Jay Shah on Asia Cup 2023: పాకిస్థాన్‌కు వెళ్లే ప్రసక్తే లేదు.. ఆసియాకప్ 2023పై జై షా
Jay Shah on Asia Cup 2023: పాకిస్థాన్‌కు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు బీసీసీఐ కార్యదర్శి జై షా. ఆసియాకప్ 2023 పాకిస్థాన్‌లో జరగనుండటంతో టీమ్‌ను పంపిస్తారా అన్న ప్రశ్నకు ఆయనిలా స్పందించారు.
Jay Shah on Asia Cup 2023: ఆసియా కప్ 2023 కోసం పాకిస్థాన్‌కు టీమ్‌ను పంపించడంపై బీసీసీఐ ఓ నిర్ణయానికి వచ్చేసింది. పాకిస్థాన్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ టీమ్‌ను పంపించేది లేదని మంగళవారం (అక్టోబర్ 18) జరిగిన బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశంలో నిర్ణయించారు. పాకిస్థాన్‌కు బదులుగా తటస్థ వేదికలో ఆసియా కప్ నిర్వహించాల్సిందిగా ఏసీసీపై ఒత్తిడి తీసుకురానున్నట్లు బోర్డు కార్యదర్శి జై షా స్పష్టం చేశారు.
"ఆసియా కప్ కోసం తటస్థ వేదిక అసాధారణమేమీ కాదు. మేము పాకిస్థాన్ వెళ్లకూడదని నిర్ణయించుకున్నాం" అని ఏజీఎం తర్వాత జై షా తేల్చి చెప్పారు. ఇంతకుముందు ఆసియా కప్ 2023 కోసం పాకిస్థాన్‌కు ఇండియన్ టీమ్‌ను పంపించడానికి బీసీసీఐ సుముఖంగా ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఏజీఎంతో పరిస్థితి మారిపోయింది.
2023 ఆసియా కప్ పాకిస్థాన్‌లో జరగనుండగా.. ఆ తర్వాత వన్డే వరల్డ్‌కప్ ఇండియాలో జరగనుంది. దీంతో ఆసియాకప్ కోసం ఇండియన్ టీమ్ పాకిస్థాన్ వెళ్తుందని, ఆ తర్వాత పాక్ టీమ్ కూడా వరల్డ్‌కప్ కోసం ఇండియా రానుందని ఈ మధ్యే వార్తలు వచ్చాయి. 2005-06 తర్వాత పాక్ గడ్డపై ఇండియన్ క్రికెట్ టీమ్ అడుగుపెట్టలేదు. ఆ ఏడాది పాకిస్థాన్‌లో పర్యటించిన ద్రవిడ్ నేతృత్వంలోని ఇండియన్ టీమ్ మూడు టెస్టులు, ఐదు వన్డేల సిరీస్ ఆడింది.
ఇక పాకిస్థాన్ కూడా చివరిసారి 2012లో ఇండియాలో పర్యటించింది. మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో ఆ టీమ్ ఆడింది. ఇక ఆ తర్వాత గత పదేళ్లుగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఈ రెండు టీమ్స్ ఆడుతున్నాయి. గతేడాది టీ20 వరల్డ్‌కప్ తర్వాత ఈ ఏడాది ఆసియాకప్‌లో భాగంగా రెండుసార్లు ఈ రెండు టీమ్స్ తలపడ్డాయి.
ఇక ఇప్పుడు ఆస్ట్రేలియాలో జరుగుతున్న వరల్డ్‌కప్‌లో అక్టోబర్ 23న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. దీనికోసం ఇప్పటికే టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. డిమాండ్ ఎక్కువగా ఉండటంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి కేవలం నిల్చొని మ్యాచ్ చూసేందుకు కూడా ప్రత్యేకంగా 4 వేల టికెట్లు విక్రయించడం విశేషం.