తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lord Krishna: ఉడిపి శ్రీకృష్ణుని విశిష్టత, అక్కడ ఉన్న విగ్రహం వెనుక రహస్యాలు ఏంటో తెలుసా?

Lord Krishna: ఉడిపి శ్రీకృష్ణుని విశిష్టత, అక్కడ ఉన్న విగ్రహం వెనుక రహస్యాలు ఏంటో తెలుసా?

HT Telugu Desk HT Telugu

21 February 2024, 10:44 IST

google News
    • Lord Krishna: ఉడిపిలో ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహ ప్రాముఖ్యత, వాటి విశిష్టత గురించి బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా వివరించారు. 
ఉడిపి శ్రీకృష్ణుడు విశిష్టత
ఉడిపి శ్రీకృష్ణుడు విశిష్టత (pixabay)

ఉడిపి శ్రీకృష్ణుడు విశిష్టత

Lord Krishna: భారతదేశంలో శ్రీకృష్ణుని ఆలయాలకు చాలా ప్రత్యేకత ఉన్నాయి. శ్రీకృష్ణుని ఆలయాలలో ఉత్తర భారతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించినటువంటి మధుర, బృందావన ప్రాంతాలు, గుజరాత్‌ రాష్ట్రంలోని ద్వారక, బేట్‌ ద్వారక ఎంతటి విశిష్టత ఉన్నవో దక్షిణ భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలో ఉడిపి శ్రీకృష్ణుని ఆలయానికి అంతటి విశిష్టత ఉన్నదని అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

శ్రీ కృష్ణుని ఆలయాలలో నాలుగు ఆలయాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇవి ఉత్తరాన ఉత్తరప్రదేశ్‌లోని మధుర, గుజరాత్‌ రాష్ట్రంలోని ద్వారక, దక్షిణ భారతదేశంలో కేరళలోని గురువాయూరు, కర్ణాటకలోని ఉడిపి ప్రత్యేకమైనవని చిలకమర్తి తెలిపారు.

గోపీ చందనం మట్టి ప్రాముఖ్యత

ద్వైత సిద్ధాంత ప్రతిపాద్యులు, త్రిమతాచార్యులలో ఒకరైన శ్రీ మధ్వాచార్యుల వారి జననం, జీవితం, ప్రసిద్ద శ్రీ కృష్ణ క్షేత్రం, కర్ణాటక లోని ఉడిపితో ముడిపడి ఉంది. ఒక రోజు శ్రీ మధ్వాచార్యులవారు వేకువజామునే సముద్ర తీరానికి వెళ్లి స్నానం చేసి, ప్రాతః సంధ్యాదికాలు ముగించుకుని ఆ తీరంలోనే కూర్చుని ద్వాదశ స్తోత్ర రచనను ప్రారంభించారు. తపోదీక్షతో ద్వాదశ స్తోత్ర రచన సాగుతోంది. ఆ రోజు పర్వదినం కావడంతో అనేకమంది ప్రజలు కూడా వచ్చి సముద్ర స్నానం చేశారు.

శ్రీ మధ్వాచార్యుల వారు నిరాటంకంగా ద్వాదశ స్తోత్రంలోని అయిదు అధ్యాయాల రచన పూర్తి చేశారు. ఆరవ అధ్యాయం ప్రారంభం కాబోతున్న సమయంలో ద్వారక నుండి సరుకులు తీసుకువస్తోన్న ఒక నౌక తీరం వెంట వెళుతుండగా అకస్మాత్తుగా విపరీతంగా గాలులు ప్రారంభమయ్యాయి.

ఈ గాలులకు సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. నౌక ప్రమాదంలో చిక్కుకుంది. దానిని రక్షించుకోవడానికి అందులోని నావికులు చేస్తోన్న ప్రయత్నాలు ఫలించడం లేదు. క్రమంగా నౌకలోకి నీరు చేరడం ఆరంభమైంది. ఏ క్షణమైన నౌక మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది.

నావికులందరూ భయాందోళనలకు గురైన సమయంలో చివరి ప్రయత్నంగా నౌకకు సంబంధించిన ముఖ్య వ్యాపారి ఒకతను తీరం వైపు చూస్తూ రక్షించే వారి కోసం ప్రార్ధన చేయడం మొదలుపెట్టాడు. అంతదూరం నుంచి కూడా ఒడ్డున నిశ్చలంగా కూర్చొని రచన చేసుకుంటున్న శ్రీ మధ్వాచార్యులవారు ఆ వ్యాపారికి స్పష్టంగా గోచరించారు.

