BCCI vs PCB: బీసీసీఐకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వార్నింగ్
BCCI vs PCB: బీసీసీఐకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వార్నింగ్ ఇచ్చింది. ఆసియాకప్ 2023 తటస్థ వేదికలో జరుగుతుందని, ఇండియన్ టీమ్ పాకిస్థాన్ వెళ్లే ప్రసక్తే లేదని బీసీసీఐ కార్యదర్శి జై షా చేసిన కామెంట్స్‌పై బుధవారం (అక్టోబర్ 19) పాక్ క్రికెట్ బోర్డు అధికారికంగా స్పందించింది.
BCCI vs PCB: ఆసియాకప్ 2023పై బీసీసీఐ, పీసీబీ మధ్య వివాదం ముదురుతోంది. వచ్చే ఏడాది పాకిస్థాన్ ఈ టోర్నీకి ఆతిథ్యమివ్వాల్సి ఉంది. అయితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు కూడా అయిన బీసీసీఐ కార్యదర్శి జై షా మాత్రం.. ఈ టోర్నీని తటస్థ వేదికలో నిర్వహిస్తామని ప్రకటించారు. పాకిస్థాన్‌కు టీమ్‌ను పంపే అంశం తమ చేతుల్లో లేదని, అది ప్రభుత్వం చూసుకుంటుందని, అందువల్ల దానిపై ఏమీ స్పందించబోనని షా అన్నారు.
మంగళవారం (అక్టోబర్ 18) బీసీసీఐ ఏజీఎం తర్వాత షా మాట్లాడగా.. బుధవారం పాక్ క్రికెట్ బోర్డు స్పందించింది. దీనిపై అధికారికంగా ఒక ప్రకటన జారీ చేసింది. ఇందులో బీసీసీఐకి పరోక్షంగా వార్నింగ్ కూడా ఇచ్చింది. ఏసీసీ సభ్యులతో సంప్రదించకుడానే జై షా ఏకపక్షంగా ఈ ప్రకటన జారీ చేశారని ఆరోపించింది. ఒకవేళ ఆసియాకప్‌ను తరలిస్తే ఇండియాలో జరగబోయే 2023 వరల్డ్‌కప్ నుంచి తాము తప్పుకునే అవకాశం కూడా ఉందని స్పష్టం చేసింది.
"వచ్చే ఏడాది జరగబోయే ఆసియా కప్‌ను తటస్థ వేదికకు తరలిస్తామని ఏసీసీ అధ్యక్షుడు జై షా చేసిన కామెంట్స్ మాకు ఆశ్చర్యాన్ని, అసంతృప్తిని కలిగించాయి. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ లేదా ఆతిథ్యమిచ్చే పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో సంప్రదించకుండానే ఆయన ప్రకటన జారీ చేశారు. ఎలాంటి ఆలోచన, దీర్ఘకాలంలో తలెత్తే పరిణామాలను పట్టించుకోకుండా చేసిన ప్రకటన ఇది" అని పీసీబీ ఘాటుగా స్పందించింది.
"ఏసీసీ సమావేశంలో అందరు సభ్యుల మద్దతుతో పాకిస్థాన్‌కు ఆసియా కప్ నిర్వహణ హక్కులను కట్టబెట్టారు. కానీ ఇప్పుడు ఆసియాకప్‌ను తరలించాలన్న షా నిర్ణయం ఏకపక్షంగా తీసుకున్నదే. ఇది ఆసియా క్రికెట్ కౌన్సిల్ స్ఫూర్తికి విరుద్ధం. ఇలాంటి ప్రకటనలు ఆసియా, అంతర్జాతీయ క్రికెట్ సమాజాన్ని విడదీస్తాయి. అంతేకాదు ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2023తోపాటు ఇండియాలో 2024-2031 మధ్య జరగబోయే ఈవెంట్ల నుంచి పాకిస్థాన్ తప్పుకునే అవకాశం కూడా ఉంది" అని పీసీబీ హెచ్చరించింది.
ఏసీసీ అధ్యక్షుడు చేసిన ప్రకటనపై ఇప్పటి వరకూ ఏసీసీ నుంచి తమకు ఎలాంటి అధికారిక ప్రకటన అందలేదని కూడా స్పష్టం చేసింది. అయితే ఈ ముఖ్యమైన, సున్నితమైన అంశాన్ని చర్చించడానికి వెంటనే ఏసీసీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని పీసీబీ డిమాండ్ చేసింది.