Kumbha Rasi 2025 Telugu: కుంభరాశి ఫలాలు.. కష్టాలు, కఠిన నిర్ణయాలు తప్పవు
17 December 2024, 10:50 IST
- Kumbha Rasi 2025 Telugu: కుంభ రాశి 2025 రాశి ఫలాలను పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. ప్రేమ, కుటుంబ జీవితం, ఆరోగ్యం, ఆర్థికం, కెరీర్ వంటి అంశాల్లో ఈ నూతన సంవత్సరం కుంభ రాశి జాతకులకు ఎలా ఉండబోతుందో ఇక్కడ తెలుసుకోవచ్చు.
కుంభ రాశి 2025 రాశి ఫలాలు
కుంభ రాశి 2025 రాశి ఫలాలను చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా ఇక్కడ తెలుసుకోవచ్చు. గురు గ్రహం మే నుండి అయిదో స్థానములో, శని రెండవ స్థానములో సంచరించనున్నారు. రాహువు మే నుండి ఒకటో స్థానము (జన్మరాశి), కేతువు మే నుండి ఏడో స్థానంలో సంచరించనున్నారు. ఈ గ్రహ సంచారాల నేపథ్యంలో కుంభరాశి వారికి 2025 సంవత్సరం కఠినమైన నిర్ణయములతో కూడియున్నటువంటి సంవత్సరం.
లేటెస్ట్ ఫోటోలు
ఏలినాటి శని అంత్యభాగ సమయం కావటం, జన్మరాశియందు రాహువు ప్రభావం చేత ఈ సంవత్సరం కుంభరాశి వారికి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. కుంభ రాశి వారు ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. కుటుంబము నందు సమస్యలు అధికముగా ఉండును. శారీరక శ్రమ, మానసిక ఒత్తిళ్ళు ఇబ్బంది పెట్టును.
ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు
నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నమునందు ఆటంకములు ఎదురగును. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో సమస్యలు, రాజకీయ ఒత్తిళ్ళు ఎదురగును. కుంభరాశి విద్యార్థులకు కష్టపడాల్సిన సమయం, మధ్యస్థ సమయం. స్త్రీలకు ఈ సంవత్సరం ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఆవేశపూరిత నిర్ణయాలకు, గొడవలకు దూరంగా ఉండాలని సూచన. స్త్రీలకు కుటుంబములో కొన్ని సమస్యలు వేధించును.
వ్యాపారస్తులకు మధ్యస్థ సమయం. అప్పుల బాధలు సమస్యలు ఇబ్బంది పెట్టును. రావలసిన ధనము సమయానికి రాలేనటువంటి స్థితి ఏర్పడును. గ్రహస్థితులు ఎలా ఉన్నప్పటికి కుంభరాశి వారు ఈ సంవత్సరంలో ధైర్యంతో ముందుకు వెళ్ళి అనుకున్న పనులను పూర్తి చేసెదరు.
అప్పు చేయవద్దు, అప్పు ఇవ్వవద్దు అని సూచన. శత్రు పీడ కొంత ఇబ్బంది కలిగించును. కుంభరాశి రాజకీయ నాయకులకు చెడు సమయం. రైతాంగానికి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. మొత్తం మీద కుంభరాశి వారికి ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా కొంత కఠినమైనటు వంటి సంవత్సరం.
పాటించాల్సిన పరిహారాలు
2025 సంవత్సరంలో కుంభ రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. శనికి తైలాభిషేకం చేయండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాలలో ప్రదక్షిణలు చేయటం వల్ల సానుకూల ఫలితాలు పొందుతారు.
జనవరి 2025:
ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. విదేశీ వ్యాపారములు కలసివచ్చును. ఇంటి యందు అశుభవార్తలు ఉంటాయి. కలహములు ఏర్పడును. ఇతరుల మాట సహాయము తీసుకుంటారు. ఇంటి నిర్మాణానికి అప్పులు చేస్తారు. మీ సంకల్పం నెరవేరుతుంది. ఆలోచనలు పెరుగును.
ఫిబ్రవరి 2025:
ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. ఆదాయం పెరుగును. బాకీలు వసూలు అగును. అధికార ఒత్తిడి, సోదరులతో భేదాభిప్రాయములు. ఇంటియందు శుభకార్యములు. ప్రియతములతో విహారయాత్రలు. ఆత్మీయులకు మీరు సహాయపడతారు. బంధుమిత్రులతో ధనవ్యయం.
