Motivation for Life | జీవితం ఎవరికీ అంత సులభం కాదు.. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది ఇదే!
17 October 2022, 10:02 IST
- ఎవరైతే తమ జీవితం బాగాలేదు, తమకు జీవితంలో అన్యాయం జరిగింది అనే భావనలో ఉంటారో ఇక్కడ చెప్పే Bhagavad Gita లోని ఒక ఉదాహరణ కచ్చితంగా కళ్లు తెరిపిస్తుంది.
Motivation for Life - Bhagavad Gita
ప్రాచీన హిందూ గ్రంథాలలో భగవద్గీత ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఇది భారతీయ పురాణ ఇతిహాసాలలో ఒకటైన మహాభారతంలో ఒక భాగం. నేరుగా శ్రీకృష్ణుడు చేసిన ఉపన్యాసం (గీతోపదేశం) అని మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది. ప్రస్తుతం 700 శ్లోకాల రూపంలో ఇది అందుబాటులో ఉంది.
భగవద్గీత ప్రాథమిక ఉద్దేశ్యం మానవాళి అందరికీ దైవత్వాన్ని లోతుగా అర్థం చేసుకోవడం, ధర్మంగా జీవించడం, అధ్యాత్మికత నిజమైన స్వభావాన్ని గ్రహించడం. గీతలోని సారాలు మనిషి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి, ధర్మబద్ధంగా తలెత్తుకొని బ్రతకటానికి, మెరుగైన జీవనశైలిని అలవర్చుకోవటానికి ఉపయోగపడతాయి. ఎవరైతే తమ జీవితం బాగాలేదు, తమది ఒక వ్యర్థమైన జీవితం, తమకు జీవితంలో అన్యాయం జరిగింది అనే భావనలో ఉంటారో ఇక్కడ చెప్పే ఒక ఉదాహరణ కచ్చితంగా కళ్లు తెరిపిస్తుంది.
Karna To Sri Krishna- Challenge
మహాభారతంలో కర్ణుడు తన జీవితానికి సంబంధించి, తనకు జరిగిన అన్యాయాలు, అవమానాల గురించి శ్రీకృష్ణుడిని ఇలా అడుగుతాడు - "నేను పుట్టిన క్షణంలోనే మా అమ్మ నన్ను విడిచిపెట్టింది, నన్ను అక్రమ సంతానంగా చూశారు, అది నా తప్పా?
నేను క్షత్రియుడిని కానందున నేను ద్రోణాచార్యుడు నాకు విద్య నేర్పేందుకు నిరాకరించాడు. అదే సమయంలో క్షత్రియుడిని కాదు అని పరశురాముడు నాకు బోధించాడు కానీ నేను క్షత్రియ వంశానికి చెందిన కుంతీ కుమారుడనని తెలుసుకున్నాక నేను నేర్చుకున్న విద్య అంతా మరచిపోయేలా శాపం ఇచ్చాడు.
అనుకోకుండా ఒక ఆవుకు నా బాణం తగిలింది, తప్పు తెలుసుకోకుండా బ్రాహ్మణుడైన దాని యజమాని నిస్సహాయ స్థితిలో నేను చనిపోతానని నన్ను శపించాడు, ద్రౌపది స్వయంవరంలో నన్ను హేళన చేశారు, చివరకు నన్ను కన్న తల్లి కుంతి కూడా తన ఇతర కొడుకులను రక్షించడం కోసం తానే తల్లిని అని నిజం చెప్పి నా వద్ద ప్రమాణం తీసుకుంది, ఇలా జీవితంలో ఎక్కడా నన్ను ఎవరూ కూడా గౌరవంగా చూడలేదు, కానీ నా జీవితంలో ఇప్పుడు ఇలా ఉన్నానంటే అది దుర్యోధనుడి దానధర్మం ద్వారానే, అందుకే నేను దుర్యోధానుడి కోసం కౌరవుల పక్షం పోరాడుతున్నాను, నాది తప్పు ఎలా అవుతుంది?" అంటూ అడుగుతాడు.
