Ashes Series: క్రికెట్‌లో ఫీల్డర్లు ఇలా నిలబడటం ఎప్పుడైనా చూశారా.. బెన్ స్టోక్స్ సూపర్ కెప్టెన్సీ
19 June 2023, 16:27 IST
- Ashes Series: క్రికెట్‌లో ఫీల్డర్లు ఇలా నిలబడటం ఎప్పుడైనా చూశారా? ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆస్ట్రేలియా బ్యాటర్ ఉస్మాన్ ఖవాజాను ఔట్ చేయడానికి ఇలాంటి ఫీల్డింగ్ సెట్ చేసి వికెట్ సాధించాడు.
పిచ్ కు ఇరువైపులా అడ్డుగోడలా నిల్చున్న ఇంగ్లండ్ ఫీల్డర్లు
Ashes Series: టెస్ట్ క్రికెట్ లో ఫీల్డింగ్ సెట్ చేయడం ఓ కళ. బ్యాటర్ ను ఔట్ చేయడానికి ప్రత్యర్థి కెప్టెన్లు వింతవింత ఫీల్డింగ్ సెట్ చేస్తుంటారు. ఫీల్డర్లందరినీ స్లిప్స్ లో ఉంచడం, లేదంటే బ్యాటర్ చుట్టూ ఉంచడం తరచూ చేస్తుంటారు. కానీ యాషెస్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సెట్ చేసిన ఫీల్డింగ్ క్రికెట్ పండితులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
సాంప్రదాయ ఫీల్డింగ్ కు పూర్తి విరుద్ధంగా స్టోక్స్ ఫీల్డింగ్ సెట్ చేశాడు. ఆస్ట్రేలియా బ్యాటర్ ఉస్మాన్ ఖవాజాను ఔట్ చేయడానికి స్టోక్స్ ఫీల్డర్లందరినీ పిచ్ కు అటూ ఇటూ స్లిప్ ఫీల్డర్లను నిలబెట్టినట్లుగా నిలబెట్టాడు. ఖవాజా అసలు అటు ఆఫ్ సైడ్, ఇటు లెగ్ సైడ్ షాట్లు ఆడే వీల్లేకుండా చేశాడు. ఏకంగా ఆరుగురు ఫీల్డర్లను తీసుకొచ్చి ఆఫ్ సైడ్ ముగ్గురిని, లెడ్ సైడ్ ముగ్గురిని నిలబెట్టాడు.
ఓలీ రాబిన్సన్ ను ఫుల్ లెంగ్త్ డెలివరీ వేయాల్సిందిగా చెప్పాడు. అతడు అలాగే బౌలింగ్ చేయగా.. ముందుకొచ్చి ఆడబోయిన ఖవాజా క్లీన్ బౌల్డయ్యాడు. సెంచరీతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ను నిలబెట్టిన ఖవాజాను ఇలాంటి సాంప్రాదాయ విరుద్ధమైన ఫీల్డింగ్ సెట్ చేయడం ద్వారా ఔట్ చేయడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఇప్పటికే బజ్‌బాల్ పేరుతో టెస్ట్ క్రికెట్ లోనూ వేగంగా పరుగులు చేస్తూ ఓ కొత్త స్టైల్ ను ప్రపంచ క్రికెట్ కు ఇంగ్లండ్ పరిచయం చేసింది. ఈ స్టైల్ తోనే స్టోక్స్ కెప్టెన్సీలో దూసుకెళ్తోంది. ఇప్పుడదే స్టోక్స్ ఫీల్డ్ సెటింగ్ లోనూ ఇతరు కెప్టెన్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. అసలు టెస్ట్ క్రికెట్ ను ఇలా కూడా ఆడొచ్చా అనే రీతిలో ఇంగ్లండ్ టీమ్, కెప్టెన్ స్టోక్స్ వ్యవహరిస్తుండటం విశేషం.