Makara Sankranti 2023 : అసలు సంక్రాంతికి గాలిపటాలు ఎందుకు ఎగురవేయాలో తెలుసా?
12 January 2023, 11:50 IST
- Makara Sankranti 2023 : సంక్రాంతి వచ్చిందంటే చాలు.. పిల్లలందరూ.. పెద్దలతో కలిసి గాలిపటాలు ఎగురవేసేందుకు ఉత్సాహపడతారు. అయితే పండుగ రోజు గాలిపటాలు ఎగురవేయడం వెనుక మరో శాస్త్రీయ కారణం ఉంది అంటున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మకర సంక్రాంతి రోజు గాలి పటాలు ఎందుకు ఎగుర వేయాలో తెలుసా?
Makara Sankranti 2023 : మకర సంక్రాంతి పండుగను ప్రతి సంవత్సరం జనవరి 14 న జరుపుకుంటారు. ఇది వసంత రుతువు ప్రారంభాన్ని సూచిస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం.. మకర సంక్రాంతి పండుగ పుష్య మాసంలో వచ్చే చివరి పండుగ. ఈ పండుగ తరువాత.. శీతాకాలం తగ్గుముఖం పడుతుంది. అంతేకాకుండా అది వసంత రుతువు ప్రారంభంగా చెప్తారు. మకర సంక్రాంతి రోజున సూర్యుడు ధనుస్సు రాశిని విడిచిపెట్టి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. మకర రాశిలో సంచారానికి కారణంగా ఈ పండుగను మకర సంక్రాంతి అంటారు.
గాలిపటాలు ఎగరేసే సంప్రదాయం
మకర సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగురవేసే సంప్రదాయం ఉంది. పిల్లలు, పెద్దలు మేడ మీద, మైదానాల్లో రంగురంగుల గాలిపటాలు ఎగురవేస్తూ ఉంటారు. అసలు సంక్రాంతి రోజు గాలిపటాలు ఎందుకు వేస్తారో మీకు తెలుసా? తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుందాం.
గాలిపటాలు ఎగురవేయాలనే నమ్మకానికి మకర సంక్రాంతికి సంబంధం ఉంది. దీని వెనుక మంచి ఆరోగ్య రహస్యం దాగి ఉంది అంటున్నారు. నిజానికి మంకర సంక్రాంతి నాడు సూర్యుని నుంచి అందే సూర్యకాంతి అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. శాస్త్రీయంగా ఈ రోజున సూర్యుని కిరణాలు శరీరానికి అమృతం లాంటివని చెప్తారు. ఇది వివిధ వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది.
శ్రీరాముడు సైతం..
పురణాల ప్రకారం.. రాముడు తన సోదరులు, హనుమంతునితో కలిసి త్రేతాయుగంలో మకర సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగురవేశాడని చెప్తారు. అప్పటి నుంచి మకర సంక్రాంతికి గాలిపటాలు ఎగురవేయడం ఆనవాయితీగా వస్తుంది.
సంక్రాంతి రోజు ఏర్పడే యోగాలు ఇవే..
సంక్రాంతి రోజు ఉదయాన్నే స్నానం చేసి.. పూజ, దానధర్మాలు చేయాలి. ఈసారి రోహణి నక్షత్రంలో మకర సంక్రాంతి ప్రారంభమవుతుంది. ఈ నక్షత్రం శుభప్రదంగా పరిగణిస్తారు. దీనితో పాటు ఫలప్రదంగా భావించే బ్రహ్మయోగం, ఆనందాది యోగాలు ఏర్పడుతున్నాయి.