ఆయననుద్దేశించి మరింత ఆర్తితో ప్రార్ధించసాగాడు. ద్వాదశ స్తోత్ర రచనలలో లీనమై ఉన్నప్పటికీ అంతటి హోరుగాలిలోనూ అంత దూరంనుంచి వ్యాపారి చేస్తోన్న ప్రార్థన మధ్యా చార్యుల చెవిని తాకింది. అప్రయత్నంగా అటుకేసి తల తిప్పారు. జాలి కలిగింది. వెంటనే తన ఉపవస్తం, ఒక కొసను పట్టుకుని గాలిలో నావ కేసి విసిరి వెనక్కు తీసుకున్నారు. ఆ క్షణం వరకూ సముద్రంలో మునిగిపోతుందా? అన్నట్లున్న నౌక ఒక్కసారిగా స్థబ్దతకు వచ్చింది.

ఎవరో తాళ్లు పట్టి లాగినట్లుగా తీరానికి చేరి స్థిరంగా నిలిచింది. నావికులందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు. అంతకు మునువు ప్రార్ధన చేసిన వ్యాపారి వడివడిగా మధ్వాచార్యుల వారిని సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాడు. అనేక విధాలుగా స్తుతించాడు. అనంతరం లేచి నిలబడి అంజలి ఘటించి, “స్వామీ, నా వద్ద అమూల్యమైన వస్తువులు అనేకం ఉన్నాయి. వాటిలో మీరు కోరుకున్నది ఏదైనా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి కాదనకండి" అని అనేక విధాల ప్రాధేయపడ్డాడు.

మధ్యాచార్యులు చిరునవ్వు నవ్వి చివరకి అతని కోరికను మన్నించారు. అయితే, “నువ్వు నాకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్న అమూల్యమైన వస్తువు నీ నౌకలో ఉన్న రెండు గోపీ చందనపు గడ్డలు, ఇవ్వగలవా” అన్నారు. వ్యాపారి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే గోపీచందనం ద్వారకలో ఎక్కడపడితే అక్కడ దొరికే మట్టి. పడవలలో సరుకులు ఎక్కించేటప్పుడూ, దించేటప్పుడూ, బరువు సమతూకం తప్పిపోకుండా గోపీ చందనపు గడ్డల సహాయంతో నౌకలో సరుకును అటూ ఇటూ సర్దుతూ ఉంటారు. అలాంటి గోపీ చందనం మట్టి గడ్డలు ఈ మహానుభావుడు కోరడం ఆ వ్యాపారికి సుతరామూ నచ్చలేదు.

ఎంత ప్రార్థించినప్పటికీ మధ్వాచార్యుల వారు తాను కోరిన గోపీ చందనానికి మించి మరే బహుమతినీ తీసుకోవడానికి అంగీకరించలేదు. చివరికి ఆ వ్యాపారి స్వామి కోరిన ఆ గోపీ చందనం గడ్డలను ఇవ్వడానికి సిద్ధపడి అవే కోరడంలోని పరమార్థం ఏమిటో, ఆ మట్టి గడ్డల మహిమ, విశేషాలేమిటో తెలుపమని ప్రార్థించాడు. స్వామి మళ్లి చిరునవ్వు చిందిస్తూ “నువ్వే చూడు” అంటూ ఆ గడ్డలను అందరూ చూస్తుండగానే నీటితో కరిగించారు. ఆ సమయంలో అక్కడ ఓ అద్భుతం జరిగింది.

ఒక గడ్డ నుండి బలరాముని విగ్రహం, రెండవ దాని నుండి శ్రీ కృష్ణుని విగ్రహం బయటపడ్డాయి. అక్కడున్నవారందరూ సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు. శ్రీ కృష్ణ విగ్రహ దర్శనం జరిగిన వెంటనే మధ్వాచార్యులు ద్వాదశ స్తోత్రంలోని ఆరవ అధ్యాయంలో దశావతారాన్ని వర్ణించారు. బలరాముని విగ్రహాన్ని అక్కడే ప్రతిష్టించి శ్రీ కృష్ణుని విగ్రహం తీసుకుని ఉడుపికి ప్రయాణమయ్యారు. శ్రీకృష్ణ ప్రాప్తి తరువాత ద్వాదశ స్తోత్రాన్ని పరిసమాప్తి చేశారు. అందుకే ద్వాదశ స్తోత్రం అత్యంత పవిత్రమైనదని చిలకమర్తి తెలిపారు.

