Bathukamma 2024: ఈ ఏడాది బతుకమ్మ పండుగ ఎప్పుడు వచ్చింది? తొమ్మిది బతుకమ్మల పేర్లు ఏంటి?-telangana famous festival bathukamma dates in 2024 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Bathukamma 2024: ఈ ఏడాది బతుకమ్మ పండుగ ఎప్పుడు వచ్చింది? తొమ్మిది బతుకమ్మల పేర్లు ఏంటి?

Bathukamma 2024: ఈ ఏడాది బతుకమ్మ పండుగ ఎప్పుడు వచ్చింది? తొమ్మిది బతుకమ్మల పేర్లు ఏంటి?

Gunti Soundarya HT Telugu
Sep 03, 2024 06:35 PM IST

Batukamma 2024: విజయ దశమి సమయంలో తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. ఈ ఏడాది భాద్రపద అమావాస్య అక్టోబర్ 2వ తేదీ వచ్చింది. ఈరోజు నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయి. తొమ్మిది రోజుల పాటు జరుపుకునే ఈ వేడుకలు దుర్గాష్టమి రోజు జరుపుకునే సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి.

2024 లో బతుకమ్మ పండుగ ఎప్పుడు?
2024 లో బతుకమ్మ పండుగ ఎప్పుడు?

Batukamma 2024: తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో బతుకమ్మ ఒకటి. అందమైన పూల పండుగ. తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. దసరా నవరాత్రుల సమయంలో తెలంగాణ ఆడబిడ్డలు పూలతో బతుకమ్మ పేర్చి గౌరీ దేవిని అత్యంత భక్తి శ్రద్దలతో ఆరాధిస్తారు.

చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ బతుకమ్మ పండుగలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఏటా భాద్రపద అమావాస్య నుంచి బతుకమ్మ పండుగ మొదలవుతుంది. ఈ ఏడాది భాద్రపద అమావాస్య అక్టోబర్ 2న వచ్చింది. పితృపక్షం ఆరోజుతోనే ముగుస్తుంది. దుర్గాష్టమి రోజు వచ్చే సద్దుల బతుకమ్మతో వేడుకలు ముగుస్తాయి. అంటే దసరాకు రెండు రోజుల ముందు బతుకమ్మ చివరి రోజు వేడుకలు జరుగతాయి. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో మహిళలందరూ ఆనందంగా పాల్గొంటారు.

ప్రకృతి ఇచ్చిన అనేక రంగుల పువ్వులను ఏరికొరి తెచ్చి రంగు రంగు పూలతో అందంగా బతుకమ్మలు పేరుస్తారు. ఆడవాళ్ళు అందరూ కొత్త వస్త్రాలు ధరించి ఆభరణాలు అలంకరించుకుని సంతోషంగా పాటలు పాడుకుంటూ బతుకమ్మ ఆటలు ఆడతారు. మధ్యలో బతుకమ్మ పెట్టి చుట్టూ ఆడవాళ్ళు చేరి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. ఊరు వాడ ఏకమై ఈ పండుగను ఆటపాటలతో ఆనందంగా జరుపుకుంటారు.

తొమ్మిది రోజులు తొమ్మిది పేర్లతో బతుకమ్మ

తొమ్మిది రోజుల పాటు తొమ్మిరి పేర్లతో బతుకమ్మను ఆరాధిస్తారు. ప్రతిరోజు ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తూ పూజలు నిర్వహిస్తారు. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు ణన బియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏదో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్న ముద్దల బతుకమ్మ, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ. ఈ తొమ్మిది రోజులూ తొమ్మిది రకాల నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తారు.

ఒక రాగి పళ్ళెంలో రంగు రంగుల పూలను వలయాకారంలో అందంగా అమర్చుకుంటారు. సద్దుల బతుకమ్మ రోజు ఈ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. చివరి రోజు అందరూ సద్దుల బతుకమ్మ పేర్చి ఆడి పాడి సంతోషంగా గడుపుతారు. అనంతరం బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మలో అమర్చే పూలకు ప్రత్యేకత ఉంటుంది. ఔషధ గుణాలు కలిగిన పూలతో బతుకమ్మ పేరుస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆడపడుచులు అందరూ బతుకమ్మ వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు.

బతుకమ్మ జరుపుకోవడం వెనుక కథ

బతుకమ్మ వేడుక జరుపుకోవడం వెనుక ఒక పౌరాణిక కథ కూడా ప్రాచుర్యంలో ఉండి. పూర్వం ధర్మాంగదుడు అనే చోళ రాజు సంతానం కోసం మహాలక్ష్మీ రూపమైన ఆది శక్తిని పూజించాడు. అతని భక్తికి మెచ్చిన మహాలక్ష్మీ వారికి కుమార్తెగా జన్మించింది. ఆమెను చూసి మునులు, రుషులు సంతోషంగా బతుకమ్మ అని దీవిస్తారు. అప్పటి నుంచి ఆమెను బతుకమ్మగా పిలుస్తారు. పూర్వం నుంచి ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఈ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తూ వస్తున్నారు.