శుభకార్యాలకు ఇంటి గుమ్మాలను బంతి పూల తోరణాలతో ఎందుకు అలంకరిస్తారు?
శుభకార్యం ఏదైన జరుగుతుంది అంటే ఆ ఇంటికి బంతి పూలతో చేసిన తోరణాలు అందంగా వేలాడుతూ కనిపిస్తాయి. గుమ్మంలో వాటిని చూడగానే మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. అయితే వీటిని ఎందుకు కడతారో తెలుసుకుందాం.
ఏదైనా పండుగ, శుభకార్యం, పూజా కార్యక్రమం అనగానే ఇంటి గుమ్మాలకు మామిడి ఆకుల తోరణాలు, బంతిపూల మాలలు దర్శనమిస్తాయి. అలాగే వస్తువుల మీద స్వస్తిక్ చిహ్నం కనిపిస్తూ ఉంటాయి. ఇవి సాంస్కృతిక, జ్యోతిష్య, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. సానుకూల శక్తిని ఇస్తాయని ప్రతికూల ప్రభావాలను దూరం చేస్తాయని నమ్ముతారు.
ఎటువంటి శుభకార్యమైనా కూడా మామిడి ఆకులు, బంతి పువ్వులు అలంకరణగా ఉపయోగించడం పరిపాటిగా వస్తుంది. ఇవి లేకుండా ఏ అలంకరణ పూర్తి కాదు. ఇంటికి వచ్చే అతిథులను ఈ అలంకరణలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇలా చేయడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. మామిడి ఆకులు బంతి పువ్వులను అలంకరణగా రూపొందించడానికి ఉపయోగించినప్పుడు ఇవి స్వచ్ఛత, పవిత్రతను సూచిస్తాయి. సద్గుణాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి.
ఇంట్లో ప్రధాన ద్వారాలకు మామిడి ఆకులు, బంతి పువ్వులతో తోరణాలు కడతారు. అంటే ఇవి ప్రతికూల ప్రభావాలకు వ్యతిరేకంగా పనిచేస్తాయని అర్థం. సానుకూల శక్తులను ఇంట్లోకి ఆహ్వానిస్తాయని నమ్ముతారు. ఇవి ఇంటికి ఆనందం, శ్రేయస్సును, సామరస్యాన్ని తీసుకువస్తాయి. అలాగే ఇంటిని అందంగా చూపిస్తాయి.
మామిడి ఆకుల ప్రాధాన్యత
మామిడి ఆకులకు హిందూ మతంలో ప్రత్యేక స్థానం ఉంది. వేడుకలతో సంబంధం లేకుండా వైదిక ఆచారాలలో మామిడి తోరణాలు ముఖ్యమైన భాగంగా మారిపోయాయి. మామిడి చెట్టును కల్ప వృక్షంగా పిలుస్తారు. ఇవి దైవిక సారాన్ని కలిగి ఉందని నమ్ముతారు. మామిడి ఆకులను కలశాన్ని తయారు చేయడంలో ముఖ్యమైన భాగంగా చూస్తారు. అలాగే ఇంట్లోని ప్రతికూల శక్తులను పారద్రోహులేందుకు పసుపు నీటిని మామిడి ఆకులతోనే ఇల్లంతా చల్లుతారు. ఇవి ఆనందాన్ని ప్రోత్సహిస్తాయి. శాస్త్రీయ దృక్కోణంలోనూ మామిడి ఆకులు పర్యావరణ శుద్ధీకరణకు దోహదం చేస్తాయి. కార్బన్ డయాక్సైడ్ ని గ్రహించి వాతావరణాన్ని శుద్ధి చేస్తాయి.
బంతి పువ్వులు ఎందుకంటే
ఇక బంతి పువ్వులు ప్రతి పూజా కార్యక్రమంలో కనిపిస్తాయి. పసుపు, ఎరుపు రంగులో ఉండే బంతిపూలు ఎక్కువగా పూజకు, వేడుకలకు, శుభకార్యాలకు వినియోగిస్తారు. వీటిని ఇంటిని అందంగా అలంకరించుకుంటారు. ఏదైనా పండుగ వచ్చిందంటే బంతిపూల మాలలు తయారు చేసి దేవుళ్లకు సమర్పిస్తారు. అయితే ఇవి ఆధ్యాత్మికపరంగా చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. బంతి పువ్వులు సూర్య భగవానుడి చిహ్నాలుగా గౌరవిస్తారు.
కాంతి ప్రకాశాన్ని కలిగి ఉంటాయి. సంస్కృతంలో వీటిని స్థల పుష్పం అని పిలుస్తారు. వివిధ దేవతల ఆరాధనలో అంతర్భాగంగా ఉన్నాయి. బృహస్పతి గ్రహంతో బంతిపూలకు అనుబంధం ఉంటుందని చెబుతారు. ఇవి ఇంటిని సానుకూల శక్తితో నింపుతాయి. ఆనందం, శ్రేయస్సును ప్రోత్సహిస్తాయి. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మాత్రమే కాకుండా బంతి పువ్వులు శాస్త్రీయ ప్రాముఖ్యతను కూడా కలిగి ఉన్నాయి. వీటిని ఇంటికి అలంకరించడం వల్ల వాతావరణం శుద్ధి అవుతుంది. వీటి సువాసన శాంతిని ప్రోత్సహిస్తుంది. మనసుని మెదడుని రిలాక్స్ చేస్తుంది. క్రిమి సంహారక లక్షణాలు కలిగి ఉంటాయి. పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన వాతావరణానికి బంతి పువ్వులు దోహదపడతాయి. అందుకే వేడుకల్లో తప్పనిసరిగా బంతి పువ్వులు భాగమవుతాయి.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.