Badminton World Championships: వరల్డ్ ఛాంపియన్షిప్స్ నుంచి సైనా ఔట్
25 August 2022, 14:56 IST
- Badminton World Championships: వరల్డ్ ఛాంపియన్షిప్స్ ప్రీక్వార్టర్స్‌లోనే ఇంటిదారి పట్టింది సైనా నెహ్వాల్. గురువారం (ఆగస్ట్ 25) జరిగిన మ్యాచ్‌లో ఆమె ఓడిపోయింది.
ప్రీక్వార్టర్స్ లోనే ఇంటిదారి పట్టిన సైనా నెహ్వాల్
Badminton World Championships: బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ ప్రీక్వార్టర్స్‌లోనే ఓడిపోయింది స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆమె థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్ చేతిలో 17-21, 21-16, 13-21 తేడాతో పోరాడి ఓడింది. ఈ మ్యాచ్ ఏకంగా గంటా 4 నిమిషాల పాటు కొనసాగడం విశేషం.
మాజీ వరల్డ్ నంబర్‌వన్, లండన్ ఒలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్ అయిన సైనా.. ఈ మ్యాచ్‌లో బాగానే పోరాడింది. తొలి గేమ్‌ను 17-21తో కోల్పోయిన తర్వాత రెండో గేమ్‌లో అద్బుతంగా పుంజుకుంది. 21-16తో గెలిచి మ్యాచ్‌ను 1-1తో సమం చేసింది. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ప్రత్యర్థి దూకుడు ముందు ఆమె నిలవలేకపోయింది.
ఈసారి వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో సైనా తన తొలి రౌండ్ మ్యాచ్‌లో హాంకాంగ్‌కు చెందిన చెయుంగ్ ఎన్గన్ యీపై గెలిచి రెండో రౌండ్లో అడుగుపెట్టింది. అయితే రెండో రౌండ్లో ఆమె ప్రత్యర్థి నొజొమి ఒకుహర గాయం కారణంగా తప్పుకోవడంతో సైనా నేరుగా ప్రీక్వార్టర్స్ చేరింది. అయితే ఆ అవకాశాన్ని సైనా సద్వినియోగం చేసుకోలేకపోయింది.
పీవీ సింధు ముందుగానే వరల్డ్ ఛాంపియన్షిప్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఆమె మడమ గాయంతో బాధపడుతోంది. దీంతో వుమెన్స్ కేటగిరీలో మెడల్ ఆశలన్నీ సైనాపైనా ఉన్నాయి. ఇప్పుడామె కూడా ప్రీక్వార్టర్స్‌లోనే వెనుదిరగడంతో ఇండియాకు నిరాశ తప్పలేదు.