YOGA: ఆరోగ్య యోగం ప్రాప్తం.. ఈ యోగాసనాలతో మీ హృదయం పదిలం!-practice these five yoga asanas to pump up your heart health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Yoga: ఆరోగ్య యోగం ప్రాప్తం.. ఈ యోగాసనాలతో మీ హృదయం పదిలం!

YOGA: ఆరోగ్య యోగం ప్రాప్తం.. ఈ యోగాసనాలతో మీ హృదయం పదిలం!

Manda Vikas HT Telugu
Feb 28, 2022 05:56 PM IST

ఆధునిక ఔషధాలు, వైద్యం భర్తీ చేయలేని ప్రయోజనాలను మనం ధ్యానం, యోగాసనాల ద్వారా పొందవచ్చు. తల నుంచి పాదాల వరకు సాంత్వన చేకూర్చే ఎన్నో యోగాసనాలు ఉన్నాయి. ఈ యోగాసనాలను మనం నిత్యకృత్యం చేసుకోవడం ద్వారా అది మీ మానసిక శ్రేయస్సును మెరుగుపరుస్తుంది, తద్వారా ఆరోగ్యకరమైన హృదయానికి దోహదపడుతుంది.

<p>Yoga</p>
Yoga (Stock Photo)

ఈరోజుల్లో గుండెజబ్బులు ఎవరికి వస్తాయనేది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. పాతికేళ్ల యువకులు కూడా గుండెపోటుకు గురవుతున్న సంఘటనలు మనం చూస్తున్నాం. మారుతున్న జీవనశైలి, వాతావరణ కాలుష్యం, ఆహారంలో నాణ్యత లేకపోవడం, వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లు ఇలా ఎన్నో కారణాలు ఉంటున్నాయి. మన శరీరంలో కేంద్రభాగమైన గుండెను ప్రభావితం చేసే కారకాలను నిర్లక్ష్యం చేయకూడదు.

ఆధునిక ఔషధాలు, వైద్యం భర్తీ చేయలేని ప్రయోజనాలను మనం ధ్యానం, యోగాసనాల ద్వారా పొందవచ్చు. తల నుంచి పాదాల వరకు స్వాంతన చేకూర్చే ఎన్నో యోగసనాలు ఉన్నాయి. ఈ యోగాసనాలను మనం నిత్యకృత్యం చేసుకోవడం ద్వారా అది మీ శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా, మానసిక శ్రేయస్సును మెరుగుపరుస్తుంది, తద్వారా ఆరోగ్యకరమైన హృదయానికి దోహదపడుతుంది.

హార్ట్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించగలిగే సులభమైన కొన్ని యోగాసనాల గురించి ఇక్కడ వివరిస్తున్నాం. ప్రతి యోగాసనాన్ని ఒక్కొక్కటి మూడు సెట్లు చేయాలి. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. సరైన వార్మప్ లేకుండా ఏ ఆసనాలు వేయకూడదు. ఈ ఆసనాలను అభ్యసించే ముందు, తేలికపాటి వ్యాయామాలు చేస్తే ఆసనాల కోసం శరీరాన్ని సిద్ధం చేసినట్లు అవుతుంది.

యోగాసనాలు, అవి వేసే విధానాలు:

పాదహస్తాసనం

- నిటారురుగా అన్ని భుజాలు సమస్థితిలో ఉండేలా నిలబడండి

- శ్వాస వదులుతూ, మీ శరీరాన్ని మెల్లగా కిందకు వంచి, మీ పాదాలకు ఇరువైపులా అరచేతులు ఉంచండి.

- అలాగే మీ ముక్కును మీ మోకాళ్ల వరకు తాకేలా ఉంచండి

- మీ మోకాళ్లను నెమ్మదిగా నిటారుగా చేసి, మీ ఛాతీని మీ తొడల వద్దకు తీసుకురావడానికి ప్రయత్నించండి.

- ఇలాగే కొన్ని సెకన్ల పాటు ఉండడి.

ధనురాసనం

- ఆ ఆసనంలో మీ కడుపు నేలను తాకేలా బోర్లా పడుకోండి

- ఇప్పుడు మీ మోకాళ్లను వెనక్కి వంచి, మీ అరచేతులతో మీ చీలమండలను పట్టుకోండి.

- వదులుగా కాకుండా బలమైన పట్టును కలిగి ఉండండి.

- ఇప్పుడు మీ కాళ్లు , చేతులను వీలైనంత ఎత్తుకు ఎత్తండి.

- ఇలా కొద్దిసేపు ఈ ఆసనంలో ఉండండి.

పశ్చిమోత్తనాసనం

- ముందుకు వంగినట్లు కూర్చునే ఆసనం

- ఒక చదునైన తలంలో మీ రెండుకాళ్లు దగ్గరగా చాచి కూర్చోండి.

- ఇప్పుడు మీ వెన్నెముకను నిటారుగా ఉంచి, మీ చేతులను పైకి చాచండి.

- మెల్లగా బయటకి శ్వాస తీసుకుంటూ, వదులుతూ మీ కడుపుని ఖాళీ చేయండి.

- ఇలా శ్వాసను బయటకు వదులుతూనే మీ శరీరాన్ని ముందుకు వంచండి.

- మీ రెండు చేతులతో మీ పాదాలను పట్టుకోండి.

- మీ మోకాళ్లను మీ ముక్కుతో తాకడానికి ప్రయత్నించండి.

 

భుజంగాసన (కోబ్రా పోజ్)

- మీ కడుపు నేలను తాకేలా బోర్లా పడుకొని మీ భుజాలపై పట్టుతో అరచేతులను నేలపై ఉంచండి.

- మీ రెండు కాళ్లను దగ్గరగా జరిపి, నేలకు ఆనించి ఉంచండి.

- ఇప్పుడు మీ ఉదర భాగం నుంచి తల భాగాన్ని పైకి ఎత్తినట్లు ఉంచి, ఒక లోతైన శ్వాస తీసుకోండి.

- మీ నాభి నేలను తాకుతూ మీ భంగిమ 30 డిగ్రీల కోణంలో పైకి ఎత్తినట్లుగా ఉంచినట్లు నిర్ధారించుకోండి.

- మీ భుజాలను వెడల్పుగా చాచి, తల కొద్దిగా పైకి ఎత్తి మెల్లగా శ్వాసను వదులుతుండండి.

తడాసనా

- కాళ్లు దగ్గరకు చాచి వెన్నెముక నిటారుగా ఎత్తుగా నిలబడండి.

- మీ రెండు కాళ్లపై సమానభారం పడేలా చూసుకోండి.

- మీ భుజాలు, చేతులు వదులుగా విశ్రాంతి స్థితిలో ఉంచండి.

- ఇలా నిమగ్నమై 5 నుంచి 8 సార్లు శ్వాసతీసుకోవడం, వదలడం చేయండి.

మీ గుండె ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడానికి ఈ ఆసనాలను క్రమం తప్పకుండా ఆచరించాలి. ఈ విధంగా చేస్తే గుండె సంబంధిత జబ్బులను నివారించవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం