తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  సముద్రగర్భంలో సుందరనగరం..శ్రీకృష్ణుడు ఏలిన ద్వారక నిజంగా ఉండేదా?

సముద్రగర్భంలో సుందరనగరం..శ్రీకృష్ణుడు ఏలిన ద్వారక నిజంగా ఉండేదా?

Manda Vikas HT Telugu

28 February 2022, 20:07 IST

google News
    • సుసంపన్నమైన వాస్తుశిల్పంతో ఆదర్శవంతమైన నగరంగా ద్వారకను మహాభారతంలో అభివర్ణించారు. కళ్లు చెదిరే భవంతులు, ఆసుపత్రులు, విద్యాలయాలతో పాటు ప్రజలకు సకల సదుపాయాలతో కూడిన, అత్యాధునిక హంగులు కలిగిన నగరంగా విలసిల్లిందని పురాణాల్లో ఉంది.
City of Dwaraka
City of Dwaraka (wikimedia Commons)

City of Dwaraka

హిందూమతం ప్రకారం భగవంతుడు సంచరించిన పవిత్రమైన ప్రదేశాలను ధామం అని పిలుస్తారు. భారతదేశానికి నలువైపులా నాలుగు ధామాలు ఉన్నాయని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. అవి ఉత్తరాన బద్రీనాథ క్షేత్రం, దక్షిణాన రామేశ్వరం, తూర్పున పూరిజగన్నాథ క్షేత్రం, పశ్చిమాన ద్వారకపురి నగరం. ఇందులో ద్వారక గురించి చెప్పుకుంటే ఇది సాక్షాత్ భగవంతుడి స్వరూపమైన శ్రీకృష్ణ పరమాత్ముడే స్థాపించిన నగరంగా మహాభారతంలో ఉంది. ద్వారక అంటే స్వర్గానికి ప్రవేశ ద్వారం అని అర్థం.

పురాణ కథనాలు.. 

సుసంపన్నమైన వాస్తుశిల్పంతో ఆదర్శవంతమైన నగరంగా ద్వారకను భారతంలో అభివర్ణించారు. కళ్లు చెదిరే భవంతులు, ఆసుపత్రులు, విద్యాలయాలతో పాటు ప్రజలకు సకల సదుపాయాలతో కూడిన, అత్యాధునిక హంగులు కలిగిన నగరంగా ద్వారక విలసిల్లిందని పురాణాల్లో ఉంది. ఇంతటి అద్భుత నగరాన్ని తన దైవిక శక్తులతో సముద్రం నుండి శ్రీకృష్ణుడి ఉద్భవించేలా చేశాడని, ఈ నగరానికి రక్షణగా భారీ రాతి గోడ కూడా ఉండేదని కొన్ని పురాణ కథనాల ప్రకారం తెలుస్తుంది. మహాభారత యుద్ధం ముగిసిన కొంతకాలానికి, శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి వైకుంఠం చేరిన చేరిన అనంతరం ఆయన పాలించిన సుందర ద్వారక రాజ్యం కూడా తిరిగి సముద్రగర్భంలో కలిసిపోయింది. ఇందుకు కౌరవులను కోల్పోయిన గాంధారి శాపమే కారణం అని పురాణాల్లో వర్ణించారు.

మహాభారతం, శ్రీమద్ భగవద్గీతం, హరివంశం అలాగే స్కంద పురాణం, విష్ణు పురాణంతో సహా అనేక గ్రంథాలలో కూడా ద్వారక ప్రస్తావన ఉంది. ద్వారకలో 9,00,000 రాజభవనాలు ఉండేవని, అవన్నీ క్రిస్టల్, వెండి తదితర పదార్థాలతో నిర్మితమై, పచ్చలతో అలంకరించినట్లు పేర్కొన్నారు.

మిస్టరీగానే మిగిలింది..

ఏదైమైనా, ఒకప్పుడు కృష్ణుడు ఏలిన రాజ్యంగా చెప్పే ద్వారక నగరం ఇప్పటికీ ఒక అంతుచిక్కని రహస్యం లాగే మిగిలిపోయింది. భారతంలో వర్ణించిన ప్రకారం ద్వారక నగరం నిజంగా ఉండేదా? లేదా ఇదొక కాల్పనిక కథా? అనేది తెలుసుకునేందుకు ఎంతోమంది ఎన్నో అన్వేషణలు, పరిశోధనలు చేశారు. ద్వారక ఆనవాళ్లు గుర్తించేందుకు సముద్ర శాస్త్రజ్ఞులు, పురావస్తుశాఖ వారు అరేబియా సముద్రగర్భంలో ఎన్నో పరిశోధనలు చేశారు. ఈ క్రమంలో పశ్చిమ తీరంలో గల్ఫ్ ఆఫ్ కాంబేలో నీటి అడుగున 120 అడుగుల లోతులో కొన్ని అవశేషాలు బయటపడ్డాయి. అవి సుమారు 9,500 సంవత్సరాల కంటే పురాతనమైనవి కావొచ్చని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. 

9500 సంవత్సరాల క్రితం నగరం

వెలికితీసిన అవశేషాల్లో కూలిన నిర్మాణాల శిథిలాలు, కుండలు, పూసలు, శిల్పాలు, కొన్ని మానవ ఎముకలు ఉన్నాయి. అవి వేల సంవత్సరాల క్రితానికి చెందినవి. వారి నాగరికత కూడా సుమేరియన్ నాగరికత, ఈజిప్షియన్, చైనీస్, హరప్పా నాగరికతల కంటే కూడా అతి ప్రాచీనమైనది, ఆధునికమైనదిగా విశ్వసిస్తున్నారు. అప్పట్లో సుముద్రాల్లో ఏర్పడిన భారీ సునామీల కారణంగా కొన్ని ప్రాచీన నగరాలు సముద్రంలో మునిగిపోయినట్లు చరిత్ర చెబుతుంది. దీని ప్రకారం సుమారు 9.5 వేల సంవత్సరాల క్రితం అంటే ఈ కాలం ద్వాపర యుగం నాటిదే అని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ద్వారక నగరం నిజమేనని ఒక వాదన ఉంది.

ప్రస్తుతం ఆధునిక ద్వారక నగరం గుజరాత్ రాష్ట్రంలోని జామ్ నగర్ జిల్లాల్లో ఉంది. ఇక్కడ పురాతనమైన ద్వారకాధీష ఆలయంలో కృష్ణుడి నల్లని పాలరాతి విగ్రహం కొలువుదీరి, ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది.

 

టాపిక్

తదుపరి వ్యాసం