Babar Azam favourite match: ఇండియాను ఓడించిన ఆ మ్యాచే నా ఫేవరెట్: పాక్ కెప్టెన్ బాబర్ ఆజం
Babar Azam favourite match: ఇండియాను ఓడించిన మ్యాచే తన ఫేవరెట్ అని అన్నాడు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం. టీ20, టెస్ట్ క్రికెట్‌లో తన ఫేవరెట్ మ్యాచ్‌ల గురించి బాబర్ స్పందించాడు.
Babar Azam favourite match: పాకిస్థాన్ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజం.. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడు. కెప్టెన్‌గా అతడు విఫలమవుతున్నాడన్న విమర్శలు వస్తున్నా.. బ్యాట్స్‌మన్‌గా మాత్రం నిలకడగా రాణిస్తూనే ఉన్నాడు. ఈ మధ్యే సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లోనూ సెంచరీ చేశాడు. 2022లో టెస్టుల్లో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్‌గా బాబర్ నిలిచాడు.
ఇక ఇప్పుడతడు తన కెరీర్‌లో ఫేవరెట్ టీ20, టెస్ట్ మ్యాచ్‌లు ఏవో వెల్లడించాడు. టీ20ల విషయానికి వస్తే గతేడాది ఆసియాకప్‌లో ఇండియాను ఓడించిన మ్యాచే తన ఫేవరెట్ అని బాబర్ చెప్పాడు. ఆ టోర్నీ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఇండియా చిత్తు చేసింది. అయితే ఫైనల్‌కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఇండియాపై విజయం సాధించి ప్రతీకారం తీర్చుకుంది పాకిస్థాన్.
ఆ మ్యాచే తన ఫేవరెట్ టీ20 అని ఇప్పుడు బాబర్ చెబుతున్నాడు. తొలి మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా అద్భుతమైన ఆటతీరుతో ఇండియా గట్టెక్కినా.. కీలకమైన మ్యాచ్‌లో మాత్రం బోల్తా పడింది. ఈ సూపర్ ఫోర్ మ్యాచ్‌లో కీలకమైన సమయంలో అర్ష్‌దీప్ సింగ్ క్యాచ్ డ్రాప్ చేయడం ఇండియా కొంప ముంచిన విషయం తెలిసిందే.
అయితే ఈ మ్యాచ్ ఎంతో కీలకమైనదని, పాక్ టీమ్ ఫైనల్ వెళ్లడానికి తోడ్పడిందని బాబర్ చెప్పాడు. "టీ20 క్రికెట్‌లో ఆన ఫేవరెట్ మ్యాచ్‌లో ఆసియాకప్‌లో ఇండియాపై సాధించిన విజయమే. ఫైనల్ చేరాలంటే కీలకం కావడంతో అది మరుపురానిదిగా నిలిచిపోయింది" అని బాబర్ తెలిపాడు. అయితే ఫైనల్ చేరినా అక్కడ శ్రీలంక చేతుల్లో పాక్ టీమ్ ఓడిపోయింది.
పైగా టీ20 వరల్డ్‌కప్‌లో ఇండియా గెలిచి పాక్‌పై ప్రతీకారం తీర్చుకుంది. ఇక టెస్టుల్లో తన ఫేవరెట్ మ్యాచ్‌పై స్పందిస్తూ.. శ్రీలంకపై గాలెలో జరిగిన మ్యాచ్ అని బాబర్ చెప్పాడు. "శ్రీలంకతో గాలెలో జరిగిన తొలి టెస్ట్‌లో విజయం అద్భుతమైనది. ఎంతో కఠినమైన పిచ్‌పై 6 వికెట్లు కోల్పోయి 342 రన్స్ చేసి గెలిచాం. అబ్దుల్లా షఫీక్ రెండో ఇన్నింగ్స్‌లో 160 రన్స్ చేశాడు" అని బాబర్ చెప్పాడు.
ఇక 2022లో ఆసియాకప్‌తోపాటు టీ20 వరల్డ్‌కప్‌లలో ఫైనల్స్ చేరడం పాకిస్థాన్ క్రికెట్‌లోనే హైలైట్ అని బాబర్ అన్నాడు. ఇక గతేడాది పాకిస్థాన్ టూర్‌కు వచ్చిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ టీమ్స్‌కు కృతజ్ఞతలు చెప్పాడు.
సంబంధిత కథనం