Magha masam: మాఘ మాసం ఎందుకంత ప్రత్యేకం? ఈ మాసంలో ఏమి చేయాలి?
03 February 2024, 18:00 IST
- Magha masam: కార్తీక మాసం తర్వాత అంత ప్రాముఖ్యత కలిగిన మాసం మాఘ మాసం. ఈ మాసంలో అనేక పండుగలు వస్తాయి. వివాహాది శుభకార్యాలు నిర్వహించేందుకు అనువైన మాసం. ఈ మాఘ మాసం ఎందుకంత ప్రత్యేకమైనదో ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ చక్కగా వివరించారు.
మాఘ మాసం ఎందుకంత ప్రత్యేకం?
Magha masam: అఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అని అర్ధము. మాఘము అంటే పాపాలను నశింపజేసేది అనే అర్ధాన్ని పండితులు చెబుతున్నారు. అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం ప్రత్యేక విశిష్టతను సంతరించుకుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
మాఘ విశిష్టతను గురించి ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి ఉదయకాలపు స్నానాలు చేయడం ఓ వ్రతంగా ఉంది. మాఘమాసంలో ఎవరికి వారు వీలున్నంతలో నది, చెరువు, మడుగు, కొలను, బావి చివరకు చిన్న నీటి పడియలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం అబ్బుతుంది. చలికి భయపడక ఉదయాన్నే నదీస్నానం చేయటం సర్వోత్తమం.
ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన, నువ్వులతో హోమం, నువ్వుల దానం, నువ్వుల భక్షణం లాంటివి ముఖ్యమైనవి. మాఘమాసంలో శుద్ధ విదియనాడు బెల్లం, ఉప్పు దానం చేయడం మంచిది. దీంతో పాటు పార్వతీపూజ, లలితావ్రతం, హరతృతీయ వ్రతం చేస్తుంటారు. శుద్ధ చవితిన చమాపూజ, వరదాగౌరీ పూజ, గణేశ పూజ చేయడం, మొల్ల పువ్వులతో శివపూజ చెయ్యడం ఉంది. ఈ చవితినాడు చేసే తిలదానానికి గొప్ప పుణ్యఫలం చెప్పారు. శుద్ధ పంచమిని శ్రీపంచమి అని అంటారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
మాఘ మాసంలో వచ్చే పండుగలు ఇవే
ఈ రోజున సరస్వతీ పూజ చేయడం విశేష ఫలప్రదం. దీన్నే కొన్ని ప్రాంతాల్లో వసంత పంచమి, రతికొమదహనోత్సవం అనే పేరున జరుపుకుంటారు. శుద్ద షష్టిని విశోక షష్టి అని, మందార షష్టి అని, రామ షష్టి అని, వరుణ షష్టి అని కూడా అంటారు. ఈ రోజున వరుణదేవుడిని ఎర్ర చందనం, ఎర్రని వస్త్రాలు, ఎర్రని పుష్పాలు, ధూప దీపాలతో పూజించాలి. శుద్ధ సప్తమిని రథసప్తమి అని అంటారు. ఈ రోజున సూర్యజయంతిని జరుపుతారు.
రథసప్తమి వ్రతం ఎంతో విశేషమైనది. అష్టమినాడు భీష్మాష్టమి చేస్తారు. కురువృద్ధుడు భీష్ముడికి తర్పణాలు విడవడం ఈనాటి ప్రథానాంశం. నవమినాడు నందినీ దేవి పూజ చేస్తారు. దీన్నే మధ్య్వనవమి అని అంటారు. ఆ తర్వాత వచ్చే ఏకాదశికి జయ ఏకాదశి అని పేరు. దీన్నే భీష్మఏకాదశి వ్రతమని చెబుతారు. కురువృద్ధుడు భీష్మాచార్యుడు మరణించిన సందర్భం గుర్తుకు తెచ్చుకుంటారు. ఈ తిథినాడే అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి కల్యాణం జరుపుతారు. ద్వాదశినాడు వరాహద్వాదళీ వ్రతం చేస్తారు. త్రయోదశి విశ్వకర్మ జయంతిగా పేరుపొందింది.
మాఘ పూర్ణిమకు మరింత విశిష్టత ఉంది. ఈ రోజున కాళహస్తిలో స్వర్ణముఖీ నదిలో స్నానం చేయటం, ప్రయాగ త్రివేణీ సంగమంలో స్నానం చేయటం విశేష ఫలప్రదాలు. సతీదేవి జన్మించిన తిథిగా మాఘ పూర్ణిమను చెబుతారు. మాఘమాసంలో వచ్చే కృష్ణ పాడ్యమినాడు సౌభాగ్యప్రాప్తి వ్రతం చేస్తారు. కృష్ణ సప్తమినాడు సర్వాప్త సప్తమి వ్రతం, సూర్యవ్రతాలు జరుగుతాయి. అష్టమినాడు మంగళావ్రతం చేస్తుంటారు. కృష్ణ ఏకాదశిని విజయ ఏకాదశి అని, రామసేతు నిర్మాణం పూర్తి అయిన రోజును గుర్తు చేసే తిథి అని చెబుతారు. కృష్ణ ద్వాదశినాడు తిలద్వాదశీవ్రతం జరుపుతుంటారు.
