Asia Cup: పాకిస్థాన్‌కు దిమ్మదిరిగే షాక్.. ఆసియాకప్‌పై బీసీసీఐ వెంటే శ్రీలంక, బంగ్లాదేశ్!
Asia Cup: పాకిస్థాన్‌కు దిమ్మదిరిగే షాక్ తగిలేలా ఉంది. ఆసియాకప్‌పై బీసీసీఐ వెంటే శ్రీలంక, బంగ్లాదేశ్ నిలిచినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ టోర్నీని పాకిస్థాన్ నుంచి తరలించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
Asia Cup: పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు గట్టి దెబ్బే తగిలేలా ఉంది. ఆసియా కప్ ను ఆ దేశం నుంచి తరలించే విషయంలో శ్రీలంక క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా బీసీసీఐ వెంటే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పాకిస్థాన్ కు చెందిన జియో న్యూస్ ఛానెల్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది ఆసియాకప్ పాకిస్థాన్ లో జరగనున్న విషయం తెలిసిందే.
అయితే ఆ దేశానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియన్ టీమ్ ను పంపే ప్రసక్తే లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది. అందుకే ఆ టోర్నీనే పాకిస్థాన్ నుంచి మరో దేశానికి తరలించాలని డిమాండ్ చేస్తోంది. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు కూడా అయిన బీసీసీఐ సెక్రటరీ జై షా.. ఆ ప్రతిపాదనను ఇప్పటికే ఏసీసీ ముందు ఉంచారు. అయితే పాక్ బోర్డు మాత్రం ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ఇండియా మ్యాచ్ లను మాత్రం మరో చోట నిర్వహించి.. ఆసియా కప్ ఆతిథ్య హక్కులను పాక్ బోర్డుకే ఇవ్వాలని పీసీబీ ఛైర్మన్ నజమ్ సేఠీ ఏసీసీకి ప్రతిపాదించారు. దీనిపై ఏసీసీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే టోర్నీని పాక్ నుంచి తరలించే ప్రతిపాదన విషయంలో శ్రీలంక, బంగ్లాదేశ్ బోర్డులు కూడా బీసీసీఐ వెంటే ఉన్నట్లు జియో న్యూస్ తెలిపింది.
అంతేకాదు ఒకవేళ పాకిస్థాన్ ఆడటానికి నిరాకరిస్తే.. ఆ టీమ్ స్థానంలో యూఏఈకి అవకాశం ఇవ్వాలనీ ఏసీసీ భావిస్తున్నట్లు ఆ ఛానెల్ చెప్పడం గమనార్హం. ఒకవేళ అదే నిజమైతే పాకిస్థాన్ బోర్డుకు, టీమ్ కు కోలుకోలేని దెబ్బ పడినట్లే. ఆసియా కప్ ను పాక్ నుంచి తరలిస్తే అక్కడి బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
గతంలో పీసీబీ ఛీఫ్ గా ఉన్న రమీజ్ రాజా అయితే తాము ఇండియాలో జరగబోయే వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటామని హెచ్చరించారు. ఇప్పటి అధ్యక్షుడు కూడా పరోక్షంగా ఇదే మాట చెప్పారు. వరల్డ్ కప్ లో ఆడటానికి తమ ప్రభుత్వం కూడా అంగీకరించకపోవచ్చని సేఠీ గతంలో అన్నారు. కానీ పాక్ అంతటి సాహసం చేస్తుందనిపించడం లేదు.
ఆసియా కప్ నిర్వహణపై చర్చించడానికి సేఠీ దుబాయ్ వెళ్లి ఏసీసీ, ఐసీసీ సభ్యులతో సమావేశం కానున్నట్లు పీటీఐ వెల్లడించింది. ఇదే అంశంపై ఇప్పటికే సేఠీ పాక్ ప్రభుత్వ అధికారులతోనూ సంప్రదింపులు జరిపారు.
సంబంధిత కథనం