మార్చి 2025:
ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. నూతన వాహనయోగం. కొత్త పరిచయములు పెరుగును. కొన్ని అవకాశాలు వదులుకుంటారు. సంతానపరంగా ఆలోచనలు ఉంటాయి. స్త్రీలకు సంతానప్రాప్తి. ప్రతి విషయంలో ధైర్యము, పట్టుదలతో ఉంటారు. తల్లిదండ్రుల సహకారం ఉంటుంది. వ్యాపారములయందు లాభం. కోర్టు కేసులో విజయం. పితృ విరోధములుంటాయి.
ఏప్రిల్ 2025:
ఈ మాసం కుంభ రాశి జాతకులకు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగకాశములు. దైవకార్యములు చేయుట. ఇంటియందు శుభకార్యములు. స్నేహితుల సహకారముంటుంది. శత్రువులు మిత్రులవుతారు. విదేశీ ప్రయాణం. భయందోళన, ఖర్చులు ఎక్కువ. కంపెనీలో వాటా కొనుగోలు.
మే 2025:
ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. వ్యాపారపరంగా అనుకూలం. ధనలాభం. భోజన సేవలు. కుటుంబములో దానములు. దైవసంబంధిత కార్యాలు. స్థానమార్పులు. మంచి విశేష వార్తలు వింటారు. ఇతరుల సహకారం లభిస్తుంది.
జూన్ 2025:
ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. మానసికాలోచన. స్త్రీ పరిచయం. ఏ పనైనా సులభంగా చేయుదురు. ఇతర ధనముతో మసలుట. విందు భోజనసౌఖ్యం. స్థానమార్పులు ఉంటాయి. శుభవార్తలు వింటారు. మొండిగా ప్రవర్తిస్తారు. ఇతరుల సహాయ సహకారాలుంటాయి.
జూలై 2025:
ఈ మాసం మీకు అన్ని విధాలుగా కలసివచ్చును. మీరు అనుకున్న పనులు ఆలస్యంగా జరుగును. బంధువుల రాక. ధనం పొదుపు చేసేదరు. స్త్రీ సుఖం ప్రయాణం, ఉద్యోగంలో పని ఆలస్యంగా జరుగును. నరముల బలహీనత, ధనం కలసివచ్చును. వ్యాపారం ప్రారంభమగును.
ఆగస్టు 2025:
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలు, ఆకస్మిక బదిలీలు ఉంటాయి. అధికార ఒత్తిడి. పెద్ద సంఘటన జరుగును. కొత్త ప్రయత్నములు చేస్తారు. వృత్తి వ్యాపారపరంగా లాభాలు ఉంటాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మీ మాటల వల్ల ఇతరులు ఇబ్బందిపడతారు.
సెప్టెంబర్ 2025:
ఈ మాసం కుంభ రాశి జాతకులకు అనుకూలంగా లేదు. స్నేహితుల ద్వారా ధననష్టం. విలువైన వారికి దూరమగుతారు. కొంత ఒడిదుడుకులుంటాయి. అప్పులు చేస్తారు. వస్త్ర సేవ. తీర్థయాత్రలు చేస్తారు. ఔషధ సేవ. ఆదాయంలో కొంత నష్టం వస్తుంది. దురుసుగా వెళతారు. భయాందోళనలుంటాయి.
అక్టోబర్ 2025:
ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. వ్యాపారపరంగా కలసివచ్చును. వాహన యోగమున్నది. బంగారం కొంటారు. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. అధిక వ్యయం. దైవ సంబంధ కార్యాలకు ఖర్చులు. నమ్మినవారు మోసం చేస్తారు. నిరాశ.
నవంబర్ 2025:
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. విక్రయాలకు ఆటంకాలు ఏర్పడతాయి. వ్యసనములపై దుబారా ఖర్చులు చేయుదురు. పై చదువులకు అవకాశం. ఉద్యోగం కలసివచ్చును. బద్దకము, కలహములు ఉంటాయి. ఉద్యోగములలో ఒత్తిడితో పనులు నిలిచియుండును.
డిసెంబర్ 2025:
ఈ మాసం కుంభ రాశి వారికి అనుకూలంగా లేదు. వివాహ ప్రయత్నాలు, కొత్త పరిచయాలు, ఖర్చులు పెరుగును. భార్యాపిల్లలలో కలసి ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులకు పనిభారం ఎక్కువ. మీరు అనుకున్న పనులు కాస్త ఆలస్యం అగును. ప్రభుత్వోద్యోగులకు శత్రుత్వము పెరుగును.
- చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, పంచాంగకర్త