Sri Krishna To Karna- Motivation
కర్ణుడు చెప్పినదంతా సావధానంగా విన్న శ్రీకృష్ణుడు, అతను వేసిన ప్రశ్నలకు ఇలా సమాధానమిస్తాడు
"కర్ణా, నేను జైలులో పుట్టాను. నేను పుట్టకముందే కంసుని రూపంలో మృత్యువు నా కోసం ఎదురుచూస్తోంది. నేను పుట్టిన రాత్రే నా తల్లిదండ్రులను విడిపోయాను. మీరు చిన్నతనం నుండి కత్తులు, రథాలు, గుర్రాలు, విల్లు, బాణాల శబ్దాలు వింటూ రాజవంశంలో పెరిగారు. నేను ఆవు మందలతో, పేడతో నిండిన వాటి షెడ్లలోనే నా జీవితం ఎక్కువ భాగం సాగింది, నాకు సైనిక శిక్షణ లేదు, విద్య లేదు.. పైగా ఊరిలో ప్రతీ సమస్యకు కారణం నేనేనంటూ ప్రజలంతా నన్ను నిందించేవారు. మీరు అనేక విద్యలు నేర్చుకుంటూ గురువుల ద్వారా మీ పరాక్రమానికి ప్రశంసలు అందుకుంటున్న వేళ, కనీసం నేను ఏ విద్యను పొందలేదు. నేను 16 సంవత్సరాల వయస్సులో మాత్రమే ఋషి సాందీపని గురుకులంలో చేరాను!
మీరు మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. కానీ నేను ప్రేమించిన అమ్మాయిని పొందలేకపోయాను. నన్ను కోరుకున్న వారిని లేదా నేను రక్షించిన గోపికలనే వివాహం చేసుకోవాల్సి వచ్చింది. జరాసంధుని నుండి మా వారిని రక్షించడానికి నేను నా సమాజం మొత్తాన్ని యమునా నదీ తీరం నుండి దూరంగా సముద్ర తీరానికి తరలించవలసి వచ్చింది. ఇలా పారిపోయినందుకు నన్ను పిరికివాడు అంటూ హేళన చేస్తారు. నువ్వు కౌరవుల పక్షంలో ఏ యుద్ధం చేసినా నీకు దానికి ప్రతి ఫలం ఉంటుంది, ఇటు పాండవుల పక్షం గెలిస్తే నాకు లభించేది ఏముంది? కేవలం నిందలు, శాపనార్థాలు, యుద్ధానికి సంబంధించిన సమస్యలు మాత్రమే నాతో మిగిలి ఉంటాయి.
కర్ణా ఒక్కటి గుర్తుంచుకో. జీవితంలో ప్రతి ఒక్కరికీ సవాళ్లు ఎదురవుతాయి. జీవితం ఎవరికీ సులభం అయినది కాదు. మనకు ఎంత అన్యాయం జరిగినా, ఎన్నిసార్లు అవమానానికి గురయినా, ఎన్నిసార్లు పడిపోయినా, ఆ సమయంలో మనం ఎలా స్పందిస్తున్నామన్నదే ముఖ్యం. కాబట్టి ధర్మం, అధర్మం ఏంటో, ఏది సరైనదో మన అంతరాత్మకు తెలుసు" అంటూ శ్రీకృష్ణుడు వివరిస్తాడు.
ఈ ఉపదేశంతో మనం గ్రహించాల్సింది ఏమిటంటే.. మనకు అన్యాయం జరిగింది అని మరొకరికి అన్యాయమే జరగాలి, అందుకు అధర్మ మార్గంలో నడుస్తామంటే కుదరదు. విధి అనేది మన చేతుల్లో లేదు, మనం ఎలా ఉండాలి, ఎలాంటి మార్గంలో వెళ్లాలి అనేది మాత్రమే మన చేతుల్లో ఉంటుంది.