మాఘ కృష్ణ త్రయోదశి ద్వాపర యుగానిదిగా పేర్కొంటారు. మాఘ కృష్ణ చతుర్దశినాడు మహా శివరాత్రి పర్వదిన వ్రతం జరుపుతారు. మాఘ మాసంలో చివరిదైన కృష్ణ అమావాస్య నాడు పితృ శ్రాద్ధం చెయ్యటం అధిక ఫలప్రదమని పెద్దలు అంటారు. ఇలా మాఘ మాసంలో ఎన్నెన్నో వ్రతాలు, పర్వదినాలు, వివిధ దేవతలను ఉద్దేశించి జరుపుకోవటం కనిపిస్తుంది. అందుకే ఈ మాసానికి తొలినాళ్ళ నుంచి అంత విశిష్టత ఉందని ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
మాఘ స్నానం ప్రాముఖ్యత
స్నానం: సాధారణ స్నానం దేహాల్ని శుద్ధి చేసి మనలోని ప్రకోపాన్ని తగ్గించి శాంతాన్ని, స్థిరత్వాన్ని కలిగిస్తుందంటారు. అందుకే స్నానం నిత్యవిధి అని విజ్ఞులు చెబుతారు. జపహోమాది కర్మలకు, పితృ, దైవకార్యాలకు శరీర స్నానం చేతనే అధికారం కలుగుతుంది. వివిధ కార్యక్రమాలకు చేసే స్నానాలను నిత్యస్నానం, నైమిత్తిక స్నానం, కామ్యస్నానం, క్రియాంశస్నానం, అభ్యంగన స్నానం, క్రియా స్నానం అని ఆరు విధాలుగా చెబుతారు.
వైశాఖ, కార్తీక, మాఘ మాసాల్లో ప్రత్యేక ఫలితాలను ఆశిస్తూ ఆచరించే స్నానాలు, యజ్ఞయాగాదుల్లో చేసే స్నానాలను 'కామ్యస్నానాలు'గా వ్యవహరిస్తారని ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
చంద్రుడు మాఘ నక్షత్రాన ఉండే మాసం మాఘం. 'మఘం' అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్టమైనదిగా భావించేవారు. యజ్ఞాలకు అధిష్టాన దైవం ఇంద్రుడు. ఇంద్రునికి "మఘవుడు” అనే పేరు కూడా ఉంది. ఈ మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం కనుక మాఘ మాసమైంది. ఇది శిశిర రుతువు మాసం. చెట్లు ఆకులు రాల్చే కాలం. ఉసిరికలు విసృతంగా కాచే వేళ శూన్య మాసమైన పుష్యమాసం తరువాత వచ్చే కల్యాణ కారక మాసమని చిలకమర్తి తెలిపారు.
మాఘస్నానం పవిత్ర స్నానంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం. మాఘస్నానాలు సకల కలుషాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం. మాఘ స్నానం మాహా తాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటోంది. మృకండు ముని, మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్మండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం.
ఏ స్నానం ఎటువంటి ఫలితం ఇస్తుంది?
మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయంలో సూర్యకిరణాల్లో ఉండే అతినీలలోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులు వస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి 20 నుంచి మార్చి 30వ తేదీవరకూ సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని, వేగంగా ప్రవహించే నీళ్ళలో చేసే స్నానాలు శ్రేష్టమని పేర్కొంటున్నారు. ఈ స్నానాలకు అధిష్టాన దైవం సూర్యభగవానుడు. స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ఒక సంప్రదాయం. మాఘ స్నాన విధులను మాఘపురాణం పేర్కొంటోందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహస్నానంతోనైనా ఆరు సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుందంటారు. బావినీటి స్నానం పన్నెండేళ్ళ పుణ్య ఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీ స్నానం చాతుర్లుణం, మహానదీ స్నానం శతగుణం, గంగా స్నానం సహస్రగుణం, త్రివేణీ సంగమ స్నానం నదీ శతగుణ ఫలాన్ని ఇస్తాయని పురాణ వచనం. మాఘస్నానంలో దివ్యతీర్థాలను స్మరించి పాప వినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయం. స్నాన సమయంలో ప్రయాగను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం. మాఘ పూర్ణిమను 'మహా మాఘం' అంటారు. ఇది ఉత్కృష్టమైన పూర్ణిమ. స్నానదాన జపాలకు అనుకూలం. ఈ రోజున సముద్ర స్నానం మహిమాన్విత ఫలదాయకమంటారని ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.