Cricket in Olympics: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్!
Cricket in Olympics: క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చూడాలనుకుంటున్న ఫ్యాన్స్‌కు, ఐసీసీకి ఇది నిజంగా బూస్ట్‌లాంటిదే. 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చే దిశగా మరో కీలక అడుగు ముందుకు పడింది.
దుబాయ్: 2028లో లాస్ ఏంజిల్స్‌లో జరగబోయే ఒలింపిక్స్‌లో క్రికెట్ ఉంటుందా? దీనిపై తుది నిర్ణయం ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) తీసుకోనుంది. అయితే ఆ దిశగా కీలక ముందడుగు పడింది. దీనికోసం షార్ట్‌లిస్ట్ చేసిన 9 స్పోర్ట్స్‌లో క్రికెట్ కూడా ఉంది. వీటిపై ఐఓసీ సమీక్షించి ఓ నిర్ణయం తీసుకుంటుంది. గత నెలలోనే క్రికెట్‌పై తమ వాదన వినిపించాల్సిందిగా ఐసీసీని లాస్ ఏంజిల్స్ ఆర్గనైజింగ్ కమిటీ కోరింది.
అయితే ఈ ప్రజెంటేషన్ ఎప్పుడు ఉంటుందన్నది కచ్చితంగా తెలియకపోయినా.. వచ్చే ఏడాది రెండో త్రైమాసికంలో క్రికెట్‌పై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ముంబైలో సమావేశమై దీనిపై సమీక్షించనుంది. ఈ రేసులో బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లాక్రోస్, బ్రేక్ డ్యాన్సింగ్, కరాటే, కిక్ బాక్సింగ్, స్క్వాష్, మోటార్‌స్పోర్ట్‌లతో క్రికెట్ పోటీ పడనుంది.
కొత్తగా ఎన్ని స్పోర్ట్స్‌ను ఒలింపిక్స్‌లో చేరుస్తారన్నదానిపై స్పష్టత లేదు. అయితే దీనికి ఐఓసీ విధించిన కొన్ని ప్రమాణాలను అందుకోవాల్సి ఉంటుంది. ఇందులో గేమ్స్ నిర్వహించడానికి అవసరమయ్యే ఖర్చును, సంక్లిష్టతను తగ్గించడం.. అథ్లెట్ల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యమిచ్చే స్పోర్ట్స్.. ఆతిథ్య దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆ స్పోర్ట్‌కు అభిమానుల్లో ఉన్న ఆసక్తి.. యూత్, లింగ సమానత్వం ఉండే స్పోర్ట్స్‌లాంటి కొన్ని ప్రమాణాలను ఐఓసీ విధించింది.
అయితే ఈ ప్రమాణాలన్నీ అందుకొని ఒలింపిక్స్‌లో స్థానం సంపాదిస్తామన్న కాన్ఫిడెన్స్‌లో ఐసీసీ ఉండగా.. దీనిపై తుది నిర్ణయం మాత్రం లాస్ ఏంజిల్స్ కమిటీ తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ ఓ స్టార్ అట్రాక్షన్‌గా ఉన్న విషయాన్ని కూడా ఐసీసీ గుర్తు చేస్తోంది. కామన్వెల్త్ దేశాల్లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ను చెబుతూ.. ఈ గేమ్స్‌లో క్రికెట్‌ను చేర్చేలా ఐసీసీ, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు గట్టిగానే ప్రయత్నించాయి. ఫలితంగానే 1998 తర్వాత తొలిసారి వుమెన్స్ టీ20 రూపంలో మళ్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ చేరింది.
సంబంధిత కథనం