PCB chief on ODI World Cup boycott: వన్డే వరల్డ్‌కప్‌ను పాకిస్థాన్ బాయ్‌కాట్ చేస్తుందా.. పీసీబీ ఛీఫ్ ఏం చెప్పారంటే..
PCB chief ODI World Cup boycott: ఇండియాలో జరగబోయే వన్డే వరల్డ్‌కప్‌ను పాకిస్థాన్ బాయ్‌కాట్ చేస్తుందా? గతంలో పీసీబీ ఛీఫ్‌గా ఉన్న రమీజ్ రాజా ఇచ్చిన ఈ వార్నింగ్‌పై తాజాగా పీసీబీ ఛీఫ్‌గా ఉన్న నజమ్ సేఠీ స్పందించారు.
PCB chief ODI World Cup boycott: వచ్చే ఏడాది ఇండియాలో జరగబోయే వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ ఆడుతుందా లేదా అన్న సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. గతంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛీఫ్‌గా ఉన్న రమీజ్ రాజా.. ఈ అంశాన్ని లేవనెత్తారు. ఒకవేళ ఆసియాకప్‌ను పాకిస్థాన్ నుంచి తరలిస్తే ఇండియాలో జరిగే వన్డే వరల్డ్‌కప్‌ను బాయ్‌కాట్ చేస్తామని ఆయన హెచ్చరించారు.
దీనిపై తాజాగా పీసీబీ కొత్త బాస్ నజమ్ సేఠీ స్పందించారు. వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ ఆడటం, ఆడకపోవడంపై నిర్ణయం అక్కడి ప్రభుత్వానిదే అని ఆయన స్పష్టం చేశారు. "ఇండియాకు వెళ్లొద్దని ప్రభుత్వం చెబితే మేము వెళ్లం. పాకిస్థాన్, ఇండియా క్రికెట్ సంబంధాలపై మనం ఓ స్పష్టతతో ఉండాలి. ఆడాలా వద్దా, టూర్‌కు వెళ్లాలా వద్దా అన్న నిర్ణయాలు అన్నీ ప్రభుత్వ స్థాయిలోనే ఉంటాయి. ఆ నిర్ణయాలను ప్రభుత్వమే తీసుకుంటుంది. పీసీబీ కేవలం స్పష్టత కోరుతుంది" అని సేఠీ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.
తాను ఆసియా క్రికెట్ కౌన్సిల్‌తోనూ చర్చిస్తూనే ఉంటానని కూడా సేఠీ తెలిపారు. పరిస్థితులకు తగినట్లుగా ముందడుగు వేస్తామని, ఏ నిర్ణయం తీసుకున్నా.. తాము ఒంటరి వాళ్లం కాకుండా ఉండేలా చూసుకుంటామని చెప్పారు. వచ్చే ఏడాది ఆసియా కప్‌కు పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీ కోసం ఇండియా పాకిస్థాన్ వెళ్లదని, టోర్నీని అక్కడి నుంచి తరలించేలా చూస్తామని బీసీసీఐ కార్యదర్శి, ఏసీసీ అధ్యక్షుడు జై షా అన్నారు.
దీనిపై అప్పటి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా తీవ్రంగా స్పందించారు. ఒకవేళ ఇండియా అలా చేస్తే.. తాము ఇండియాలో జరగబోయే వన్డే వరల్డ్‌కప్‌ను బాయ్‌కాట్ చేస్తామని హెచ్చరించారు. 2008లో చివరిసారి ఆసియాకప్ కోసం పాకిస్థాన్ వెళ్లింది టీమిండియా. అదే ఏడాది చివర్లో ముంబై దాడులు జరగడంతో రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత కూడా 2012లో ఒకసారి ఇండియా టూర్‌కు వచ్చింది పాకిస్థాన్. అప్పటి నుంచీ కేవలం ఐసీసీ, ఏసీసీ టోర్నీల్లోనే రెండు దేశాలు తలపడుతున్నాయి.
సంబంధిత కథనం