PCB Chairman on Babar Azam: బాబర్ పాకిస్థాన్ స్టార్.. అతడు మా హృదయాల్లో ఉన్నాడు: పీసీబీ ఛీఫ్
PCB Chairman on Babar Azam: బాబర్ ఆజం పాకిస్థాన్ స్టార్.. అతడు తమ హృదయాల్లో ఉన్నాడని అన్నారు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛీఫ్ నజమ్ సేఠీ. అతడు లేని టీమ్‌ను ఊహించలేమని చెప్పారు.
PCB Chairman on Babar Azam: పాకిస్థాన్ క్రికెట్‌లో ఈ మధ్య జరుగుతున్న ఘటనలు ఆసక్తి రేపుతున్నాయి. ఇంగ్లండ్ చేతుల్లో సొంతగడ్డపై ఆ టీమ్ మూడు టెస్ట్‌ల సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురి కావడంతో ఏకంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛీఫ్‌నే తప్పించారు. ఛీఫ్ సెలక్టర్‌పైనా వేటు వేశారు. ఇక కెప్టెన్ బాబర్ ఆజంపై ఎప్పటి నుంచో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆసియాకప్ ఫైనల్, టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌తోపాటు ఇంగ్లండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో పాకిస్థాన్ ఓటమిపై మాజీ క్రికెటర్లు తీవ్రంగా స్పందించారు. బాబర్ ఆజం తీసుకుంటున్న చెత్త నిర్ణయాలు వల్లే టీమ్ ఇలా అవుతోందని వాళ్లు మండిపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పీసీబీ మాజీ బాస్ రమీజ్ రాజా కూడా బాబర్‌ను వెనకేసుకొచ్చారు. అతడు లేనిదే టీమ్ లేదు అన్నట్లుగా మాట్లాడారు.
ఇదే ప్రశ్నను కొత్త పీసీబీ ఛీఫ్ నజమ్ సేఠీని ప్రశ్నించగా.. ఆయన కూడా అలాగే స్పందించారు. "బాబర్ పాకిస్థాన్ స్టార్. అతడు లేకుంటే పాకిస్థాన్ టీమ్ తన సొంత కొడుకు లేనిదిగా అవుతుంది. అతడు మా హృదయాల్లో ఉన్నాడు. ఎప్పటికీ ఉంటాడు" అని నజమ్ ఓ రేంజ్‌లో ప్రశంసలు కురిపించారు.
బాబర్ కెప్టెన్సీపై కూడా ఈ సందర్భంగా రిపోర్టర్లు ప్రశ్నించారు. ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కెప్టెన్‌ను ఉంచే ఆలోచన ఏమైనా ఉందా అని ప్రశ్నించినప్పుడు.. క్రికెట్ నిర్ణయాలను తాను సొంతం తీసుకోనని, తాను నియమించిన కమిటీలు ఇచ్చిన సిఫారసుల మేరకు తుది నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. మొదట తాను కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
బాబర్ ఆజం కెప్టెన్సీలోని పాకిస్థాన్ తొలిసారి ఇంగ్లండ్ చేతుల్లో సొంతగడ్డపై వైట్‌వాష్‌కు గురైన విషయం తెలిసిందే. ఈ ఓటమి తర్వాత బాబర్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఆ ఓటమి సంగతి ఎలా ఉన్నా.. ఇప్పుడు న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో పాకిస్థాన్ గెలుస్తుందని తాను ఆశాభావంతో ఉన్నట్లు పీసీబీ ఛీఫ్ నజమ్ సేఠీ చెప్పారు. ఈ మ్యాచ్‌లో బాబర్ ఆజం సెంచరీతో పాకిస్థాన్ టీమ్‌ను ఆదుకున్నాడు.
సంబంధిత కథనం