తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ganesha Immersion: వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసేటప్పుడు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సినవి ఇవే

Ganesha immersion: వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసేటప్పుడు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సినవి ఇవే

Gunti Soundarya HT Telugu

14 September 2024, 14:08 IST

google News
    • Ganesha immersion: ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వినాయకుడి నిమజ్జనం జరుగుతోంది. పదకొండవ రోజు అంటే సెప్టెంబర్ 17న ఎక్కువ మంది చేస్తారు. అటువంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నిమజ్జనం ఎలా చేయాలి అనే వివరాల గురించి తప్పనిసరిగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. 
వినాయక నిమజ్జనం (ANI)
వినాయక నిమజ్జనం (ANI) (Girish Srivastav)

వినాయక నిమజ్జనం (ANI)

Ganesha immersion: వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 7న వినాయక చవితి పండుగ నుంచి సెప్టెంబర్ 17 వరకు ఏ వీధి చూసినా వినాయక విగ్రహాలు దర్శనమిస్తాయి. మరో నాలుగు రోజుల్లో వినాయక నిమజ్జనం చేయనున్నారు. నది, సముద్రం లేదా ఏదైనా నీరు ఉన్న ప్రదేశంలో నిమజ్జనం చేసే ఆచారం ఉంటుంది.

భూమి నుంచి కైలాసానికి తిరిగి వెళ్ళడానికి గుర్తుగా వినాయక నిమజ్జనం చేస్తారు. కొందరు ఏడు, తొమ్మిది, పదకొండు రోజుల పాటు వినాయకుడిని పూజిస్తారు. ఇక అందరూ బొజ్జ గణపయ్యకు వీడ్కోలు పలికేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ 17ణ నిమజ్జనానికి అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే గణపతి నిమజ్జనం సమయంలో భక్తులు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి.

శుభ సమయం ఎంచుకోవాలి

నిమజ్జనం చేసేందుకు తప్పనిసరిగా అనుకూలమైన సమయం ఎంచుకోవాలి. సాధారణంగా ఉదయం లేదా మధ్యాహ్నం సరైనదిగా పరిగణిస్తారు. ఏదైనా అననుకూలమైన సమస్యలు నివారించడం కోసం సూర్యాస్తమయం ముందే వేడుక నిర్వహించడం మంచిది. నిమజ్జనానికి ముందుగా విగ్రహాన్ని పువ్వులు, దండలు, నైవేద్యాలతో అలంకరించాలి. వినాయకుడికి చందనం పేస్ట్, కుంకుమ రాయాలి.

అనువైన ప్రదేశం ఎంచుకోండి

నిమజ్జనం కోసం సమీపంలోని నది, సరస్సు లేదా సముద్రం వంటివి ఎంచుకోవాలి. ఈ లొకేషన్ భక్తులకు అందుబాటులో ఉండటంతో పాటు సురక్షితంగా ఉందో లేదో చూసుకోవాలి. విగ్రహాన్ని కలుషితమైన నీటిలో నిమజ్జనం చేయకూడదు. అలా చేస్తే దైవాన్ని అవమానించినట్టు అవుతుంది.

భక్తితో పూజలు చేయాలి

గణపతికి చివరిగా పూజ చేయాలి. భక్తి శ్రద్దలతో అలంకరించాలి. కొత్త వస్త్రాలు వేసి అందంగా ముస్తాబు చేయాలి. ప్రత్యేకంగా నైవేద్యం సమర్పించి వాటిని అందరికీ పంచి పెట్టాలి. పూలు సమర్పించాలి. వినాయకుడికి తప్పనిసరిగా దుర్వా గడ్డి(గరిక) సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఏడాది మొత్తం మీకు వినాయకుడి ఆశీస్సులు లభిస్తాయి. గణేష్ ఆశీర్వాదం కోసం మంత్రాలను పఠించాలి. హారతి ఇవ్వాలి. నిమజ్జనం వేడుకను చిత్తశుద్ధితో భక్తితో నిర్వహించాలి.

పర్యావరణాన్ని కాపాడాలి

విగ్రహం పూర్తిగా నీట మునిగి ఉండేలా చూసుకోవాలి. నీటిలోకి మెల్లగా దింపాలి. విసిరేయడం వంటివి చేయకూడదు. ఎందుకంటే అది అగౌరవంగా పరిగణిస్తారు. నిమజ్జనం తర్వాత కాలుష్యాన్ని నివారించడం కోసం పువ్వులు, ఆకులు వంటివి తొలగించడం మంచిది. పర్యావరణాన్ని కాపాడటం కోసం బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ ఉపయోగించడం, ప్లాస్టిక్ వ్యర్థాలను నివారించడం వంటి పర్యావరణ అనుకూల పద్ధతులు ప్రోత్సహించాలి.

దైవిక ఆశీర్వాదాలు కోరాలి

నిమజ్జనం చేసే ముందు దైవాన్ని ఏదైనా తప్పులు జరిగితే క్షమించమని వేడుకోవాలి. ఏడాది పొడవునా తమకు ఆశీర్వాదాలు కురిపించమని, ఆటంకాలు తొలగించమని కోరుకోవాలి. విచారంగా ఎప్పుడూ నిమజ్జనం చేయకూడదు. కోలాహలంగా నృత్యాలు చేసుకుంటూ గణపతి బప్పా మోరియా అని నినాదాలు చేస్తూ ఆనందంగా నిమజ్జనం చేయాలి. వచ్చే ఏడాది మరింత ఆనందం, సంతోషం, శ్రేయస్సు తీసుకురావాలని కోరుకోవాలి. విగ్రహానికి మీరు ఏమైనా బంగారం లేదా విలువైన ఆభరణాలు వేస్తే నిమజ్జనానికి ముందే వాటిని తొలగించుకోవాలి.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

తదుపరి వ్యాసం