Kaneria About Babar: బాబర్‌ను కోహ్లీతో పోల్చకండి.. కెప్టెన్‌గా అతడు పెద్ద జీరో.. పాక్ మాజీ సంచలన వ్యాఖ్యలు
Kaneria About Babar: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజంను టీమిండియా రన్నింగ్ మెషిన్ విరాట్ కోహ్లీతో పోల్చవద్దంటూ పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా అభిప్రాయపడ్డాడు. బాబర్.. కెప్టెన్‌గా పెద్ద జీరో అంటూ ఫైర్ అయ్యాడు.
Kaneria About Babar: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త రికార్డులతో దూసుకెళ్తున్నాడు. గత కొన్నేళ్లుగా అతడు భీకర ఫామ్‌లో ఉండటమే కాకుండా పరుగుల వరద పారిస్తున్నాడు. దీంతో క్రికెట్ నిపుణులు, అభిమానులు అతడిని విరాట్ కోహ్లీతో పోలుస్తున్నారు. అయితే నిజంగా బాబర్ ఆజం.. కోహ్లీతో సమానంగా నిలుస్తాడా? అంటే ఆలోచించుకోవాల్సిందే. ఇదే విషయంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా తన స్పందనను తెలియజేశాడు. తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడి అతడు.. కోహ్లీతో బాబర్‌ను పోల్చడం ఆపాలని స్పష్టం చేశాడు.
"బాబర్ ఆజంను విరాట్ కోహ్లీతో పోల్చడం మానుకోవాలి. కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి గ్రేట్ ప్లేయర్లతో పోల్చడం సరికాదు. వారు చాలా పెద్ద ఆటగాళ్లు. పోల్చుదామన్నా వారితో సమానంగా పాక్ జట్టులో ఒక్కరూ లేరు. కోహ్లీతో పోల్చడం వల్ల హీరోల్లా ఫీలవుతున్నారు. తీరా ఫలితాల దగ్గరకు వచ్చేసరికి జీరోలుగా మారుతున్నారు." అని డానిష్ కనేరియా ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
బాబర్ టెస్టు కెప్టెన్సీ నైపుణ్యాలను తీవ్రంగా విమర్శించాడు కనేరియా. ఇంగ్లాండ్‌తో పాక్ ఓడిపోవడంపై మండిపడ్డాడు.
"టెస్టు క్రికెట్‌లో పాకిస్థాన్‌కు సారథ్యం వహించే సామర్థ్యంలో అతడిలోలేదు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, ఆ జట్టు కోచ్ బ్రెండన్ మెక్‌క్కలమ్ నుంచి అతడు నేర్చుకోవాలి. కెప్టెన్‌గా బాబర్ ఆజం పెద్ద జీరో. తన ఈగోను పక్కనపెట్టి కెప్టెన్ అహ్మద్‌ను సర్ఫరాజ్ అహ్మద్‌ను అడిగి తెలుసుకోవాలి" అని కనేరియా తెలిపాడు.
ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20, టెస్టు సిరీస్‌ల్లో ఘోరంగా ఓడిపోయింది పాకిస్థాన్. ముఖ్యంగా 3 టెస్టుల సిరీస్‌ను ఇంగ్లీష్ జట్టు క్లీన్ స్వీప్ చేసింది. తమ సొంత గడ్డపై జరిగిన ఈ సిరీస్‌లో పాక్ పరాజయం కావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులతో పాటు మాజీలు కూడా పాక్ జట్టుపై తీవ్రంగా విమర్శలు సంధిస్తున్నారు.