Jagannath temple: పూరీ జగన్నాథుడి ఆలయానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు
13 June 2024, 15:02 IST
- Jagannath temple: పూరీ తీరంలో ఉన్న జగన్నాథుడి ఆలయం ఎన్నో వింతలు, విశేషాలకు నిలయంగా ఉంటుంది. ఈ ఆలయానికి సంబంధించి మిస్టరీని చేధించేందుకు శాస్త్రవేత్తలు ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారని చెబుతారు.
పూరీ జగన్నాథ ఆలయం
Jagannath temple: ఒడిశాలోని పూరీ జగన్నాథ దేవాలయం సంస్కృతిక, ఆధ్యాత్మిక చరిత్రకు గొప్ప ప్రదేశం. ఈ అద్భుతమైన ఆలయ నిర్మాణం వెనుక ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో(జూన్ లేదా జులై) జరిగే జగన్నాథుడి రథయాత్ర అత్యంత కనుల వైభవంగా జరుగుతుంది.
ఏటా జరిగే ఈ రథోత్సవంలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వెళతారు. ఈ సుప్రసిద్ధ దేవాలయం కేవలం మతపరమైన భక్తికి ప్రాతినిధ్యం వహించడమే కాకుండా శిల్పకళా నైపుణ్యానికి ప్రతిరూపం. మరికొన్ని రోజుల్లో జగన్నాథ రథయాత్ర ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ ఆలయం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీ కోసం.
నీడ పడదు
సాధారణంగా ఏ ఆలయానికైనా నీడ పడుతుంది. కానీ ఈ ఆలయానికి మాత్రం నీడ పడదు. అది ఎందుకు అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చెప్తారు. జగన్నాథుడి అద్భుతాలలో ఇది ఒకటిగా చెప్తారు. ఇప్పటికీ ఆలయం నీడ ఎందుకు పడలేదని విషయం గురించి ఎన్నో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. భారతదేశంలో ఉన్న మిస్టరీ ఆలయాల్లో ఇదీ ఒకటి.
గాలి వ్యతిరేక దిశలో వీస్తుంది
సముద్ర తీరం దగ్గర గాలి ఉదయం సముద్రం నుంచి భూమి వైపు వీస్తుంది. అలాగే సాయంత్రం వేళ భూమి వైపు నుంచి సముద్రం మీదకు వీస్తుంది. కానీ ఇక్కడ తీరంలో మాత్రం వ్యతిరేక దిశలో గాలి వీస్తుంది. అలా ఎందుకు జరుగుతుందనేది ఇంకా ఇప్పటికి మిస్టరీగానే ఉంది. ఇది అందరినీ విస్మయానికి గురి చేస్తుంది.
సుదర్శన చక్రం
దేవాలయంపైన సుదర్శన చక్రం ఉంటుంది. భారీ లోహం నిర్మాణం ఇది. పురాతన కాలానికి సంబంధించిన సాంకేతిక నైపుణ్యానికి ఇదొక స్మారక చక్రం. కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి ఈ సుదర్శన చక్రం అందరికీ కనిపిస్తుంది. అయితే ఈ నిర్మాణం ఏ వైపు నుంచి చూసినా ఎదురుగా చూసినట్టే కనిపిస్తుంది. అది అలా ఎందుకు ఉంటుందో ఇప్పటికీ ఎవరి ఊహకు అందలేదు.
పక్షులు ఎగరవు
సాధారణంగా పక్షులు ఆకాశంలో ఏ సమయంలోనైనా ఎక్కడైనా విహరిస్తాయి. కానీ జగన్నాథ దేవాలయం పై మాత్రం పక్షులు ఎగరవు. ఇది ఆలయ పవిత్రతను బలపరుస్తుంది. దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి అనేది ఇప్పటికీ అంతు చిక్కలేదు. దేవతలను గౌరవించి పక్షులు ఆలయం మీద ఎగరవని అంటారు.
సముద్ర ఘోష వినిపించదు
సింహ ద్వారం ఉన్న నుంచి జగన్నాథ దేవాలయంలోకి ప్రవేశించగానే సముద్రపు అలల శబ్దం వినిపించదు. మళ్లీ ఆలయం నుంచి బయటికి రాగానే సముద్రపు అలల శబ్దం వినిపిస్తుంది. చాలా సందర్భాలలో ఇటువంటి సంఘటన సాయంత్రం వేళ జరుగుతుంది. అయితే దీనికి శాస్త్రీయపరమైన కారణం ఏమీ లేదు. ఈ ఆలయంలోని సుభద్ర దేవి ప్రశాంతతను కోరుకుంటుందని అందుకే ఇలా జరుగుతుందని స్థానిక పురాణాలు చెబుతున్నాయి.
వంట కోసం ప్రత్యేక విధానం
ఆలయం లోపల వంట గదిలో వంట కోసం ప్రత్యేక విధానాన్ని అవలంభిస్తారు. కట్టెల పొయ్యి మీద ఏడు కుండలు పేర్చి పెట్టి వంట చేస్తారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అన్నింటికంటే పైన ఉన్న కుండ మొదటిగా ఊదుకుటుంది. ఆ తర్వాత ఇతర కుండలోని ఆహారం అదే క్రమంలో ఉడుకుతుంది.
దేవతల పునరుద్ధరణ
పూరి జగన్నాథ ఆలయంలోని దేవతామూర్తుల ప్రతిమలు చెక్కతో చేసినవి ఉంటాయి. ప్రతి 14 నుండి 18 సంవత్సరాలకు ఒకసారి జరిగే పవిత్ర నవకళేబరా ఉత్సవంలో భాగంగా జగన్నాథ ఆలయంలోని చెక్క విగ్రహాలు కొత్తవి మారుస్తారు. ఈ చెక్కను మళ్లీ రీసైక్లింగ్ చేస్తారు. ఈ వేడుక హిందూ ఆధ్యాత్మిక విశ్వాసాలకు ఆలయానికి ఉన్న శాశ్వత సంబంధాన్ని హైలైట్ చేస్తుంది.