Asia Cup 2023: ఆసియా కప్ 2023.. ఒకే గ్రూపులో ఇండియా, పాకిస్థాన్
Asia Cup 2023: ఆసియా కప్ 2023లో ఒకే గ్రూపులో ఇండియా, పాకిస్థాన్ ఉన్నాయి. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఛైర్మన్ జై షా గురువారం (జనవరి 5) 2023-24 క్యాలెండర్‌ను ప్రకటించారు.
Asia Cup 2023: ఈ ఏడాది జరగనున్న ఆసియా కప్‌లో చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్థాన్ ఒకే గ్రూపులో ఉన్నాయి. 2022లో జరిగిన ఆసియాకప్‌లోనూ ఈ రెండు టీమ్స్ ఒకే గ్రూపులో ఉన్న విషయం తెలిసిందే. దీంతో గ్రూప్ స్టేజ్‌తోపాటు సూపర్ 4లోనూ మరోసారి ఈ రెండు టీమ్స్ తలపడ్డాయి. ఇండియా ఫైనల్ చేరకపోవడంతో ఒకే టోర్నీలో మూడోసారి ఇండోపాక్ వార్ చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కలేదు.
అయితే 2023లో జరిగే ఆసియాకప్‌లో మరోసారి ఆ అవకాశం రావచ్చు. ఆసియాకప్‌లో ఇండియా, పాకిస్థాన్‌తోపాటు ఓ క్వాలిఫయర్ టీమ్ ఒక గ్రూపులో ఉన్నాయి. ఇక మరో గ్రూప్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఛైర్మన్ జై షా గురువారం (జనవరి 5) 2023-24 క్రికెట్ క్యాలెండర్‌ను రిలీజ్ చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం ఆసియా కప్ 2023 ఆసియాకప్‌ను పాకిస్థాన్ నిర్వహించనుంది. అయితే వేదిక మార్పుపై ఆలోచన చేస్తున్నట్లు గతేడాది జైషా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇండియన్ క్రికెట్ టీమ్ ఎట్టిపరిస్థితుల్లోనూ పాకిస్థాన్ వెళ్లబోదని, టోర్నీని పాక్ నుంచి మరో చోటికి తరలిస్తామని ఏసీసీ ఛైర్మన్ హోదాలో జై షా చెప్పడం పాక్ క్రికెట్ బోర్డుకు మింగుడు పడలేదు. అప్పుడు పీసీబీ ఛైర్మన్‌గా ఉన్న రమీజ్ రాజా.. దీనిపై మండిపడ్డారు. ఆసియా కప్ తరలిస్తే తాము ఇండియాలో జరగబోయే వన్డే వరల్డ్‌కప్‌ను బాయ్‌కాట్ చేస్తామని కూడా హెచ్చరించారు.
ఇక ఆసియాక్రికెట్ క్యాలెండర్ విషయానికి వస్తే గురువారం తన అధికారిక ట్విటర్ ద్వారా జైషా దీనిని రిలీజ్ చేశారు. 20203, 2024 కోసం క్రికెట్ క్యాలెండర్లను సమర్పిస్తున్నాం.. గేమ్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి మేము చేస్తున్న కృషికి ఇది నిదర్శనం.. వివిధ దేశాల క్రికెటర్లు అద్భుతమైన ప్రదర్శన చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో క్రికెట్‌కు మంచి సమయం రానుంది అని జై షా ట్వీట్ చేశారు.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో పాకిస్థాన్‌లో ఆసియా కప్ జరగనుంది. దీంతోపాటు ఈ రెండేళ్లలో ఎన్నో అండర్ 16, అండర్ 19 టోర్నీలు కూడా జరగనున్నట్లు ఈ క్యాలెండర్ చూస్తే స్పష్టమవుతోంది.
సంబంధిత కథనం
టాపిక్