Asia Cup 2023 : ఆసియా కప్ ఆతిథ్యాన్ని పాకిస్థాన్ కోల్పోతుందా? శ్రీలంకకు వెళ్తుందా?
09 May 2023, 10:55 IST
- Asia Cup 2023 : ఈ ఏడాది ఆసియా కప్ టోర్నీకి ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని పాకిస్థాన్ కోల్పోయే అవకాశం ఉంది. పాకిస్థాన్‌లో నిర్వహించాల్సిన ఆసియా కప్ టోర్నీని శ్రీలంకలో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
ఆసియా కప్ పాకిస్థాన్ నుంచి తరలిపోవడం ఖాయమేనా?
ఈ ఏడాది ఆసియా కప్(Asia Cup) టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే హక్కును పాకిస్థాన్ దక్కించుకుంది. అయితే భారత్-పాక్‌ల మధ్య సంబంధాలు బాగాలేనందున పాక్ వెళ్లడం కుదరదని భారత్ ముందే చెప్పింది. అందువల్ల ఈ టోర్నీని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(Pakistan Cricket Board) హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలనే ప్రతిపాదనను ఆసియా క్రికెట్ కౌన్సిల్(Asia Cricket Council) ముందుంచింది. అంటే, భారత్ మ్యాచ్‌లను పాకిస్థాన్‌లో కాకుండా తటస్థ వేదికగా ఏర్పాటు చేసి, మిగిలిన మ్యాచ్‌లను పాకిస్థాన్‌లో నిర్వహించాలనేది ప్రతిపాదన అన్నమాట.
అయితే ప్రస్తుతం పరిణామాలు మారిపోయాయి. విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. మొత్తం టోర్నీ పాకిస్థాన్ లో లేకుండానే జరిగే అవకాశం ఉంది. ఆసియా కప్ 2023(Asia Cup 2023)ని శ్రీలంక నిర్వహించే అవకాశాలు బలంగా ఉన్నాయి. 'వచ్చే నెలలో ACC మరో సమావేశాన్ని నిర్వహిస్తుంది. అక్కడ తుది నిర్ణయం తీసుకుంటారు.' అని సమాచారం.
ఆసియా కప్(Asia Cup) గురించి గతంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ నజీమ్ సేథీ స్పందించారు. టోర్నీని హైబ్రిడ్ ఫార్మాట్‌లో నిర్వహించి భారత్ మ్యాచ్‌లు దుబాయ్(Dubai)లో నిర్వహించేలా ప్లాన్ చేద్దాం అనే ప్రతిపాదనతో వచ్చాడు. మిగతా మ్యాచ్‌లను పాకిస్థాన్‌లో నిర్వహిస్తామని చెప్పాడు.
'ఆసియా కప్ టోర్నమెంట్‌ను హైబ్రిడ్ ఫార్మాట్‌లో నిర్వహిస్తాం. పాకిస్థాన్ వెలుపల భారతదేశంతో జరిగే మ్యాచ్ లు నిర్వహిస్తాం. మిగిలిన మ్యాచ్‌లు పాకిస్తాన్‌లో నిర్వహిస్తాం. మేము మరే ఇతర షెడ్యూల్‌ను అంగీకరించబోమని స్పష్టం చేశాం.' అని పీసీబీ చీఫ్ నజీమ్ సేథీ తెలిపాడు.
2023 ఆసియా కప్ టోర్నీని తటస్థ వేదికగా నిర్వహిస్తామని ఏసీసీ అధ్యక్షుడు జై షా ఇచ్చిన ప్రకటన కూడా ఆసక్తికరంగా మారింది. 'ఏసీసీ అధ్యక్షుడిగా నేను చెబుతున్నాను. మేము పాకిస్థాన్‌కు వెళ్లలేం. వారు (పాకిస్థాన్) ఇక్కడికి రాలేరు. ఇంతకుముందు కూడా ఆసియా కప్ తటస్థ వేదికలలో నిర్వహించబడింది.' అని జై షా అన్నారు.
ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఆసియా కప్ ను ఆ దేశం నుంచి తరలించే విషయంలో శ్రీలంక క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా బీసీసీఐ వెంటే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పాకిస్థాన్ కు చెందిన జియో న్యూస్ ఛానెల్ ఈ విషయాన్ని వెల్లడించింది. శ్రీలంక(Sri Lanka) ఆసియా కప్ కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉంది.