PCB chief on Jay Shah: మా పాకిస్థాన్ సూపర్ లీగ్ క్యాలెండర్ కూడా మీరే ఇవ్వండి మరి.. జై షాపై పీసీబీ ఛీఫ్ సెటైర్లు
PCB chief on Jay Shah: మా పాకిస్థాన్ సూపర్ లీగ్ క్యాలెండర్ కూడా మీరే ఇవ్వండి మరి అంటూ ఏసీసీ ప్రెసిడెంట్, బీసీసీఐ సెక్రటరీ జై షాపై పీసీబీ ఛీఫ్ నజమ్ సేఠీ సెటైర్లు వేశారు. ఏసీసీ క్రికెట్ క్యాలెండర్‌ను రిలీజ్ చేయడంపై సేఠీ ఇలా స్పందించారు.
PCB chief on Jay Shah: ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుల మధ్య మరోసారి మాటల యుద్ధం ప్రారంభమైంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కూడా అయిన బీసీసీఐ సెక్రటరీ జై షా గురువారం (జనవరి 5) ఏసీసీ 2023-24 క్రికెట్ క్యాలెండర్‌ను రిలీజ్ చేయడంపై పీసీబీ ఛీఫ్ నజమ్ సేఠీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమను సంప్రదించకుండా ఏకపక్షంగా ఈ క్యాలెండర్‌ను రిలీజ్ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికే ఆసియా కప్ 2023 విషయంలో రెండు క్రికెట్ బోర్డుల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆసియాకప్‌ను పాకిస్థాన్‌లో కాకుండా మరో చోటికి తరలిస్తామని గతంలో జై షా అనడంపై పీసీబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వరల్డ్‌కప్ నుంచీ తప్పుకుంటామని హెచ్చరించింది. ఇక ఇప్పుడు ఏసీసీ క్రికెట్ క్యాలెండర్ విషయంలోనూ మరోసారి జై షా తీరుపై గుర్రుగా ఉంది.
ఆ బోర్డు ఛీఫ్ నజమ్ సేఠీ ట్విటర్ ద్వారా జై షాపై సెటైర్ వేశారు. "2023-24కుగాను ఏసీసీ స్ట్రక్చర్ & క్యాలెండర్లను ఏకపక్షంగా సమర్పించినందుకు జై షాకు కృతజ్ఞతలు. ముఖ్యంగా పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న 2023 ఆసియా కప్ కూడా అందులో ఉంది. ఈ పనితోపాటు మా పీఎస్‌ఎల్ స్ట్రక్చర్ & క్యాలెండర్‌ను కూడా మీరే సమర్పించండి. దీనిపై త్వరగా స్పందిస్తే బాగుంటుంది" అని నజమ్ సేఠీ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
ఏసీసీ క్రికెట్ క్యాలెండర్‌లో భాగంగా ఆసియా కప్ 2023 గురించి కూడా జై షా ప్రస్తావించారు. ఈ టోర్నీ ఆతిథ్య దేశం గురించి చెప్పకపోయినా.. సెప్టెంబర్‌లో టోర్నీ జరుగుతుందని, ఇండియా, పాకిస్థాన్ ఒకే గ్రూపులో ఉన్నట్లు మాత్రం ఆ క్యాలెండర్‌లో ఉంది. ఒకే గ్రూపులో ఈ దాయాదులు ఉండటంతో మరోసారి 2023లో కనీసం రెండుసార్లు తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పాకిస్థాన్ క్రికెట్‌లో ఈ మధ్యే చాలా మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పీసీబీ ఛీఫ్‌గా ఉన్న రమీజ్ రాజాను తప్పించి ఆయన స్థానంలో నజమ్ సేఠీని తీసుకొచ్చారు. ఛీఫ్ సెలక్టర్‌గా మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదిని నియమించారు. అతని ప్యానెల్‌లో మాజీ క్రికెటర్లు అబ్దుల్ రజాక్, రావ్ ఇఫ్తికార్‌లు కూడా ఉన్నారు.
సంబంధిత కథనం