World Poha Day । శ్రీకృష్ణుడు సైతం ఇష్టంగా తిన్న అల్పాహారం అటుకులే!
Vishwa Poha Diwas - అటుకులు చాలా తేలికైన ఆహారం. ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి. బరువు నియంత్రణలో ఉంటుంది. ఎంతో మంది ఇష్టపడే బ్రేక్ ఫాస్ట్ అయిన అటుకుల గురించి ఎంతో రుచికరమైన స్టోరీ ఇక్కడ వండి వడ్డిస్తున్నాం, చదువుకోండి.
భారతీయులకు, అటుకులకు విడదీయలేని అనుబంధం ఉంది. ద్వాపర యుగంలో కుచేలుడు తన చిన్ననాటి స్నేహితుడైన శ్రీకృష్ణుడిని కలిసినపుడు అటుకులనే తినిపిస్తాడని పురాణాల్లో ఉంది. అంటే అప్పట్నించీ కూడా అటుకులు మన ఆహార సంస్కృతిలో భాగం అని అర్థమవుతుంది.
అటుకులు మనలో చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. దీనిని ఉదయం అల్పాహారంగా తినవచ్చు. సాయంత్రం స్నాక్స్ లాగా తీసుకోవచ్చు, రాత్రికి తేలికపాటి భోజనం చేయాలన్నా అటుకులతో కానిచేయొచ్చు. ఇప్పుడీ అటుకుల పురాణం ఎందుకు అంటే జూన్ 7 ప్రపంచ అటుకుల దినోత్సవం అంట!
ప్రతిరోజూ ఏదో ఒక దినోత్సవం ఉంటూనే ఉంది. ఈ క్రమంలో జూన్ 7న ఆహార భద్రత దినోత్సవం అలాగే సంరక్షణ దినోత్సవంతో పాటు అటుకుల దినోత్సవం (విశ్వ పోహా దివస్) కూడా ప్రత్యేకంగా భారతీయులు జరుపుకుంటున్నారు. ఎంతో మంది భారతీయుల ఫేవరేట్ బ్రేక్ ఫాస్ట్ అయిన అటుకులను ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసేలా చేయడమే దీని వెనక ఉన్నముఖ్య ఉద్దేశ్యం. ఈరోజున అటుకులతో వివిధ రకాల వెరైటీలు చేసుకుంటూ సోషల్ మీడియాలో పంచుకుంటారు.
అటుకులు ఎలా తయారవుతాయి?
అటుకులు బియ్యంతోనే తయారుచేస్తారు. అయితే ఈ ప్రక్రియ చాలా పెద్దగానే ఉంటుంది. అటుకులను ఇంగ్లీషులో ఫ్లాటెన్డ్ రైస్ (Flattened rice) అంటారు. అంటే అర్థం అక్కడే తెలుస్తుంది చదునైన బియ్యం అని. వడ్లను బియ్యంగా వేరు చేసి ఆపై వేడి నీటిలో నానబెడతారు. ఇలా నానబెట్టిన బియ్యాన్ని మళ్లీ ఎండబెడతారు. ఆ తర్వాత ఎండిన బియ్యాన్ని కాల్చి, రోలర్‌ల క్రింద చదును చేయడం ద్వారా అటుకులు తయారవుతాయి.
బియ్యం రకాలను బట్టి అటుకులు వివిధ రకాలుగా తయారవుతాయి. పొట్టి ధాన్యపు పోహా, పొడవాటి పోహా, లావుగా ఉండే పోహా, సన్నటి పోహా అంటూ లభ్యమవుతాయి. అంతేకాకుండా, సోనా మసూరి, హెచ్‌ఎంటీ, బాస్మతి కృష్ణ హంస, సుమతి రకాల పోహాలు మార్కెట్లో కూడా అందుబాటులో ఉంటాయి.
పోషక విలువలు
అటుకుల్లో అన్నం కంటే 20 శాతం తక్కువ కార్బోహైడ్రేట్‌లు ఉంటాయి. కాబట్టి ఇది తేలికైన ఆహారం. అంతేకాకుండా అటుకుల్లో పొటాషియం, సోడియం, ఐరన్ వంటి సూక్ష్మ పోషకాలను కూడా కలిగి ఉంటుంది. అందువల్ల ఎప్పుడైనా కొద్దిగా ఆకలి వేసినపుడు లేదా తేలికగా ఏదైనా తినాలనుకున్నప్పుడు ఇన్‌స్టంట్ నూడుల్స్‌కు బదులుగా పోహాను ఎంచుకోండి.
మహారాష్ట్రలో అటుకులను మెత్తగా చేసుకొని తింటారు. మధ్యప్రదేశ్‌లో ఆలుగడ్డలతో కలుపుకొని తింటారు. తెలంగాణలో వేరుశనగా, బఠానీలు కలిపి పొడిగా తింటారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉగ్గానీ బజ్జీ రూపంలో తింటారు. కర్ణాటకలో బెల్లం, పుట్నాలు కలుపుకొని తింటారు. ఇలా ప్రాంతాన్ని బట్టి ఎన్నో రకాలుగా అటుకుల రెసిపీలు పాపులర్ అయ్యాయి.
ఇవేకాదు ఇంకా ఎన్నో రకాల పోహా రెసిపీలు ఉన్నాయి. కొద్దిగా కారం, ఉల్లిపాయ కలుపుకుని తిన్నా ఎంతో రుచిగా ఉంటుంది. కాబట్టి అటుకులను ఎలా కావాలంటే అలా తినొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. మీరూ తినండి, ప్రపంచ అటుకుల దినోత్సవం ఘనంగా జరుపుకోండి.
సంబంధిత కథనం