PCB Chairman Ramiz Raja: ఇంగ్లండ్‌పై వైట్‌వాష్‌ ఫలితం.. పీసీబీ ఛీఫ్‌ రమీజ్‌ రాజా పదవి ఊడింది-pcb chairman ramiz raja sacked after pakistans white wash against england
Telugu News  /  Sports  /  Pcb Chairman Ramiz Raja Sacked After Pakistans White Wash Against England
రమీజ్ రాజా
రమీజ్ రాజా

PCB Chairman Ramiz Raja: ఇంగ్లండ్‌పై వైట్‌వాష్‌ ఫలితం.. పీసీబీ ఛీఫ్‌ రమీజ్‌ రాజా పదవి ఊడింది

21 December 2022, 16:14 ISTHari Prasad S
21 December 2022, 16:14 IST

PCB Chairman Ramiz Raja: ఇంగ్లండ్‌ చేతుల్లో పాకిస్థాన్‌ వైట్‌వాష్‌ కావడంతో ఆ దేశంలో తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌ రమీజ్‌ రాజా పదవి కూడా ఊడింది.

PCB Chairman Ramiz Raja: పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌ రమీజ్‌ రాజా తన పదవి కోల్పోయారు. మంగళవారం (డిసెంబర్‌ 20) ఇంగ్లండ్‌ చేతుల్లో పాకిస్థాన్‌ మూడు టెస్ట్‌ల సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన మరుసటి రోజే పీసీబీ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. సొంతగడ్డపై ఇంగ్లండ్‌ చేతుల్లో ఈ పరాభవాన్ని ఆ దేశ మాజీ క్రికెటర్లు, అభిమానులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఏకంగా క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌నే ఇంటికి సాగనంపడం గమనార్హం. అటు పాకిస్థాన్‌ క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజంను కూడా కెప్టెన్సీ నుంచి దింపాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో రమీజ్‌ రాజా పీసీబీ ఛీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన పీసీబీ ఛైర్మన్‌ అయిన తర్వాత పాకిస్థాన్‌ రెండు టీ20 వరల్డ్‌కప్‌లు ఆడింది. ఈ ఏడాది ఫైనల్‌ వరకూ వచ్చిన కప్పు గెలవలేకపోయింది.

రమీజ్‌ రాజాను పీసీబీ పదవి నుంచి తప్పించగానే ఆయన స్థానంలో నజమ్ సేఠీని కొత్త ఛైర్మన్‌గా పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ నియమించినట్లు సమాచారం. పీసీబీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో తరచూ ఇండియాతో కయ్యానికి కాలు దువ్వేవారు రమీజ్‌ రాజా. వచ్చే ఏడాది ఆసియా కప్‌ వేదికను పాకిస్థాన్‌ను మార్చనున్నట్లు వచ్చిన వార్తలపైనా ఆయన తీవ్రంగా స్పందించారు. అలా చేస్తే తాము ఇండియాలో జరగబోయే వన్డే వరల్డ్‌కప్‌ నుంచి కూడా తప్పుకుంటామని హెచ్చరించారు.