asia cup 2023: ఆసియా కప్ ఆడకపోతే మాకు చాలా నష్టం: పాక్ క్రికెట్ బోర్డు ఛీఫ్
asia cup 2023: ఆసియా కప్ ఆడకపోతే మాకు చాలా నష్టం అని అన్నారు పాక్ క్రికెట్ బోర్డు ఛీఫ్ నజమ్ సేఠీ. ఒకవేళ ఆసియా క్రికెట్ కౌన్సిల్ హైబ్రిడ్ పద్ధతికి అంగీకరించకపోతే ఆసియా కప్ నుంచి తప్పుకోవాలని పాకిస్థాన్ టీమ్ చూస్తోంది.
asia cup 2023: ఈ ఏడాది ఆసియా కప్ నిర్వహణ హక్కులు పాకిస్థాన్ కు దక్కిన విషయం తెలుసు కదా. అయితే ఈ టోర్నీ ఆడటానికి ఇండియన్ టీమ్ ఆ దేశానికి వెళ్లడానికి సిద్ధంగా లేదు. దీంతో ఇండియా మ్యాచ్ లను మాత్రం మరో చోట నిర్వహించి మిగతా మ్యాచ్ లను పాకిస్థాన్ లోనే జరిగేలా హైబ్రిడ్ మోడల్ ను పీసీబీ ఛీఫ్ నజమ్ సేఠీ సూచించారు.
ఈ అంశాన్ని ఏసీసీ పరిశీలిస్తోంది. అలా కాకుండా మొత్తం ఆసియా కప్ నే మరో చోటికి తరలిస్తే ఈ టోర్నీ నుంచి తప్పుకోవాలని పాక్ టీమ్ భావిస్తోంది. అయితే అలా చేస్తే పీసీబీ 30 లక్షల డాలర్ల (సుమారు రూ.25 కోట్లు) ఆదాయం కోల్పోతుందని ఆ బోర్డు ఛీఫ్ నజమ్ సేఠీ చెప్పారు. టోర్నీ హక్కులు కోల్పోవడం కంటే ఈ నష్టాన్ని భరించడానికి కూడా తాము సిద్ధమే అని ఆయన అనడం గమనార్హం.
"మేము చెప్పినట్లు ఆసియా కప్ హైబ్రిడ్ పద్ధతిలో జరగకపోతే మేము ఎలాంటి షెడ్యూల్ ను అంగీకరించం. టోర్నీలో ఆడబోము" అని నజమ్ సేఠీ స్పష్టం చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో పాకిస్థాన్ ఆసియా కప్ కు ఆతిథ్యమివ్వనుంది. అయితే తాము ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్ లో అడుగుపెట్టబోమని ఇండియా చెప్పడంతో పీసీబీ ఇలా హైబ్రిడ్ పద్ధతిని ప్రతిపాదించింది.
ఒకవేళ భారత ప్రభుత్వం అంగీకరించకపోతే దానిని రాతపూర్వకంగా తమకు అందించాలని పీసీబీ ఛీఫ్ సేఠీ బీసీసీఐని డిమాండ్ చేస్తున్నారు. ఏసీసీకి 80 శాతం ఆదాయం ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ల ద్వారానే వస్తుందని సేఠీ అన్నారు.
సంబంధిత కథనం