Babar Azam Record: బాబర్‌ ఆజం మరో రికార్డు.. రూట్‌ను వెనక్కి నెట్టిన పాకిస్థాన్‌ కెప్టెన్‌-babar azam record as he becomes highest run scorer in tests in 2022 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Babar Azam Record: బాబర్‌ ఆజం మరో రికార్డు.. రూట్‌ను వెనక్కి నెట్టిన పాకిస్థాన్‌ కెప్టెన్‌

Babar Azam Record: బాబర్‌ ఆజం మరో రికార్డు.. రూట్‌ను వెనక్కి నెట్టిన పాకిస్థాన్‌ కెప్టెన్‌

Hari Prasad S HT Telugu
Dec 26, 2022 03:35 PM IST

Babar Azam Record: బాబర్‌ ఆజం మరో రికార్డు క్రియేట్‌ చేశాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ జో రూట్‌ను వెనక్కి నెట్టాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో అతడు పాక్‌ టీమ్‌ను సెంచరీతో ఆదుకున్నాడు.

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం (AFP)

Babar Azam Record: పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం మరో రికార్డును తన పేరిట రాసుకున్నాడు. న్యూజిలాండ్‌తో సోమవారం (డిసెంబర్‌ 26) ప్రారంభమైన టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన బాబర్‌.. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ జో రూట్‌ను వెనక్కి నెట్టాడు. 2022లో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా బాబర్ నిలవడం విశేషం.

ఇప్పటి వరకూ జో రూట్‌ 15 మ్యాచ్‌లలో 1098 రన్స్‌ చేసి టాప్‌లో ఉన్నాడు. రూట్‌ సగటు 47.75 కాగా.. ఐదు సెంచరీలు చేశాడు. ఇప్పుడు బాబర్ ఆ రికార్డును బ్రేక్‌ చేశాడు. అది కూడా కేవలం 9 టెస్టుల్లోనే కావడం మరో విశేషం. టెస్టుల్లోనే కాదు ఓవరాల్‌గా కూడా 2022లో అత్యధిక రన్స్‌ చేసిన ఘనత బాబర్‌ ఆజందే. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో ఈ ఏడాది 2 వేలకు పైగా రన్స్ చేసిన ఏకైక బ్యాటర్‌ కూడా బాబరే.

ఈ లిస్ట్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన లిటన్‌ దాస్‌ రెండోస్థానంలో ఉన్నాడు. లిటన్‌ 2022లో 1921 రన్స్‌ చేశాడు. ఇక ఇప్పుడు కరాచీలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన పాకిస్థాన్‌ను బాబర్‌ ఆజం ఆదుకున్నాడు. ఈ క్రమంలో టెస్టుల్లో అతడు 9వ సెంచరీ చేశాడు. 19 పరుగులకే 2 వికెట్లు పడిన సందర్భంలో క్రీజులోకి వచ్చిన బాబర్‌.. కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు.

బ్రేస్‌వెల్‌ బౌలింగ్‌లో సిక్స్‌తో బాబర్‌ సెంచరీ చేయడం విశేషం. న్యూజిలాండ్‌పై అతనికిది 2వ సెంచరీ. ఈ ఏడాది టెస్టుల్లో బాబర్‌ ఆజం 4 సెంచరీలు చేశాడు. ఓ కెప్టెన్‌ ఈ ఏడాది టెస్టుల్లో చేసిన అత్యధిక సెంచరీలు ఇవే. ఈ మధ్యే సొంతగడ్డపై ఇంగ్లండ్‌ చేతుల్లో వైట్‌వాష్‌కు గురైన తర్వాత తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న బాబర్‌ ఆజం.. ఒత్తిడిలోనూ న్యూజిలాండ్‌పై సెంచరీతో టీమ్‌ను ఆడుకున్నాడు.