Mahesh Babu on Ashes: యాషెస్ టెస్టు గురించి మహేశ్ బాబు ట్వీట్.. ఆశ్చర్యం వ్యక్తం చేసిన సూపర్ స్టార్
17 June 2023, 16:58 IST
- Mahesh Babu on Ashes: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్ తొలి టెస్టు గురించి టాలీవుడ్ హీరో మహేశ్ బాబు ట్వీట్ చేశాడు. ఇంగ్లండ్ అనూహ్య నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
మహేశ్ బాబు, బెన్ స్టోక్స్
Mahesh Babu on Ashes: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు క్రికెట్ అంటే బాగా ఇష్టం. ఆయన క్రికెట్ మ్యాచ్‍లను తరచూ చూస్తుంటారు. అయితే.. ప్రస్తుతం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్ తొలి టెస్టు గురించి మహేశ్ బాబు ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. తొలి టెస్టు మొదటి రోజున ఇంగ్లండ్ తీసుకున్న అనూహ్య నిర్ణయం గురించి మహేశ్ ట్వీట్ చేశాడు. ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇది నూతన శకం క్రికెట్ అంటూ పేర్కొన్నాడు.
బర్మింగ్‍హామ్ వేదికగా శుక్రవారం యాషెస్ తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడింది. వేగంగా పరుగులు చేసింది. జో రూట్ (152 బంతుల్లో 118) శతకంతో అదరగొట్టాడు. జానీ బెయిర్‌స్టో (78 బంతుల్లో 78 పరుగులు) వేగంగా ఆడాడు. అయితే, 8 వికెట్లకు 393 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. మొదటి రోజు పూర్తవకుండానే డిక్లేర్ ఇచ్చింది. ఈ అనూహ్య నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. టెస్టుల్లో తొలి రోజే అదీ 400 పరుగుల లోపే డిక్లేర్ ఇవ్వడం అనూహ్యమే. అయితే, ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీనిపైనే టాలీవుడ్ స్టార్ మహేశ్ బాబు స్పందించాడు.
ఇంగ్లండ్ తీసుకున్న డిక్లేర్ నిర్ణయం గురించి మహేశ్ బాబు ట్వీట్ చేశాడు. “393-8 డిక్లేర్డ్.. నేను చదువుతున్నది సరైనదేనా.. వావ్.. జస్ట్ వావ్.. కొత్త తరం క్రికెట్‍ను చూస్తున్నాం.. బజ్‍బాల్” అని మహేశ్ బాబు ట్వీట్ చేశాడు. ఇంగ్లండ్ అనూహ్య నిర్ణయానికి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
బ్రెండెన్ మెక్‍కలమ్ హెడ్ కోచ్‍గా వచ్చాక ఇంగ్లండ్ ఇటీవల టెస్టు క్రికెట్‍ను దూకుడుగా ఆడుతోంది. అయితే, ఇది కొన్నిసార్లు ఫలిస్తున్నా.. మరికొన్నిసార్లు వికటిస్తోంది. అయితే, స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లండ్ మాత్రం దూకుడు మంత్రానికే కట్టుబడి సాగుతోంది.
ఈ తొలి టెస్టు రెండో రోజు.. 14 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ కొనసాగిస్తోంది. 15.3 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (9), మార్నస్ లబుషేన్ (0)ను ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఔట్ చేశాడు. క్రీజులో ఉస్మాన్ ఖవాజా (22 నాటౌట్), స్టీవ్ స్మిత్ (7 నాటౌట్) ఉన్నారు.