Bathukamma: బతుకమ్మలో ఏ పూలు ఉపయోగించాలి? ఎలా అమర్చుకోవాలో తెలుసా?-which flowers should be used in bathukamma know how to stack this ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Bathukamma: బతుకమ్మలో ఏ పూలు ఉపయోగించాలి? ఎలా అమర్చుకోవాలో తెలుసా?

Bathukamma: బతుకమ్మలో ఏ పూలు ఉపయోగించాలి? ఎలా అమర్చుకోవాలో తెలుసా?

Gunti Soundarya HT Telugu
Oct 02, 2024 11:23 AM IST

Bathukamma: మీరు మొదటి సారి బతుకమ్మ జరుపుకుంటున్నారా? అయితే అందులో ఎలాంటి పూలు ఉపయోగిస్తారు. వాటి వల్ల ప్రయోజనాలు ఏంటి? బతుకమ్మ ఎలా అమర్చుకోవాలి అనే విషయాలు మీకోసమే.

బతుకమ్మలో ఏ పూలు ఉపయోగించాలి?
బతుకమ్మలో ఏ పూలు ఉపయోగించాలి? (https://creativecommons.org/licenses/by-sa/4.0)

Bathukamma: పూల పండుగ మరికొద్ది రోజుల్లో రాబోతుంది. తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ జరుపుకుంటారు. ఊరూవాడా ఏకమై ఆడబిడ్డలందరూ అందంగా ముస్తాబై బతుకమ్మ పేర్చి సంతోషంగా గౌరీ దేవిని పూజిస్తారు. ప్రకృతిలో లభించే ప్రతి పువ్వును బతుకమ్మలో ఉపయోగిస్తారు.

రకరకాల జానపద గీతాలు ఆలపిస్తూ బతుకమ్మ చుట్టూ ఆడవాళ్ళు నృత్యాలు చేస్తూ ఆనందంగా గడుపుతారు. మీరు ఈ ఏడాది బతుకమ్మ తొలిసారి చేసుకుంటున్నారా? అయితే ఎలాంటి పూలు కావాలి. బతుకమ్మ ఎలా పేర్చాలి అనే విషయాలు తెలియడం లేదా? అయితే ఇది మీ కోసం. ఇందులో ఉపయోగించే ప్రతి పువ్వుకు ఎన్నో ఆరోగ్య గుణాలు ఉంటాయి. తంగేడు పువ్వులు లేకుండా బతుకమ్మ ఉండదు. ఈ బతుకమ్మలో పేర్చే పూలు ఏంటి? వాటి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

బతుకమ్మకు ఉపయోగించే పూలు

తంగేడు పువ్వులు, ఎరుపు, పసుపు రంగు బంతి పువ్వులు, గునుగు పూలు, గులాబీ, నంది వర్ధనం, చామంతి, గన్నేరు, బిళ్ళ గన్నేరు, టేకు పూలు, పట్టుకుచ్చు పువ్వులు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి మాత్రమే కాదు గడ్డి పువ్వుల దగ్గర నుంచి పొలాల్లో, ఇంటి చుట్టుపక్కల, పెరట్లో లభించే రంగు రంగుల పూలతో కూడా బతుకమ్మ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా కొన్ని పూలు మాత్రమే ఉపయోగించాలని ఏమి ఉండదు. అయితే ఎన్ని ఉన్నప్పటికీ తంగేడు, గునుగు పూలు మాత్రం తప్పనిసరిగా ఉంటాయి.

తంగేడు పువ్వులు ముందుగా బతుకమ్మను పేర్చడంలో ఎక్కువగా మొదటగా ఉపయోగిస్తారు. ఈ పువ్వులు అంటే గౌరీ దేవికి చాలా ఇష్టమైనవని నమ్ముతారు. ఈ పువ్వులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. మధుమేహం, మలబద్ధకం వంటి వ్యాధులను నయం చేసేందుకు వాడే మందులలో వీటిని ఉపయోగిస్తారు.

