2023 Makara Rasi Phalalu : 2023వ సంవత్సరంలో మకర రాశి వారికి మధ్యస్థంగా ఉంటుంది..
31 December 2022, 13:30 IST
- 2023 Capricorn Horoscope : ఆంగ్ల నూతన సంవత్సరంలో మకర రాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయని పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. 2023 మకర రాశి ఫలాలు ఇక్కడ చూడండి.
మకర రాశి
2023 Capricorn Horoscope : చిలకమర్తి పంచాంగ రీత్యా ధృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా మకర రాశి వారికి 2023లో మధ్యస్థ ఫలితాలు ఉ న్నాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, చిలకమర్తి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. మకర రాశివారికి ఏప్రిల్ 2023 వరకు శని 1వ ఇంట మకర రాశి యందు సంచరించడం, గురుడు 3వ ఇంట సంచరించడం, మే 2023 నుంచి మకర రాశి వారికి శని ద్వితీయ స్థానమునందు గురు రాహువులు నాల్గవ స్థానమునందు సంచరించడంచేత మకర రాశి వారికి 2023 కొంత సమస్యలతో కూడినటువంటి సంవత్సరం. మకర రాశి వారు 2023లో ఆరోగ్య విషయాల యందు, కుటుంబ వ్యవహారాల యందు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలయందు జాగ్రత్తలు వహించాలి. ఏలినాటి శని ప్రభావంచేత కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు వ్యవహారాలు, చికాకులు వంటి ఇబ్బంది పెట్టేటువంటి సమస్యలు కనబడుచున్నవి.
మకరరాశి ఉద్యోగస్తులకు 2023 మధ్యస్త ఫలితాలున్నాయి. ఉద్యోగములో రాజకీయాలు, ఒత్తిళ్ళు, సమస్యలు మరియు చికాకులు అధికముగా ఉండును. మకర రాశి ఉద్యోగస్తులకు కొంత కష్టకాలముగా గ్రహస్థితి గోచరిస్తున్నది. 2023 మకర రాశి వ్యాపారస్తులకు మధ్యస్త సమయము. వ్యాపారములో చికాకులు, ఆర్ధిక సమస్యలు ఏర్పడును. మకర రాశి స్త్రీలకు అనారోగ్య సమస్యలు అధికముగా ఉండును. మకర రాశి రైతాంగానికి 2023లో అనుకూలముగా లేదు. మకర రాశి సినీరంగం వారికి ఈ సంవత్సరం చెడు ఫలితములు అధికముగా ఉన్నవి. 2023 మకర రాశి విద్యార్థులకు కష్టపడి చదువవలసిన సంవత్సరం. మొత్తం మీద 2023 మకర రాశి వారికి మధ్యస్త ఫలితాలు ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావము చేత మకర రాశివారు 2023లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. గొడవలకు దూరంగా ఉండటం, ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి మరింత శుభఫలితాలు పొందాలంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటివి పఠించడం, మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వరుని, దుర్గాదేవిని పూజించడం మంచిది. మకర రాశివారు ధరించవలసినటువంటి నవరత్నం ఇంద్రనీలము. మకర రాశి వారు 7 ముఖములు గల రుద్రాక్షను ధరించడం వలన శుభ ఫలితములు కలుగుతాయి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, చిలకమర్తి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.