ఈ వస్తువులు పొరపాటున కూడా చేజారనీయకండి- ఆర్థిక ఇబ్బందులు వెంటాడతాయి
02 October 2024, 18:00 IST
- వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు చేజారి కింద పడటం అశుభంగా భావిస్తారు. ఉప్పు, పాలు, డబ్బులు వంటివి నేల మీద పడటం వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయని విశ్వసిస్తారు. ఏయే వస్తువులు కిందపడితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో తెలుసుకుందాం.
ఈ వస్తువులు చేజారనీయొద్దు
అప్పుడప్పుడు మన చేతిలో నుంచి కొన్ని వస్తువులు కిందపడిపోతూ ఉంటాయి. వాస్తు ప్రకారం అవి అశుభమైన సంఘటనలుగా పరిగణిస్తారు. తెలిసి చేసిన తెలియక చేసిన కొన్ని వస్తువులు చేజారిపోవడం మంచిది కాదని పెద్దలు చెబుతారు.
ఇలాంటి వాటిలో ఎక్కువగా వినిపించేది ఉప్పు. ఇది చేజారడం మంచిది కాదని నేల మీద ఉప్పు పడితే ఏదో అశుభం జరుగుతుందని చాలా మంది నమ్ముతారు. కుటుంబానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా సంతోషంగా ఉండాలంటే ఈ వస్తువులు పొరపాటున కూడా జారవిడచకూడదు. ఇవి కింద పడితే ఏం జరిగితే ఏం జరుగుతుంది? ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం.
ఉప్పు
వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు నేల మీద పడటం అశుభకరమైనది చెప్తారు. ఆర్థిక నష్టం, సంబంధాల్లో క్షీణత వస్తుందని చెబుతారు. ఉప్పు సంపద, శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది. అది కింద పడినప్పుడు ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయని నమ్ముతారు. అది మాత్రమే కాదు చెడు శక్తులను తరిమికొట్టేందుకు ఎక్కువగా ఉప్పునే ఉపయోగిస్తారు. అందుకే పొరపాటున కూడా ఉప్పు చేతి నుంచి జారి కింద పడకూడదు. అలాగే ఉప్పు డబ్బా మీద ఎప్పుడు మూత లేకుండా ఉంచకూడదు.
బియ్యం
అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. బియ్యం సమృద్ధి, పోషణ, శ్రేయస్సును సూచిస్తాయి. ప్రమాదవశాత్తూ బియ్యం చేజారి కిందపడితే ఆర్థిక ఇబ్బందులు, ఆహార కొరత ఏర్పడుతుందని విశ్వసిస్తారు. అందుకే బియ్యం ఎప్పుడూ శుభ్రంగా మూత పెట్టిన కంటైనర్ లో భద్రపరచాలి. అలాగే అవసరంలో ఉన్న వారికి బియ్యం దానం చేయడం చాలా మంచిది. ఇది ఇంకొకరి ఆకలి తీరుస్తుంది.
పవిత్ర గ్రంథాలు
దైవానికి సంబంధించిన పుస్తకాలు, గ్రంథాలు ఏవైనా కింద పడిపోతే వెంటనే వాటిని తీసి కళ్ళకు అద్దుకుని దేవతలను క్షమించమని అడుగుతారు. ఇవి కిందపడితే అజ్ఞానానికి సూచీకగా భావిస్తారు. వాస్తు ప్రకారం పవిత్ర గ్రంథాలు ఎప్పుడూ నేల మీద ఉంచకూడదు. ఏదైనా పీట వేసి వాటి మీద పెట్టడం లేదా ఎత్తైన ప్రదేశంలో ఉంచడం చేయాలి.
డబ్బులు
డబ్బులు లక్ష్మీదేవితో సమానం. అటువంటివి చేజారితో లక్ష్మీదేవిని అవమానించినట్టే అవుతుందని చాలా మంది విశ్వసిస్తారు. అందుకే వీటిని పొరపాటున కూడా కింద పడనీయరు. చేజారిపోతే వెంటనే వాటిని తీసుకుని కళ్ళకు అద్దుకుని లక్ష్మీదేవిని క్షమించమని అడుగుతారు. డబ్బు చేజారితో పేదరికాన్ని, ఆర్థిక నష్టాలను సూచిస్తుంది. అందుకే అందరూ డబ్బులను చాలా గౌరవంగా చూస్తారు.
దీపం
దీపం కిందపడి పగిలిపోయినా, అకస్మాత్తుగా ఆరిపోయిన అపశకునంగా భావిస్తారు. ఆధ్యాత్మిక పెరుగుదల, జ్ఞానం, శ్రేయస్సును ఇవి సూచిస్తాయి. వాస్తు ప్రకారం దీపాలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే దేవుడి ముందు వెలిగించే దీపం పగిలిపోయి ఉన్నది అసలు పెట్టకూడదు. వాటిని అజాగ్రత్తగా చూస్తే ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.
టాపిక్