Insurance : మీ ఇంట్లోని వస్తువులకు కూడా బీమా చేసుకోవచ్చు.. అనేక లాభాలు
Insurance News In Telugu : ఈ కాలంలో బీమా చేసుకునే అలవాటు చాలా మందికి పెరిగింది. అయితే మనుషులకే కాకుండా ఇంట్లోని వస్తువులకు కూడా బీమా చేసుకోవచ్చు.
వ్యక్తిగత బీమా పాలసీలు, ఆరోగ్య బీమా, ఆస్తి బీమా గురించి మనకు తెలుసు. అయితే మీ ఇంట్లోని వస్తువులకు కూడా బీమా సౌకర్యం లభిస్తుందని తెలుసా? మీ ఇల్లు, మీ వస్తువులపై బీమా పొందడం చాలా సులభం. ఇది మీకు అనేక రకాలుగా ఉపయోపడుతుంది.
దీని కోసం మీరు సమగ్ర గృహ బీమా పాలసీని తీసుకోవచ్చు. ఇందులో ఇంటి భవనంతో పాటు ఇంట్లో ఉంచిన వస్తువులకు కూడా బీమా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది, మీ స్వంత ఇల్లు లేకపోతే ఏమి చేయాలి? గృహోపకరణాలకు బీమా పొందడం సాధ్యమేనా?
అలాంటి బీమా కూడా ఉంటుంది. ఇది కవర్ ప్లాన్. వివిధ బీమా కంపెనీల గృహ బీమా ప్లాన్‌లలో కంటెంట్ కవర్ ప్లాన్‌లు మాత్రమే ఉన్నాయి. దీంతో ఇంట్లోని వస్తువులకు బీమా కవరేజీ లభిస్తుంది. అంటే టీవీ, ఫ్రిజ్, ఏసీ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు బీమా చేయవచ్చు. అంతేకాకుండా ఇంట్లోని ఫర్నీచర్, ఇంట్లో అమర్చిన ఎలక్ట్రిక్ చిమ్నీ, ఖరీదైన లైటింగ్ తదితరాలు కూడా కవర్ చేస్తారు. ఆభరణాలు, ఖరీదైన పెయింటింగ్, డ్రాయింగ్ లేదా ఏదైనా కళాకృతి వంటి మీ విలువైన వస్తువులు బీమా చేసుకోవచ్చు. కానీ దీని కోసం యాడ్ ఆన్ కవర్ తీసుకోవాల్సిందే. ఇవి దెబ్బతిన్నట్లయితే మీకు రీయింబర్స్‌మెంట్ లభిస్తుంది.
సాధారణ బీమా కంపెనీలు ఈ రకమైన బీమాను అందిస్తున్నాయి. మీరు ఏ కంపెనీ నుంచి బీమా తీసుకున్నా మీ ఇంట్లో ఉన్న విలువైన వస్తువుల జాబితాను ఇవ్వాల్సి ఉంటుంది. అంతే కాకుండా వీటి అంచనా వ్యయం కూడా చెప్పాలి. ఏదైనా నష్టం జరిగితే బీమా కంపెనీకి క్లెయిమ్ సమర్పించాల్సి ఉంటుంది.
ఈ క్లెయిమ్‌ల రిప్లేస్‌మెంట్ విలువను కంపెనీ నిర్ణయిస్తుంది. ఈ విలువను నిర్ణయించేటప్పుడు కంపెనీ అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు తరుగుదల కూడా అంచనా వేస్తారు. బీమా పాలసీని కొనుగోలు చేసే ముందు మీరు పాలసీ నిబంధనలు, షరతులను తప్పకుండా చదవాలి. మీ కోసం ఆ పాలసీలో ఏమి కవర్ చేస్తారు? ఏది అయితే బాగుంటుందో తెలుసుకోండి..
ఇంటి వస్తువుల కవరేజ్ కోసం మీకు ఎంతకాలం బీమా అవసరమే కూడా ప్లాన్ చేసుకోవాలి. మీరు మీ అవసరాలకు అనుగుణంగా ఒక ప్రణాళికను ఒకటి నుండి ఐదు సంవత్సరాల వరకు కొనుగోలు చేయవచ్చు. ఇది సమగ్ర కవరేజీని అందిస్తుంది. ఈ బీమా అగ్నిప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు, దొంగతనం, ప్రమాదవశాత్తు నష్టం మొదలైన వాటి వల్ల కలిగే నష్టాలను కవర్ చేస్తుంది. నష్టం జరిగితే విషయాన్ని వెంటనే దాని అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్‌కు లేదా రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ఐడీకి అందించాలి.
అవసరమైన అన్ని పత్రాలను సిద్ధంగా ఉంచాలి. ఆ తర్వాత క్లెయిమ్‌ను దాఖలు చేయడం సులభం అవుతుంది. అంటే మీరు వోచర్లు, బిల్లులను మీ వద్ద ఉంచుకోవాలి. పడేయకూడదు. నష్టం జరిగితే సంబంధిత నిపుణుడిని నియమిస్తుంది బీమా కంపెనీ. వారు సాక్ష్యంపై దృష్టి పెడతారు, రసీదులతోపాటు అన్నీ చూస్తారు. మీరు వారికి సహకరించాలి. అప్పుడే బీమా పరిహారం పొందెందుకు ఆస్కారం ఉంటుంది.