Hyderabad Fake Household Products : బ్రాండెడ్ కవర్లలో నాసిరకం సరుకులు, హైదరాబాద్ లో నకిలీ దందా గుట్టురట్టు!
Hyderabad Fake Household Products : మీరు నిత్యం వినియోగించే ప్రొడక్టు అసలైనవో? కాదో? ఒకసారి పరీక్షించండి. హైదరాబాద్ లో నకిలీ నిత్యవసర పదార్థాలు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
Hyderabad Fake Household Products : హైదరాబాద్ లో వివిధ మార్కెట్లలో లభించే ముడి సరుకులతో నాసిరకం నిత్యవసర వస్తువులు(Fake Household Products) తయారు చేస్తున్న గ్యాంగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన ప్రముఖ కంపెనీల(Branded Companies) కవర్లు, అట్టలు నాసిరకం వస్తువులకు అతికించి గత రెండేళ్లుగా హైదరాబాద్ లో విక్రయిస్తున్న ముఠా గట్టురట్టు చేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆరుగురు సభ్యులు ఉన్న ఈ ముఠాలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి దాదాపు రూ.2 కోట్ల విలువ చేసే సరుకును స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ రష్మీ పెరమల్ పేర్కొన్నారు. ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ తో పాటు బషీర్ బాగ్ లోని పాత కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు.
పారాచూట్ కొబ్బరి నూనె నుంచి టీ పౌడర్ వరకు....అన్నీ నకిలివే
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన శ్యామ్ భాతి, కమల్ భాతి కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్(Hyderabad) నగరానికి వలస వచ్చి కాచిగూడలో నివాసం ఉంటున్నారు. మొదట్లో కిరాణం దుకాణం నడుపుతూ జీవనం సాగించిన వీరు ఆ తరువాత డబ్బులు సులువుగా సంపాదించేందుకు బేగంబజార్ ప్రాంతానికి చెందిన జయరామ్ అనే వ్యక్తితో కలిసి బ్రాండెడ్ వస్తువుల పేరుతో నాసిరకం సరుకులను మార్కెట్ లో విక్రయించి అధిక లాభాలు పొందాలని పథకం వేసుకున్నారు. నకిలీ సరులకు బెంగుళూరు, దిల్లీ, నాసిక్ నుంచి తీసుకువచ్చిన వివిధ బ్రాండ్ల కవర్లు, స్టికర్లతో మార్కెట్లో విక్రయించేవారు. ఈ విషయంపై వీరిపై 2019, 2022లో కాచిగూడ, నల్లగొండ జిల్లాలో కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఈ ముగ్గురు తెరవెనుక ఉండి రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తి మహేందర్ ను రంగంలోకి దింపి ఇలా చేస్తే ఎక్కువగా డబ్బులు సంపాదించవచ్చని మాయమాటలు చెప్పడంతో మహేందర్ కూడా ఈ నాసిరకం వస్తువుల విక్రయానికి తెర తీశాడు.
రూ.2 కోట్ల సరుకు సీజ్
నాసిరకం సరుకును బ్రాండెడ్ కవర్లలో ప్యాక్ చేయడానికి కాటేదాన్లో కార్ఖానా ఏర్పాటు చేశాడు మహేందర్. అక్కడి స్థానికులను పనిలో పెట్టుకొని....మితులేష్ కుమార్, త్రియన్ కుమార్ నేతృత్వంలో మహేందర్ ఇంటి సమీపంలోని అద్దెకు తీసుకున్న ఓ గోడౌన్ లో ఈ దందా కొనసాగిస్తున్నారు. అయితే సరుకుల్లో కొన్ని నాసిరకం వస్తువులను గమనించిన కస్టమర్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన మధ్య మండల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజు నాయక్...... సాయికిరణ్ కాచిగూడ ఇన్స్పెక్టర్ రాజు బృందాలతో వీరి కదలికలపై దృష్టి సారించారు. గోడౌన్ వద్దకు సరుకుల కోసం వచ్చిన మహేందర్ ను పోలీసులు పట్టుకున్నారు. దీంతో గత రెండేళ్లుగా దర్జాగా సాగుతున్న వీరి దందా గుట్టురట్టు అయింది. దీంతో మహేందర్ తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.2 కోట్ల విలువైన సరుకును స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీళ్లు సరఫరా చేస్తున్న నాసిరకం నకిలీ సరుకుల వల్ల వినియోగదారులకు ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని...... పారాచూట్, సర్ఫ్, వీల్, బ్రూక్ బాండ్, హార్పిక్, లైజాల్ ఎవరెస్ట్ తదితర కంపెనీలకు చెందిన 30 రకాల ఉత్పత్తులని వీళ్లు తయారు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. వీటిని ఎవరు గుర్తించకుండా ఉండడానికి హైదరాబాద్ శివారులలో కిరాణా దుకాణాలకు విక్రయిస్తున్నారని తెలిపారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా