Magha ekadashi: మాఘ ఏకాదశి వ్రతం కథ విశిష్టత ఏంటి? ఈ వ్రతం అచరించడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుంది
19 February 2024, 15:25 IST
- Magha Ekadashi: మాఘ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని జయ ఏకాదశి అంటారు. విష్ణువుని పూజించడం చాలా ప్రాముఖ్యతని సంతరించుకుంటుంది. ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి రోజు పాటించే వ్రత ప్రాముఖ్యత గురించి చిలకమర్తి చక్కగా వివరించారు.
మాఘ స్నానం ఆచరిస్తున్న భక్తులు
Magha ekadashi: దక్షిణాయానంలో కార్తీకమాసం, ఉత్తరాయణంలో మాఘమాసం అత్యంత పవిత్రమైనవని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. అటువంటి మాఘ మాసంలో వారాలలో ఆదివారానికి, తిథులలో పంచమి, సప్తమి, అష్టమి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమిలు చాలా విశేషమైనవి. వీటి మొత్తంలో మాఘ మాసపు ఏకాదశి చాలా విశేషమైనదని చిలకమర్తి తెలిపారు. మాఘ పురాణం 11వ అధ్యాయం ప్రకారం మహాభారతంలో భీముడు చేసిన ఏకాదశీ వ్రత మహత్య విశిష్టతను మీకు తెలియజేస్తున్నాము.
మాఘ మాస ఏకాదశి విశిష్టత
మాఘ మాస ఏకాదశి రోజు మాఘ పురాణం చదవడం, కనీసం ఈ ఏకాదశి వ్రత కథను వినడం ద్వారా పాపములు నశించి పుణ్యము లభిస్తుందని అని చిలకమర్తి తెలిపారు. మహాభారత యుద్ధము పూర్తి అయిన తరువాత ధర్మరాజు హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకొని సమస్త భారతదేశానికి చక్రవర్తియై పరిపాలిస్తున్నాడు. దేశంలో ధర్మం నూటికి నూరుపాళ్ళు తూ.చా తప్పకుండా పాటిస్తున్నారు. పురోహితుడైన ధౌమ్యుడు వచ్చి పాండవులతో మీరు అన్నిధర్మాలనూ పాటిస్తూ రాజ్యం పాలిస్తూంటే మీ రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా ధర్మాత్ములుగానే ఉన్నారని అన్నాడు.
శ్లోకం
రాజ్ఞి ధర్భిణి ధర్మిష్యాః
పాపీచేత్ పాపినః ప్రజాః
రాజాన మసువర్తంతే
యధారాజా తథా ప్రజాః
అని శాస్త్రాలు చెబుతున్నాయి. రాజు ధర్మాత్ముడైతే, ప్రజలు కూడా ధర్మాత్ములవుతారు. రాజు పాపం చేసేవాడైతే ప్రజలు కూడా పాపాత్ములవుతారు. ఎప్పుడూ ప్రజలు, రాజెలా ఉంటే అలాగే ఉంటారని దీని అర్ధం.
ఈ విషయం గ్రహించి ఓ ధర్మరాజా! నీవు చేసే ధర్మ పరిపాలనను దేవతలు కూడా మెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఇప్పుడీ విషయం ఎందుకు చెప్పానంటే రేపటి నుంచి మాఘ మాసం ప్రవేశిస్తుంది. మీరందరూ ఉదయాన్నే లేచి సమీపంలో ఉన్న యమునా నదిలో మాఘస్నానం చేసి సూర్యారాధన విష్ణు పూజ కూడా చేసి దానాలు, ధర్మాలు చెయ్యవలసి ఉంది. అది గుర్తు చేయడానికి నేను వచ్చాను అన్నాడు. ధర్మరాజు సోదరులు, ద్రౌపది, అంతఃపుర స్త్రీలు అందరూ గురువుగారి ఉపదేశాన్ని ఆచరించడానికి సిద్ధం అయ్యారు.
మాఘ శుద్ధ ఏకాదశి నాడు అందరూ ఉపవాసాలు చేసి శ్రీమన్నారాయణుని పూజించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. భీముడు చాలా దిగులుగా ఉన్నాడు. ఎందుకంటే అతను ఒక్కరోజు కూడా భోజనం చేయకుండా ఉండలేదు. అతని తిండి కూడా తక్కువ ఏమీ కాదు. ఒక బండెడు అన్నం పప్పు, కూరలు మొదలైన పదార్థాలతో సహా సులువుగా తింటేనే కానీ అతని ఆకలి తీరదు. మరి ఉపవాసం ఉండాలంటే రెండు పూటలా అన్నం తినకుండా ఉండాలి కదా! లేకపోతే ఏకాదశి వ్రతం ఫలం దక్కదు గదా! ఎలాగ? అని ఆలోచిస్తూ ధౌమ్యులవారి దగ్గరకు వెళ్ళి తనకు వచ్చిన సందేహాన్ని ఆయనకు చెప్పాడు.
ఆయన అంతా విని భీమసేనా! మాఘ మాసం.. అందునా ఏకాదశి. విష్ణుదేవునికి చాలా ప్రీతికరమైన రోజు. ఆనాడు నీవు భగవంతుని మీద దృష్టిని నిలిపి, నేను నియమంగా ఉండాలి అని దృఢమైన సంకల్పం ఉంటే నీకు ఆకలి దప్పికలు రెండూ తెలియవు. నీకు శ్రీకృష్ణుని మీద భక్తి యున్నది కదా? ఆయననే ధ్యానిస్తూ పూజిస్తూ ఉండు నీకు ఆ కృష్ణ భగవానుడే ఉపవాసం ఉండే శక్తిని అనుగ్రహిస్తాడు అని భగవద్గీతలో ఆయనే చెప్పాడు కదా! తనను ఆరాధించే భక్తులకు ఆ శక్తి సామర్థ్యాలన్నీ ఆయనే అనుగ్రహిస్తాడు. ఏ సందేహామూ మనసులో పెట్టుకోక, ఏకాదశి ఉపవాసం చేసి నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు అని హితోపదేశం చేశాడు.
భీముడు గురువుగారి మాటను శిరసా వహించి ఆ మరునాడు ఏకాదశి రోజున యమునా నదీ స్నానం చేసి వచ్చి శ్రీలక్ష్మీనారాయణ స్వామిని ఆరాధిస్తూ తన్మయుడై ఆకలి దప్పికలు మరచి ఉపవాసం చేసి ఆ భగవానుని అనుగ్రహం సంపాదించాడని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.