Atukula bathukamma: రెండో రోజు అటుకుల బతుకమ్మ విశిష్టత- ఈరోజు సమర్పించే నైవేద్యం ఏంటి?
03 October 2024, 6:00 IST
- Atukula bathukamma: మహాలయ అమావాస్య నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు అటుకుల బతుకమ్మ జరుపుకుంటారు. అటుకులను నైవేద్యంగా ఇవ్వడం వల్ల ఈ పండుగకు అటుకుల బతుకమ్మ అనే పేరు వచ్చిందని పెద్దలు చెబుతారు. దీని విశిష్టత ఏంటి, ఈరోజు సమర్పించే నైవేద్యం వివరాలు తెలుసుకుందాం.
బతుకమ్మ పూల ఔషద గుణాలు
తొలిరోజు ఎంతో సంబరంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు జరిగాయి. రెండో రోజు అటుకుల బతుకమ్మ జరుపుకుంటారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు దీన్ని జరుపుకుంటారు. అక్టోబర్ 3న అటుకుల బతుకమ్మతో పాటు దేవి నవరాత్రులు కూడా ప్రారంభంఅవుతాయి.
పొద్దున్నే మహిళలు రంగు రంగుల పూలను తీసుకొచ్చి బతుకమ్మ పేర్చుకునేందుకు సిద్ధం చేసుకుంటారు. ఉదయాన్నే నిద్రలేచి పూలను సేకరించి తెచ్చుకుంటారు. అనంతరం స్నానం ఆచరించి ఇంటిని శుభ్రం చేసుకుంటారు. తర్వాత అటుకుల బతుకమ్మ చేస్తారు. రెండో రోజు కనుక రెండు వరుసలలో బతుకమ్మను పేర్చుకుంటారు. ఈరోజు ఇచ్చుకునే వాయనం అటుకులు. చిన్నపిల్లలు కూడా ఈరోజు సంబరంగా బతుకమ్మ వేడుకలో పాల్గొంటారు. పిల్లలకు ఎంతో ఇష్టమైన అటుకులు, బెల్లం వారికి పంచి పెడతారు. అందుకే ఈరోజును అటుకుల బతుకమ్మ అని పిలుస్తారు. ఈరోజు ఎక్కువగా పిల్లలు బతుకమ్మను తయారు చేసి ఆడుకుంటారు.
ఒక రాగి పళ్ళెం తీసుకుని దాని మీద ముందుగా తామర ఆకులు లేదా గునుగు తంగేడు పూల ఆకులను పరుస్తారు. అనంతరం తంగేడు పూలు ముందుగా పెట్టి ఆ తర్వాత రంగు రంగుల పూలు చూడముచ్చటగా ఉండే విధంగా అమరుస్తారు. మధ్య మధ్యలో రకరకాల ఆకులు కూడా ఉంచుతారు. గోపురం లేదా వలయాకారంలో బతుకమ్మను రూపొందిస్తారు. పేర్చడం పూర్తయిన తర్వాత దాని మీద పసుపుతో చేసిన గౌరీ దేవి లేదా అమ్మవారి ప్రతిమను పెట్టుకుంటారు. అమ్మవారిని ఆభరణాలతో అందంగా అలంకరించి పసుపు, కుంకుమ సమర్పిస్తారు.
బతుకమ్మ పేర్చడంలో తప్పనిసరిగా గునుగు, తంగేడు పూలు ఉంటాయి. వాటితో పాటు రెండో రోజు అటుకుల బతుకమ్మ కోసం నందివర్థనం, బంతి, చామంతి, గడ్డి పూలు, గుమ్మడి పూలు, బీర పూలు వంటి వాటితో దీన్ని రూపొందిస్తారు. ఈరోజు నైవేద్యంగా చప్పిడి పప్పు, అటుకులు, బెల్లం సమర్పిస్తారు. వీటిని చిన్నారులకు పంచి పెడితే ఇష్టంగా ఆరగిస్తారు.
అక్టోబర్ 10న సద్దుల బతుకమ్మతో సంబరాలు మగుస్తాయి. దసరాకు రెండు రోజుల ముందు వచ్చే దుర్గాష్టమి రోజు సద్దుల బతుకమ్మ చేస్తారు. ఈరోజు అందరూ తమ బతుకమ్మలతో ఒక చోటుకు చేరి పాటలు పాడుతూ డాన్స్ చేస్తారు. అనంతరం వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు. తర్వాత పారే నీటిలో బతుకమ్మలని నిమజ్జనం చేసే సంప్రదాయంతో వేడుకలు ముగుస్తాయి.