గురు దక్షిణామూర్తి విగ్రహ రహస్యమేమిటి?
గురు దక్షిణామూర్తి విగ్రహ రహస్యాలను ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మీరూ తెలుసుకోండి.
జ్ఞానప్రదాత, గురువు అయినటువంటి దక్షిణామూర్తి విగ్రహ స్వరూపము అత్యంత పవిత్రము. దక్షిణామూర్తిని ఆరాధించవలసిన పని లేకుండా కేవలము ఆయన యొక్క విగ్రహమూర్తిని దర్శనము చేతనే జ్ఞానాన్ని ప్రసాదిస్తారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. జ్యోతిష్యశాస్త్ర ప్రకారము జాతకములో గురు బలము లేనటువంటివారు, మోక్షసాధన కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి, అనారోగ్యముతో బాధపడేటటువంటి వారికి దక్షిణామూర్తిని మించినటువంటి దైవము లేదు. రాబోయే సమస్యలు కూడా తొలగించేటటువంటి శక్తి దక్షిణామూర్తి విగ్రహానికి ఉన్నదని చిలకమర్తి తెలిపారు.
దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలిస్తే కుడిచెవికి మకర కుండలం ఎడమ చెవికి 'తాటంకం” అలంకారాలుగా కనిపిస్తాయి. మకరకుండలం పురుషుల శ్రవణాలంకారం. తాటంకం స్త్రీల అలంకృతి. ఇవి దక్షిణామూర్తిగా సాక్షాత్మరించినది శివశక్తుల సమైక్య రూపమేనని తెలియజేస్తాయి.
సనకసనందనాదులకు ముందు రెండుగా కనబడిన శివశక్తులే ఏకాకృతిగా దర్శనమిచ్చాయి. అందుకే దక్షిణామూర్తి అయ్యరూపమే కాక, అమ్మమూర్తి కూడా. ఈ విషయాన్నే లలితాసహస్రంలో “దక్షిణామూర్తి రూపిణీ సనకాది సమారాధ్యా శివజ్ఞాన ప్రదాయినీ” అని వివరిస్తోంది అని చిలకమర్తి తెలిపారు.
ఏ దయ వలన దుఃఖం పూర్తిగా నిర్మూలనమవుతుందో ఆ దయను “దాక్షిణ్యం” అంటారు. ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి (దాక్షిణ్యం) భగవంతునికి మాత్రమే ఉంది. ఆ దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే దక్షిణామూర్తి. పరమ జ్ఞానమూర్తియైన ఈ ఆది గురువును స్తుతిస్తూ ఆదిశంకరులు రచించిన దక్షిణామూర్తి సోత్రము బహుళ ప్రసిద్ది చెందింది.
దక్షిణామూర్తి సకల జగద్గురు మూర్తి కనుక స్వామి ఆరాధన సకల విద్యలను ప్రసాదిస్తుంది. ఐహికంగా - బుద్ది శక్తిని వృద్ధి చేసి విద్యలను ఆనుగ్రహించే ఈ స్వామి పారమార్ధికంగా తత్త్వ జ్ఞానాన్ని ప్రసాదించే దైవం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
టాపిక్