తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  The 7 Chakras | మన శరీరంలో 7 శక్తి చక్రాలు.. ఇవే మన బతుకు జట్కా బండిని నడిపేవి!

The 7 Chakras | మన శరీరంలో 7 శక్తి చక్రాలు.. ఇవే మన బతుకు జట్కా బండిని నడిపేవి!

Manda Vikas HT Telugu

29 September 2022, 18:06 IST

    • The 7 Chakras: ప్రతి మనిషిలో ఏడు ప్రధాన చక్రాలు ఉంటాయి. అవి వారి మానసిక, ఆరోగ్య, సామాజిక శ్రేయస్సును నిర్ణయిస్తాయి. ఈ చక్రాలతోనే బతుకు బండి సవ్యంగా సాగుతుంది. వివరంగా తెలుసుకోండి.
7 Chakras - Meditation
7 Chakras - Meditation (Unsplash)

7 Chakras - Meditation

ఏదైనా వాహనం సవ్యంగా ప్రయాణించాలంటే దాని చక్రాలను సర్దుబాటు చేస్తారు. మీరు రోడ్లపై అక్కడక్కడా Wheel Alignment అనే ప్రకటనలు చూసే ఉంటారు. అదే విధంగా మన బతుకు బండి కూడా సవ్యంగా సాగాలంటే చక్రాల సర్దుబాటు అవసరం. అయితే ఈ చక్రాలు అంటే ఏమిటి? అవి మన శారీరక, మానసిక శ్రేయస్సును ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

చక్ర అనేది సంస్కృత పదం, దీని అర్థం చక్రం. ఇది మీ శరీరంలోని శక్తి కేంద్రాలను సూచిస్తుంది. ఈ స్పిన్నింగ్ ఎనర్జీ డిస్క్‌లు లేదా శక్తి చక్రాలు శరీరంలోని ప్రధాన అవయవాలకు అనుగుణంగా ఉంటాయి. మానవ శరీరంలో కనీసం 114 వేర్వేరు చక్రాలు ఉన్నాయని నమ్ముతారు, అయితే ఇందులో ప్రధానంగా 7 చక్రాలపైనే చర్చ జరుగుతుంది. మీ శరీరంలో ఉన్న ఈ 7 చక్రాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇవే మీలోపల లోతుగా పాతుకుపోయిన మానసిక, శారీరక సమస్యలను గుర్తించడంలో సహాయపడతాయి. ఇవి వెన్నెముక వెంబడి తల నుంచి మూలం వరకు ఒక క్రమపద్ధతిలో ఒక్కోచోట అమరి ఉంటాయి. వీటిలో ఏ ఒక్కటి గతి తప్పినా, మీ జీవితం పట్టాలు తప్పుతుంది.

సాధారణంగా ధ్యానం, యోగా కేంద్రాలలో మనిషి శరీరంలోని శక్తి చక్రాల గురించి విశ్లేషణ ఉంటుంది. వివిధ మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఈ చక్రాల సర్దుబాటుతో చికిత్స చేయడం ఉంటుంది.

ఈ చక్రాల గురించి సరళంగా చెప్పాలంటే, ఇవి నాడీవ్యవస్థకు సంబంధించిన కేంద్రాలు. వీటి ద్వారా శక్తి సరఫరా వివిధ అవయవాలకు జరుగుతుంది. ఇటీవల కాలంలో వివిధ ఆందోళనలతో సతమతవుతున్న వారికోసం చక్రాల సమానీకరణ, సర్దుబాటు కోసం కేంద్రాలు, యోగా సెంటర్లలో ప్రత్యేకమైన చికిత్స అందిస్తున్నారు.

ఆశ్చర్యంగా ఉంది కదూ.. మరి మీ శరీరంలోని ఏ భాగంలో ఏ చక్రం నిగూఢమై ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి.

The 7 Chakras and Significance - 7 ప్రధాన చక్రాలు ఏమిటి?

చక్ర వ్యవస్థ అనేది మన శరీరంలో ఉన్న శక్తి కేంద్రాలను సూచిస్తుంది. ఏడు ప్రధాన చక్రాలు ఉన్నాయి, వాటి గురించి మరింత నిశితమైన పరిశీలన ఇక్కడ చూడండి.

1. Root Chakra- మూల చక్రం

మూల చక్రం లేదా దీనినే మూలాధారం అని పిలుస్తారు. ఇది మీ వెన్నెముక కేంద్రం వద్ద ఉంటుంది. ఇది మీకు జీవితానికి ఆధారం లేదా పునాదిని అందిస్తుంది. సవాళ్లకు ఎదురొడ్డి నిలబడగల సత్తాను మీలో స్థాపించడంలో ఈ మూల చక్రం మీకు సహాయపడుతుంది. మీ భద్రత, మీ స్థిరత్వానికి మీ మూల చక్రం బాధ్యత వహిస్తుంది.

2. Sacral Chakra- స్వాదిష్టాన చక్రం

సక్రాల్ చక్రం, లేదా స్వాధిస్థానం అని పిలుస్తారు. మీ బొడ్డు క్రింద ఉంటుంది. ఈ చక్రం మీ లైంగిక సామర్థ్యానికి, మీ సృజనాత్మక శక్తికి బాధ్యత వహిస్తుంది. మీరు మీ భావోద్వేగాలతో పాటు ఇతరుల భావోద్వేగాలతో ఎలా ప్రభావితం అవుతారు అనే దానికి కూడా ఈ సక్రాల్ చక్రంతో ముడిపడి ఉంటుంది.

3. Solar Plexus Chakra - మణిపూర చక్రం

సోలార్ ప్లేక్సస్ చక్రం లేదా మణిపూర చక్రం మీ కడుపు ప్రాంతంలో ఉంటుంది. ఇది మీలో విశ్వాసం, ఆత్మగౌరవానికి బాధ్యత వహిస్తుంది. మీ జీవితాన్ని నియంత్రించడంలో మీకు సహాయం చేస్తుంది.

4. Heart Chakra- అనాహత చక్రం

హృదయ చక్రం లేదా అనాహత చక్రం ఛాతీ మధ్యలో, గుండెకు సమీపంలో, ఉంటుంది. ఇది మనలో ప్రేమ, దయాగుణం, కరుణను చూపించే మన తత్వానికి సంబంధించినది.

5. Throat Chakra- విశుద్ధ చక్రం

గొంతు చక్రం లేదా విశుద్ధ చక్రం గొంతు వద్ద ఉంటుంది. ఈ చక్రం మన భాష, వాక్ఛాతుర్యానికి సామర్థ్యానికి సంబంధించినది.

6. Third Eye Chakra- అజ్న చక్రం

మూడవ కన్ను చక్రం లేదా అజ్న చక్రం మీ కళ్ళ మధ్య ఉంటుంది. మీ తెలివితేటలు, దివ్యదృష్టి, విషయంపై లోతైన పరిజ్ఞానం, ఊహాశక్తికి సంబంధించి బాధ్యత వహిస్తుంది.

7. Crown Chakra- సహస్ర చక్రం

కిరీటం చక్రంలేదా సహస్ర చక్రం మీ తల పైభాగంలో ఉంటుంది. మీతో మీకే ఉన్న అనుబంధం అలాగే మీకు ప్రకృతికి ఉన్న అనుబంధం, మీ అధ్యాత్మిక చింతనకు సంబంధించి బాధ్యత వహిస్తుంది. మీ జీవిత లక్ష్యంలో కూడా పాత్ర పోషిస్తుంది.