Ramiz Raja on PCB: ఆఫీస్ నుంచి దారుణంగా వెళ్లగొట్టారు.. కనీసం నా వస్తువులనూ తీసుకెళ్లనీయలేదు: రమీజ్ రాజా
Ramiz Raja on PCB: ఆఫీస్ నుంచి తనను దారుణంగా వెళ్లగొట్టారని, కనీసం తన వస్తువులనూ తీసుకెళ్లే అవకాశం ఇవ్వలేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ రమీజ్ రాజా ఆరోపించారు.
Ramiz Raja on PCB: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)ని ఈ మధ్యే పూర్తిగా ప్రక్షాళన చేసిన సంగతి తెలుసు కదా. ఇంగ్లండ్ చేతుల్లో సొంత గడ్డపై పాక్ టీమ్ 0-3తో వైట్‌వాష్‌కు గురవడంతో పీసీబీ ఛీఫ్ రమీజ్ రాజాను తప్పించింది అక్కడి ప్రభుత్వం. కొత్త ఛీఫ్‌గా నజమ్ సేఠీని నియమించడంతోపాటు 14 మంది సభ్యుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
అయితే పీసీబీ నుంచి తనను ఎంత అవమానకరంగా సాగనంపారో చెబుతూ రమీజ్ సోమవారం సోషల్ మీడియాలో తన గోడు వెల్లబోసుకున్నారు. కొత్త ఛీఫ్ సేఠీపైనా ఆయన ఆరోపణలు చేశారు. "క్రికెట్ బోర్డుపైకి వచ్చి దాడి చేశారు. నా వస్తువులను కూడా తీసుకోనివ్వలేదు. ఉదయం 9 గంటలకే 17 మంది పీసీబీలోకి దూసుకొచ్చారు. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆఫ్ పాకిస్థాన్ వాళ్లు దాడి చేసినట్లుగా వాళ్లు వచ్చారు" అని రమీజ్ వివరించారు.
తన యూట్యూబ్ ఛానెల్‌లో రమీజ్ మాట్లాడుతూ.. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఇప్పుడు బోర్డులో ఉన్న వాళ్లకు అసలు క్రికెట్‌పై ఆసక్తి లేదని కూడా విమర్శించారు. "వాళ్లకు క్రికెట్‌పై అసలు ఆసక్తి లేదు. క్రికెట్ బోర్డు వాళ్లను పవర్‌ఫుల్ స్థానాల్లో నియమించింది. వాళ్లకు కావాల్సింది ఏంటంటే.. అందరూ వాళ్ల ముందే పని చేయాలి" అని రమీజ్ అన్నారు.
"ఒక్క వ్యక్తికి పదవి ఇవ్వడానికి మొత్తం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు రాజ్యాంగాన్నే మార్చేశారు. కేవలం నజమ్ సేఠీని తీసుకురావడానికి ఇలా రాజ్యాంగాన్నే మార్చడం ప్రపంచంలో నేను ఎక్కడా చూడలేదు. సీజన్ మధ్యలో, ఇతర టీమ్స్ పాకిస్థాన్‌కు వచ్చి ఆడుతున్న సమయంలో ఇలా చేశారు. ఛీఫ్ సెలక్టర్‌ను కూడా మార్చేశారు. మహ్మద్ వాసిమ్ మంచి సెలక్షన్ చేసినా, చేయకపోయినా అతడో మాజీ క్రికెటర్ అన్న విషయం గుర్తుంచుకొని గౌరవప్రదంగా సాగనంపాల్సింది" అని రమీజ అన్నారు.
"ఈ నజమ్ సేఠీ రాత్రి 2.15 గంటలకు ట్వీట్ చేశారు. రమీజ్‌ను తొలగించాం. నాకు శుభాకాంక్షలు చెప్పండి అని. నేను టెస్ట్ క్రికెట్ ఆడాను. ఇలాంటి క్రికెట్‌కు సంబంధం లేని వాళ్లు క్రికెట్‌ను కాపాడటానికి ప్రయత్నించాలని చూడటం చూస్తుంటే బాధేస్తుంది. వీళ్లకు క్రికెట్‌పై ఆసక్తి లేదు. కేవలం ప్రజల దృష్టిని ఆకర్షించడానికే వచ్చారు" అని రమీజ్ విమర్శించారు.
గతేడాది సెప్టెంబర్‌లో అప్పటి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. పీసీబీ ఛీఫ్‌గా రమీజ్‌ను నియమించారు. 15 నెలల పాటు ఆ పదవిలో రమీజ్ కొనసాగారు. ఈ కాలంలో వైట్ బాల్ క్రికెట్‌లో పాకిస్థాన్ చెప్పుకోదగిన ప్రదర్శన చేసింది. రెండు టీ20 వరల్డ్‌కప్‌లలో సెమీస్ చేరింది. ఆసియా కప్ ఫైనల్లో ఆడింది.
సంబంధిత కథనం
టాపిక్