Ramiz Raja: నీది ఇండియానే కదా.. జర్నలిస్ట్‌పై మండిపడిన పాక్‌ క్రికెట్ బోర్డ్‌ చీఫ్‌ రమీజ్‌-ramiz raja misbehaves with a indian journalist after pakistan lost asia cup final ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ramiz Raja: నీది ఇండియానే కదా.. జర్నలిస్ట్‌పై మండిపడిన పాక్‌ క్రికెట్ బోర్డ్‌ చీఫ్‌ రమీజ్‌

Ramiz Raja: నీది ఇండియానే కదా.. జర్నలిస్ట్‌పై మండిపడిన పాక్‌ క్రికెట్ బోర్డ్‌ చీఫ్‌ రమీజ్‌

Hari Prasad S HT Telugu
Sep 12, 2022 03:52 PM IST

Ramiz Raja: నీది ఇండియానే కదా అంటూ ఓ జర్నలిస్ట్‌పై మండిపడ్డారు పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డ్‌ చీఫ్‌ రమీజ్‌ రాజా. ఆసియా కప్‌ ఫైనల్లో పాకిస్థాన్‌ ఓడిపోయిన తర్వాత ఆయన అసహనం వ్యక్తం చేశారు.

<p>ఇండియా జర్నలిస్ట్ ఫోన్ లాక్కొంటున్న రమీజ్ రాజా</p>
ఇండియా జర్నలిస్ట్ ఫోన్ లాక్కొంటున్న రమీజ్ రాజా

Ramiz Raja: ఆసియా కప్‌ ఫైనల్లో శ్రీలంక చేతిలో పాకిస్థాన్‌ ఓడిపోయిన విషయం తెలుసు కదా. అయితే ఈ ఫైనల్‌ తర్వాత పాక్‌ ఓటమిపై ఓ జర్నలిస్ట్‌ ప్రశ్నించగా.. పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌ రమీజ్‌ రాజా అసహనం వ్యక్తం చేశాడు. నీది ఇండియానే కదా అంటూ అతనిపై ఎదురుదాడికి దిగడం గమనార్హం. పీసీబీ ఛైర్మన్‌ పదవి చేపట్టినప్పటి నుంచీ ఇలాంటి వివాదాలతోనూ తరచూ రమీజ్‌ వార్తల్లో నిలుస్తున్నాడు.

ఓ క్రికెట్‌ బోర్డు ఛీఫ్‌గా ఎంతో హుందాగా అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉండగా.. రమీజ్ మాత్రం సహనం కోల్పోవడం విమర్శలకు తావిస్తోంది. సదరు ఇండియన్‌ జర్నలిస్ట్‌ కూడా అందరూ అడిగే రొటీన్‌ ప్రశ్నే అడిగాడు. ఫైనల్‌ తర్వాత స్టేడియం నుంచి బయటకు వచ్చిన రమీజ్‌ను కొందరు జర్నలిస్ట్‌లు చుట్టుముట్టారు. ఇందులో ఒక ఇండియన్‌ జర్నలిస్ట్‌ కూడా ఉన్నాడు.

ఈ ఓటమితో పాకిస్థాన్‌ అభిమానులు నిరాశకు గురై ఉంటారు. దీనిపై మీరేం చెబుతారు అని అతడు అడిగాడు. దీనికి రమీజ్‌ స్పందిస్తూ.. నీది ఇండియానే కదా అంటూ వీడియో తీస్తున్న అతని ఫోన్‌ కూడా లాక్కునే ప్రయత్నం చేశారు. సదరు జర్నలిస్టే ఈ వీడియోను తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు. తాను అడిగిన దాంట్లో తప్పేముంది అంటూ అతడు అడిగాడు.

పాక్‌ అభిమానులు చాలా నిరాశ చెంది ఉంటారు.. వాళ్లకు మీరిచ్చే సందేశమేంటని ఆ జర్నలిస్ట్‌ ప్రశ్నించాడు. "మీరు కచ్చితంగా ఇండియా నుంచి వచ్చి ఉంటారు. మీ వాళ్లు ఇంకా నిరాశ చెంది ఉంటారు" అని రమీజ్‌ అన్నాడు. దీనికి ఆ జర్నలిస్ట్‌ కూడా అవును.. మేము కూడా సంతోషంగా లేము అని అన్నాడు. ఎక్కడి అభిమానులు అని ప్రశ్నిస్తూ రమీజ్‌ ముందుకు వెళ్లాడు.

కొందరు పాక్‌ అభిమానులు ఏడుస్తూ వెళ్లడం తాను చూశానని, తానేమైనా తప్పుగా అడిగానా అంటూ ఆ జర్నలిస్ట్‌ మరో ప్రశ్న వేశాడు. దీనిపై రమీజ్‌ స్పందిస్తూ.. మీరు అభిమానులందరినీ ఒకేగాటన కడుతున్నారు అని ముందుకెళ్తూ ఆ వ్యక్తి ఫోన్‌ లాక్కునే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత తన పక్కనే వస్తున్న ఓ అభిమానిని వారిస్తూ.. తన భుజం పైనుంచి చేయి తీసి, దూరంగా జరగాలని వార్నింగ్‌ ఇచ్చాడు.

ఆదివారం (సెప్టెంబర్‌ 11) జరిగిన ఆసియా కప్‌ ఫైనల్లో పాకిస్థాన్‌ను 23 పరుగులతో ఓడించిన శ్రీలంక ఆరోసారి ఆసియాకప్‌ గెలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన లంక.. తొలి మ్యాచ్‌లో చిత్తుగా ఓడినా తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచి, ట్రోఫీ అందుకోవడం విశేషం.

Whats_app_banner

టాపిక్