కృష్ణాష్టమి ఎప్పుడు? ఆ రోజు కృష్ణునికి ఏం చేయాలి?
కృష్ణాష్టమి 2023: తేదీ 7 సెప్టెంబర్ 2023న కృష్ణాష్టమి జరుపుకోవాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. మహా విష్ణువు యొక్క అవతారాలలో కృష్ణావతారం చాలా ప్రత్యేకమైనది.
శ్రీకృష్ణుడు లోకానికి భగవద్దీత ద్వారా జ్ఞానమును అందించిన జగద్గురువు కృష్ణ పరమాత్మ. శ్రావణ మాస కృష్ణ పక్ష అష్టమి రోజున దేవకీ వసుదేవుల గర్భము నందు మధురలో జన్మించుట చేత ఈరోజుకు అంతటి ప్రాధాన్యత ఏర్చడినదని చిలకమర్తి తెలిపారు. ఇలాంటి కృష్ణాష్టమి (జన్మాష్టమి) రోజు కృష్ణుని స్మరించుకుంటూ కృష్ణుడు అందించినటువంటి గీతను, భారతాన్ని వింటూ చదువుతూ ఎవరైతే గడుపుతారో వారికి కృష్ణ భగవానుని యొక్క అనుగ్రహం కలుగుతుందని చిలకమర్తి తెలిపారు.
కృష్ణుడు మానవునిగా జన్మించి అధర్మంపై ధర్మంగా ఎలా విజయాన్ని అందించాడో కృష్ణావతారం రోజున ఖచ్చితంగా తెలుసుకోవాలని చిలకమర్తి తెలిపారు.
యుగయుగాల చరిత్ర కలిగిన ఈ సమాజం ఎల్లప్పుడు కులాతీత, మతాతీత, వర్జాతీతంగా ఉంటూ, సహజీవనాన్ని కోరుకుంటూ వస్తూ ఉంది. మనుషులు జన్మతహా వస్తున్న ఆచారాలను అనుసరిస్తూ వీరంతా పొట్టకూటి కోసం వివిధ వృత్తులను చేపడుతూ ఉంటారు. చేసే పనులు వేరు అయినా, పూలదండలో దారం వలె ధర్మం మాత్రం వీరందరికీ ఒకటే ఉంటుంది. అన్ని యుగాల్లోను, అన్ని కాలాల్లోను చెక్కు చెదరకుండా ఉండేది ధర్మమార్గం ఒక్కటే అని సర్వులూ అంగీకరిస్తున్న విషయం. అయితే ఈ కాలగమన ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు ఏర్పడుతూ శృతి మించి రాగానికి వస్తూ ఉంటాయి. అలా మానవ మనుగడకు ముప్పు వాటిల్లే పరిస్థితి వచ్చినపుడు భగవానుడు మళ్లీ పుడతాడు.
శ్రీకృష్ణభగవానుడు ఇదే విషయాన్ని చెబుతాడు. ‘ఓ అర్జునా! ధర్మమునకు హాని కలిగినప్పుడు అధర్మము పెచ్చు పెరిగినప్పుడును నన్ను నేను సృష్టించుకుందును. అనగా సాకార రూపముతో లోకమున నేను అవతరింతును..’ అని శ్రీకృష్ణుడు భగవద్గీత ద్వారా ఉపదేశించాడు. శ్రీకృష్ణుని భగవంతుని అవతారంగా, మానవ రూపంలో జన్మించిన దేవునిగా ఆరాధించామే గాని మానవుడిగా పుట్టిన ఆ దేవదేవుని మానవునిగా గాక, వారి లీలలను మానవ మనుగడతో సరిపోల్చుకుంటూ అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యంగా తెలుసుకోవాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
అలా భగవానుడు సామాన్య జనుల మధ్య సామాన్య మానవుడి రూపంలో జన్మించి నివురుగప్పిన నిప్పులా దినదినాభివృద్ధి చెందుతూ ధర్మానికి ఆటంకం కలిగించే శక్తులను తనలో ఉన్న మధ్యాహ్న సూర్యకాంతితో ఒక మండించే శక్తిగా, ఆ దుష్టశక్తులను నశింపచేస్తూ సామాన్య జనులకు ఊరట కలిగిస్తూ మానవులందరకు తిరిగి ఎలా కలసిమెలసి జీవించాలో జ్ఞానబోధను చేస్తూ ముందుకు సాగిపోతుంటారు. అట్టి శ్రీకృష్ణావతార జన్మదినం మనకు చాలా పవిత్రమైన పుణ్యదినంగా ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుంటూ వారి జన్మవృత్తాంత విశేషాలను పరమ భాగవతోత్తములు అందించినవి ఏమిటో... ఒక్కసారి సమీక్షించుకుందాం.
జీవిత సత్యాలు
ఆ బాలకృష్ణుడు దిన దిన ప్రవర్థమాన మగుచూ తన లీలావినోదారులచే బాల్యమునుండే, అడుగడుగునా భక్తులకు జ్ఞానోపదేశం చేస్తూ వచ్చినాడు. బాలకృష్ణుడు ఇంటింటా తన స్నేహితులతో వెన్నముద్దలు దొంగిలిస్తూ వెన్నదొంగగా ముద్రవేసుకున్నాడు.
అలా వెన్నముద్దల దొంగతనంలో కూడా మానవులకు అందని దేవరహస్యం ఉందట. వెన్న జ్ఞానానికి సంకేతంగా చెప్తారు. పెరుగును మధించగా మధించగా కాని వెన్న లభ్యం కాదు కదా! అట్టి తెల్లని వెన్నను తాను తింటూ, ఆ అజ్ఞానమనే నల్లటి కుండను బద్దలుకొట్టి మానవులలో జ్ఞానజ్యోతిని వెలిగించడమే కృష్ణ సందేశంగా భావించాలి.
గోపికలు కుండలలో ఇళ్లకు నీళ్ళను యమునానదిలో నుండి తీసుకుని వెళుతూ ఉంటే రాళ్ళను విసిరి చిల్లు పెట్టేవాడట. అలా ఆ కుండ మానవ శరీరము అనుకుంటే ఆ కుండలోని నీరు అహంకారం. ఆ అహంకారం కారిపోతేనే గానీ జీవికి ముక్తి లభించదని ఇలా వారి లీలలోని ఆంతర్యాన్ని భాగవతోత్తములు వివరించారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.