Pakistan threatens to boycott world cup: ఇండియా రాకపోతే వరల్డ్‌కప్‌ను బాయ్‌కాట్‌ చేసే ఆలోచనలో పాకిస్థాన్‌-pakistan threatens to boycott world cup if india do not come to pakistan for asia cup 2023 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Pakistan Threatens To Boycott World Cup: ఇండియా రాకపోతే వరల్డ్‌కప్‌ను బాయ్‌కాట్‌ చేసే ఆలోచనలో పాకిస్థాన్‌

Pakistan threatens to boycott world cup: ఇండియా రాకపోతే వరల్డ్‌కప్‌ను బాయ్‌కాట్‌ చేసే ఆలోచనలో పాకిస్థాన్‌

Hari Prasad S HT Telugu
Oct 18, 2022 09:57 PM IST

Pakistan threatens to boycott world cup: ఇండియా ఆసియాకప్‌లో ఆడటానికి పాకిస్థాన్‌కు రాకపోతే ఇండియాలో జరగబోయే వన్డే వరల్డ్‌కప్‌ను బాయ్‌కాట్‌ చేసే ఆలోచనలో ఆ టీమ్‌ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

<p>ఆసియాకప్ 2022 సందర్భంగా అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీతో పాక్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ రమీజ్ రాజా</p>
ఆసియాకప్ 2022 సందర్భంగా అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీతో పాక్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ రమీజ్ రాజా (AP)

Pakistan threatens to boycott world cup: ఆసియా కప్‌ 2023 విషయంలో ఇండియా, పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుల మధ్య వివాదం నెలకొంది. వచ్చ ఏడాది ఆసియా కప్‌ను తటస్థ వేదికలో నిర్వహించేలా ఏసీసీపై ఒత్తిడి తెస్తామని, టోర్నీ కోసం పాకిస్థాన్‌ వెళ్లే ప్రసక్తే లేదని బీసీసీఐ కార్యదర్శి జై షా చెప్పిన విషయం తెలుసు కదా. ఇండియన్‌ టీమ్‌ అలా చేస్తే తాము ఇండియాలో జరగబోయే వన్డే వరల్డ్‌కప్‌ను బాయ్‌కాట్‌ చేసే ఆలోచనలో పాక్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌ రమీజ్‌ రాజా ఉన్నట్లు పీటీఐ వెల్లడించింది.

"పీసీబీ ఇప్పుడ కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి, కఠినంగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉంది. మల్టీ నేషన్స్‌ టోర్నీల్లో ఇండియాతో పాకిస్థాన్‌ ఆడకపోలే ఐసీసీ, ఏసీసీలు వాణిజ్యపరమైన నష్టాలు చవిచూడాల్సి వస్తుంది" అని ఓ సీనియర్‌ పీసీబీ అధికారి హెచ్చరించినట్లు పీటీఐ తెలిపింది. అయితే ఆసియాకప్‌ 2023లో ఆడేందుకు టీమ్‌ను పాకిస్థాన్‌ పంపబోమన్న బీసీసీఐ సెక్రటరీ జై షా కామెంట్స్‌పై అధికారిక ప్రకటన విడుదల చేయడానికి మాత్రం పీసీబీ అంగీకరించలేదు.

ఇప్పుడే దీనిపై ఏమీ మాట్లాడలేమని, అయితే వచ్చే నెలలో మెల్‌బోర్న్‌లో జరగబోయే ఐసీసీ బోర్డ్‌ మీటింగ్‌లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని పీసీబీ అధికార ప్రతినిధి వెల్లడించారు. అయితే జై షా కామెంట్స్‌ మాత్రం రమీజ్‌ రాజాతోపాటు ఇతర పీసీబీ అధికారులకు ఆగ్రహం తెప్పించినట్లు పీటీఐ తెలిపింది. ఆసియాకప్‌కు మరో ఏడాది సమయం ఉన్నా.. ఇప్పుడే షా ఎందుకు స్పందించారో అర్థం కావడం లేదని ఓ అధికారి అన్నారు.

అంతేకాదు ఏషియా క్రికెట్‌ కౌన్సిల్‌.. ఆసియా కప్‌ టోర్నీని మరో వేదికకు మార్చే అంశాన్ని పరిశీలిస్తుందని జై షా ఏ హోదాలో చెప్పారని కూడా పీసీబీ అధికారి ఒకరు ప్రశ్నించారు. ప్రస్తుతం ఏసీసీ ప్రెసిడెంట్‌గా జై షానే ఉన్నారు. అయితే ఆతిథ్య హక్కులను కట్టబెట్టేది ఏసీసీ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు తప్ప ప్రెసిడెంట్‌ కాదని ఆ అధికారి గుర్తు చేశారు.

బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాకిస్థాన్‌కు ఇండియా టీమ్‌ను పంపించడంపై చర్చ జరుగుతుందని తాము ఊహించామని, అయితే ఇలా ప్రకటన వస్తుందని మాత్రం అనుకోలేదని ఆ అధికారి చెప్పారు. దీనిపై ఏసీసీకి రమీజ్‌ రాజా ఓ లేఖ రాయాలని అనుకుంటున్నారని, అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా ఆయన డిమాండ్‌ చేయవచ్చని తెలుస్తోంది.

Whats_app_banner