తంగేడు పూలతో పాటు చివరగా పెట్టేది గునుగు పూలు. అన్ని పూలు అమర్చుకున్న తర్వాత చివరగా గునుగు పూలు పెట్టుకుంటారు. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ డయాబెటిక్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. పొలాల్లో ఈ పూలు ఎక్కువగా దొరుకుతాయి. బతుకమ్మలో అమర్చేందుకు వీటితో పాటు బంతి పూలు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి పండుగ వాతావరణాన్ని ఇస్తాయి. చూసేందుకు కూడా బతుకమ్మ ఎంతో ముద్దుగా కనిపిస్తుంది. వేడుక ఏదైనా సరే అందులో బంతి పూలు తప్పనిసరిగా ఉంటాయి. పూజలో వాటికి అంత ప్రాముఖ్యత ఉంటుంది.

గులాబీ పువ్వులు ఎక్కువగా తలలో పెట్టుకునేందుకు, అలంకరణకు ఉపయోగిస్తారు. అయితే బతుకమ్మలో మాత్రం గులాబీ పూలు కూడా పెట్టుకుంటారు. బతుకమ్మ పేర్చిన తర్వాత పెట్టె గౌరమ్మ దగ్గర వీటిని అందంగా అమర్చుకుంటారు. మంచి సువాసన వెదజల్లే నందివర్థనం పూలు రోజువారీ పూజలో తప్పనిసరిగా ఉపయోగిస్తారు. అలాగే బతుకమ్మలోనూ వీటిని పెట్టుకుంటారు.

బతుకమ్మ ఎలా పెట్టాలి?

గోపురం మాదిరిగా బతుకమ్మను అందంగా అమర్చుకుంటారు. ఎంత ఎత్తుగా బతుకమ్మ పేరిస్తే అంత అందంగా కనిపిస్తుంది. ముందుగా ఒక ఇత్తడి పళ్ళెం తీసుకోవాలి. దాని మీద తంగేడు ఆకులు పెట్టుకోవాలి. ప్లేటు అంచు మీద మనం సేకరించి పెట్టుకున్న పూలను వరుసగా అమర్చుకుంటూ వెళ్ళాలి.

ముందుగా తంగేడు పువ్వులు పెట్టుకోవాలి. ఆ తర్వాత మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ కు అనుగుణంగా పూలు అమర్చుకోవచ్చు. అయితే పూల వరసలు పెంచే కొద్ది వెడల్పు తగ్గుతూ వస్తూ ఉండాలి. చివరగా పసుపుతో చేసిన గౌరమ్మను లేదా ప్రతిమను పెట్టుకోవచ్చు. పువ్వులు పడిపోకుండా వాటి చుట్టూ దారం చుట్టుకోవచ్చు. అలాగే పూల మధ్యలో ఉన్న ఖాళీలో మీరు తెచ్చుకున్న పూల చెట్ల ఆకులు వేసుకోవచ్చు. నిండుదనంగా కనిపించే విధంగా బతుకమ్మను అన్ని రకాల పూలతో అలంకరించుకోవచ్చు.

ఇన్ని రంగులు పెట్టుకోవాలనే నియమం ఏమి లేదు. మీ దగ్గర ఉన్న పువ్వులను బట్టి ఎంత ఎత్తు అయినా చేసుకోవచ్చు. బతుకమ్మను అందంగా చేసుకున్న తర్వాత పూజ గదిలో పెట్టు పూజ చేసుకోవాలి. సాయంత్రం వేళ బతుకమ్మను తల మీద పెట్టుకుని ఆడవాళ్ళందరూ ఒక చోటుకు చేరి నృత్యాలు చేస్తూ సంతోషంగా గడుపుతారు. తొమ్మిది రోజుల పాటు సాగే బతుకమ్మ వేడుకలు చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు.

Whats_app_banner