమ గెలిచి మ్యాచ్‌ను 1-1తో సమం చేసింది. అయితే నిర్ణయాత్మ మూడో గేమ్‌లో మాత్రం ఇండియన్‌ జోడీ ఇక ఛాన్సివ్వలేదు.

మొదట్లోనే 4-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లిన సాత్విక్‌, చిరాగ్‌.. ఆ లీడ్‌ను చివరి వరకూ నిలుపుకున్నారు. ఈ విజయంతో ఈసారి వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో ఇండియాకు తొలి మెడల్‌ ఖాయమైంది. మెన్స్‌ డబుల్స్‌లో ఇప్పటి వరకూ ఇండియాకు ఎప్పుడూ మెడల్‌ రాలేదు. ఇప్పుడు ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి సాత్విక్‌, చిరాగ్‌ చరిత్ర సృష్టించారు.

గతేడాది టోక్యోలోనే జరిగిన ఒలింపిక్స్‌లో గ్రూప్‌ స్టేజ్‌లోనే ఇంటిదారి పట్టిన ఈ జోడీ.. ఈ ఏడాది మాత్రం టాప్‌ ఫామ్‌లో ఉంది. తొలిసారి ఇండియా థామస్‌ కప్‌ గెలవడంలో ఈ జోడీ కీలక పాత్ర పోషించింది. అంతేకాదు మొన్న కామన్వెల్త్‌ గేమ్స్‌లోనూ గోల్డ్‌ మెడల్‌ గెలిచింది.

తదుపరి వ్యాసం