అలా శ్రీకృష్ణుడి శైశవ విగ్రహాలు వచ్చాయి

అమృత రూపమైనటువంటి శ్రీ కృష్ణుని ఆగమనానికి కారణమైంది. అది విషాహార స్తోత్రంగా కూడా ప్రసిద్ది చెందింది. శ్రీ కృష్ణుని విగ్రహ రహస్యం ఏంటి? వాస్తవానికి జరిగిందేంటి? అనే కథ మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఆ శ్రీకృష్ణుని విగ్రహం సామాన్యమైనదికాదు. ఒక సారి దేవకీ దేవి “కృష్ణా... నీ బాల్య లీలలు చూసే భాగ్యం, యశోదకు కలిగినట్లు నాకు కలుగలేదు. వాటి గురించి వినీ వినీ ఎప్పటికైనా చూడాలని నా మనస్సు ఉవ్వి ళ్ళూరుతోంది. చూపించవా కృష్ణా" అని ప్రార్ధించింది.

కృష్ణుడు ఆమె కోరికని మన్నించి మరుక్షణంలో శైశవ దశలో కృష్ణుడిగా మారిపోయాడు. తప్పటగులు వేస్తూ నడిచాడు. దేవకి దేవి ఒడిలో కూర్చున్నాడు. ఆమె స్తన్యాన్ని త్రాగాడు. కేరింతలు కొట్టాడు. కుండ పగుల గొట్టి వెన్న తిన్నాడు. ఒంటినిండా రాసుకున్నాడు. పామును తాడులాగా పట్టుకుని మజ్జిగ చిలికినట్లు నృత్యం చేశాడు. మరీ ముఖ్యంగా తనతో పాటు అన్న బలరాముణ్ణి కూడా చూపించాడు. ఈ చేష్టలను చూసి దేవకి దేవి పరవశించి మైమరచిపోగా ఇదంతా గమనిస్తున్న రుక్మిణి తన పతి దేవుని శైశవ రూపాన్ని ప్రపంచమంతా చూసి తరించాలని భావించింది.

విశ్వకర్మను పిలిపించి ఆయా రూపాల్లో, శైశవ కృష్ణుడూ, బలరాముని విగ్రహాలను చేయించింది. ముందుగా తానే సకల వైభవాలతో విగ్రహాలను స్వయంగా పూజించింది. కృష్ణావతారం ముగిసింది. మరికొంత కాలానికి ద్వారక సముద్రంలో మునిగిపోయే సమయం ఆసన్నమైంది. దూరదృష్టితో అర్జునుడు ఆ విగ్రహాలను తీసుకువెళ్లి ఒక ప్రదేశంలో ప్రతిష్టించి దానికి రుక్మిణీవనం అని నామకరణం చేశాడు. కాలక్రమంలో ఆ వనం యావత్త గోపీ చందనం మట్టిలో కలిసి కనుమరుగైపోయింది.

నావికులు తమ నౌకల్లో సమతూకాన్ని పాటించడం కోసం గోపీ చందనం గడ్డల్ని మోసుకెళ్లే అలవాటు ప్రకారం కాకతాళీయంగా ఈ విగ్రహాలున్న గోపీ చందనం గడ్డల్ని కూడా నౌకలోకి చేర్చారు. వాటి విలువ తెలియకుండానే వాటిని తీసుకెళ్లే భాగ్యం ఆ వ్యాపారికి లభించింది. ఆ విగ్రహం ఆ నౌకలో వస్తోందని మధ్వాచార్యులవారి దివ్య దృష్టికి ముందే తెలుసు.

శ్రీ కృష్ణుని ప్రతిమను మధ్వాచార్యులు తమ శిష్యుల చేత మాధవ సరోవరంలో ప్రక్షాళన చేయించారు. తరువాత తానే స్వయంగా అభిషేకించారు. ఈ అభిషేకానికి మునుపు నలుగురు శిష్యులు సునాయాసంగా ఎత్తిన ఆ విగ్రహం మధ్వాచార్యుల వారు అభిషేకించిన తరువాత 30 మంది కలిసినా ఎత్తడం సాధ్యం కాలేదు. ఎందుకంటే మధ్వాచార్యుల అభిషేకంతో ఆ విగ్రహంలో శ్రీ కృష్ణుని దివ్యశక్తి పరిపూర్ణంగా ఏర్పడిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం