తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Pradakshinalu: గుడిలో ప్రదక్షిణలు చేస్తున్నారా? ఏ దేవుడికి ఎన్ని చేస్తే శుభఫలితాలు లభిస్తాయి?

Pradakshinalu: గుడిలో ప్రదక్షిణలు చేస్తున్నారా? ఏ దేవుడికి ఎన్ని చేస్తే శుభఫలితాలు లభిస్తాయి?

Gunti Soundarya HT Telugu

13 August 2024, 8:00 IST

google News
    • Pradakshinalu: గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ప్రదక్షిణలు చేయకుండా రారు. అయితే ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి. ఎన్ని చేస్తే ఎలాంటి ఫలితాలు దక్కుతాయో తెలుసుకుందాం. 
ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి?
ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? (pinterest)

ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి?

Pradakshinalu: మానసిక ప్రశాంతత కోసం దైవానుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ గుడికి వెళతారు. దైవ దర్శనం చేసుకోవడానికి ముందుగా కొంతమంది మొక్కలు చెల్లించుకున్న వాళ్ళు ప్రదక్షిణలు చేస్తారు. గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరిరూ తప్పనిసరిగా ప్రదక్షిణలు చేయకుండా ఉండరు. కోరిన కోరికలు తీర్చమని వేడుకుంటూ భక్తులు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు.

సాధారణంగా గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మూడు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అదే ఏదైనా ఒక కోరిక నెరవేరాలన్నా లేదా కోరిన కోరిక తీరినప్పుడు భక్తులు 108 ప్రదక్షిణలు చేస్తారు. గుడిలో ఎన్ని ప్రదక్షిణలు చేయాలనే దానిపై ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. కొంతమంది మూడు, ఐదు, 11 సార్లు ప్రదక్షణిలు చేయాలని సూచిస్తుంటారు. అయితే ఎన్ని ప్రదక్షిణలు చేసినా అవి మాత్రం బేసి సంఖ్యలోనే ఉంటాయి. ఏ దేవుడికి గుడికి వెళ్ళినా ఆ దేవుడికి సంబంధించిన స్తోత్రం పఠిస్తూ ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది.

ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణలు

హిందూమతంలో దైవారాధనకు అధిక ప్రాముఖ్యత ఉంటుంది. పంచభూతాలతో సమానంగా భావించే దేవుళ్లను ఒక్కొక్కరు ఒక్కో విధంగా కొలుస్తారు. దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. గుడి చుట్టూ తిరగడం అంటే దైవం చుట్టూ తిరిగినంతగా నమ్ముతారు.

ప్రదక్షిణలు సాధారణంగా రెండు రకాలు. ఒకటి ఆత్మ ప్రదక్షిణ, మరొకటి దేవాలయంలోనూ గర్భగుడి లేదా విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేయడం చేస్తారు. శాస్త్రాల ప్రకారం గుడికి నలువైపులా వివిధ దేవతాశక్తులు ఉంటాయని వారి అనుగ్రహం కోసం ఇలా ప్రదక్షిణను చేయడం మంచిదని చెబుతారు.

సాధారణంగా ఆలయంలో మూడు ప్రదక్షిణలు తప్పనిసరిగా చేయాలి. అదే వినాయకుడి ఆలయంలో అయితే మూడు ప్రదక్షిణలు చేయాలి. ఇక హనుమంతుడి దేవాలయంలో ఐదు ప్రదక్షిణలు చేయాలి. విష్ణుమూర్తి ఆలయంలో ఐదు ప్రదక్షిణలు చేయాలి. విష్ణు అవతారాలు ఉన్న ఆలయంలో నాలుగు ప్రదక్షిణలు చేయడం మంచిదిగా చెబుతారు. ఇలా చేయడం వల్ల కోరిన కోరికలన్నీ తీరుతాయట.

సూర్య భగవానుడికి రెండు ప్రదక్షిణలు చేయాలి. అలాగే రావి చెట్టుకి 108 ప్రదక్షిణలు చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అనేక గ్రహదోషాల నుంచి విముక్తి కలుగుతుంది. ఇక నవగ్రహాల చుట్టూ కనీసం మూడుసార్లు అయినా ప్రదక్షిణలు చేయాలి. జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే మాత్రం తొమ్మిది గ్రహాలు కనుక తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి. లేదంటే 11, 21, 27 ఇలా ప్రదక్షిణలు చేసుకోవచ్చు.

ఇక గ్రామ దేవతలకు తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి. శని దేవుడికి ఏడు ప్రదక్షిణలు చేస్తారు. ఇలా చేయడం వల్ల శని దోషం తగ్గుతుంది. ప్రదక్షిణ చేయడం అంటే ఆషామాషీగా వాటిని పూర్తి చేయడం కాదు. మనసులో దైవ నామస్మరణ చేసుకుంటూ దేవుడికి సంబంధించిన మంత్రాలు లేదా శ్లోకాలు పఠిస్తూ ప్రదక్షిణలు చేయాలి. రెండు చేతులు జోడించి ప్రదక్షిణలు చేయడం ఉత్తమమైన అలవాటు. అంతేకానీ పక్కవారితో మాట్లాడుకుంటూ ఫోన్ చూసుకుంటూ ప్రదక్షిణలు చేసిన ఎటువంటి ప్రయోజనం ఉండదు.

శివాలయంలో మాత్రం భిన్నం

శివాలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు మాత్రం ఈ నియమాలు పూర్తి భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే ఆలయంలో ప్రదక్షిణలు చేసే పద్ధతి వేరుగా ఉంటుంది. శివాలయంలోని సోమసూత్రం దాటి ప్రదక్షిణలు చేయకూడదు. శివాలయంలోని ధ్వజస్తంభం దగ్గర నుంచి గర్భాలయానికి వెనుక ఉన్న సోమ సూత్రం వరకు వెళ్లి వెనుతిరగాలి. సోమ సూత్రం దాటకూడదు. ఎందుకంటే శివుని అభిషేకజలం బయటకు పోయే మార్గం ఇది. అందుకే పవిత్రమైన ఆ జలాన్ని దాటకూడదు అని చెబుతారు. సోమ సూత్రాన్ని దాటితే ఎన్ని ప్రదక్షిణలు చేసినా ఒక ప్రదక్షణ కిందకే వస్తుంది.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

తదుపరి వ్యాసం