Sankranti Special Trains : పండుగకి మరిన్ని రైళ్లు.. రిజర్వేషన్ వివరాలివే..
Sankranti Special Trains : సంక్రాంతి పండుగకి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా.. మరిన్ని ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది దక్షిణ మధ్య రైల్వే. జనవరి 10న ఉదయం 8 గంటల నుంచి ఈ రైళ్లకు రిజర్వేషన్ ప్రారంభమవుతుంది.
Sankranti Special Trains : సంక్రాంతి పండుగ సందర్బంగా.. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్ల నుంచి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించినా.. సీట్లు, బెర్త్ లు దొరకడం లేదు. దీంతో.. కుటుంబాలతో కలిసి వెళ్లే ప్రయాణికులు ప్రైవేటు బస్సులని ఆశ్రయిస్తున్నారు. ఇదే అవకాశంగా.. ట్రావెల్స్ నిర్వాహకులు అందినకాడికి దండుకుంటున్నారు. ఈ నేపథ్యంలో... ప్రయాణికుల రద్దీ దృష్ట్యా... దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. ఈ మేరకు రైళ్ల వివరాలను వెల్లడించిన అధికారులు... వాటికి సంబంధించిన రిజర్వేషన్ జనవరి 10న ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
ప్రత్యేక రైళ్ల వివరాలు..
ట్రైన్ నంబర్ 08505 : విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య నడుస్తుంది. జనవరి 11, 13, 16 తేదీల్లో నడిచే ఈ రైలు... ఆయా రోజుల్లో రాత్రి 7.50 గంటలకు విశాఖపట్నం నుంచి బయలు దేరి.. మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ట్రైన్ నంబర్ 08506: సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య నడుస్తుంది. జనవరి 12, 14, 17 తేదీల్లో నడిచే ఈ రైలు... ఆయా రోజుల్లో రాత్రి 7.40 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలు దేరి.. మరుసటి రోజు ఉదయం 8.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
సంక్రాంతి పండగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. రద్దీకి అనుగుణంగా స్పెషల్ ట్రైన్స్ సంఖ్యను మళ్లీ పెంచారు. అయితే.. సొంతూళ్లకు వెళ్లే వాళ్లు లక్షల్లో ఉండటంతో ప్రకటించిన రైళ్ల రిజర్వేషన్ క్షణాల్లో పూర్తవుతోంది.
పండగ సీజన్లలో రైలు ప్రయాణీకుల అవసరాలను తీర్చడానికి దక్షిణ మధ్య రైల్వే క్రమం తప్పకుండా ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. ముఖ్యమైన సందర్భాలు, సెలవులలో అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకొని వీటిని ఏర్పాటు చేస్తోంది. జనవరి నెలలో సంక్రాంతి పండగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే రైలు ప్రయాణికుల నుండి డిమాండ్ అధికంగా ఉండటంతో ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సంక్రాంతి పండగ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రత్యేక రైళ్లలో రిజర్వ్‌డ్, అన్‌రిజర్వ్‌డ్ బోగీలను అందుబాటులో ఉంచుతారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను రాత్రి పూట నడుపుతున్నారు. ప్రత్యేక రైళ్లలో రిజర్వేషన్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్‌తో పాటు రైల్వే ప్యాసింజర్ రిజర్వేషన్ కేంద్రాల్లో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.