Lord ganesha: అడ్డంకులు తొలగించే గణపతి స్తోత్రం.. రోజూ పఠిస్తే కష్టాల నుంచి గట్టెక్కినట్టే
Lord ganesha: ఏదైన కార్యంలో అడ్డంకులు ఏర్పడుతూ పని ఆలస్యం అవుతుంటే ఈ గణేశ స్తోత్రం పఠించండి. మీ సమస్యలన్నీ తొలగిపోయి కష్టాలు తీరతాయి.
Lord ganesha: శుభకార్యం ఏదైనా సరే వినాయకుడికి తొలి పూజ చేస్తారు. ఎందుకంటే అన్ని అడ్డంకులను తొలగించే వాడిగా గణపతిని కొలుస్తారు. విజ్ఞాలు తొలగించే విఘ్నేశ్వరుడిగా అందరి పూజలు అందుకుంటారు. వినాయకుడిని ఆరాధించేవాడు జ్ఞానం, సమృద్ధి, అనుకున్న పనులన్నీ నెరవేరుతాయని నమ్ముతారు.
పూజ చేసేటప్పుడు వినాయకుడి ఆశీస్సులు కోరుతూ మంత్రాలు, స్తోత్రాలు చదువుతారు. అలాగే వినాయకుడిని శాంతింప చేయడం కోసం గణేష స్తోత్రం పఠించడం అత్యంత శక్తివంతమైన మార్గాలలో ఒకటి. ఈ స్తోత్రం ప్రాముఖ్యత గురించి నారద పురాణంలో పేర్కొన్నారు. గణపతి స్తోత్రాన్ని పఠించడం వల్ల అన్ని అడ్డంకులు, చెడు శక్తులు తొలగిపోతాయని నమ్ముతారు. వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఈ స్తోత్రం ప్రతిరోజు పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి.
బుధవారం వినాయకుడికి అంకితం చేసిన రోజు. ప్రతినెల సంకటహర చతుర్థి పండుగ రోజు గణేషుడికి విశేష పూజలు నిర్వహిస్తారు. హిందూమతంలో ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించే ముందు వినాయకుడిని ఆరాధిస్తారు. ఇలా పూజించడం వల్ల జీవితంలో కష్టాలు తీరతాయని నమ్ముతారు. అటువంటి వినాయకుడి ఆశీస్సులు పొందటం కోసం ప్రతిరోజూ ఈ సంకట నాశన గణేశ స్తోత్రం పఠించడం వల్ల చాలా మేలు జరుగుతుంది.
గణేశ స్తోత్రం
ప్రణమ్య శిరసా దేవం గౌరీ పుత్రం వినాయకం
భక్తావాసం స్మరే న్నిత్య మాయుష్కామార్థయే
ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్ర్తం చతుర్థకమ్
లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ
సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టకమ్
నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకం
ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్
ద్వాద శైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః
న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరమే
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం
పుత్రార్థీ లభతే పుత్రా న్మోక్షార్థీ లభతే గతిమ్
జపే ద్గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్
సంవత్సరేన సిద్ధిం చ లభతే నాత్ర సంశయః
అష్టాభ్యోం బ్రాహ్మణానాం చ లిఖిత్వా య స్సమర్పయేత్
తస్యవిద్యా భవే త్సర్వా గణేశస్య ప్రసాదతః
గణేశ స్తోత్రం ఎలా పఠించాలి?
తెల్లవారుజామునే నిద్ర లేచి స్నానం ఆచరించాలి. పూజ గదిలో చెక్క పీట వేసి దానిమీద వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించాలి. వినాయకుడి ముందు నెయ్యి దీపం వెలిగించి ధూపం వేయాలి. పసుపు మాల లేదా పసుపు పువ్వులు సమర్పించాలి. దుర్వా గడ్డి స్వీట్లు సమర్పించాలి. అలాగే గణేష్ మంత్రాన్ని పఠిస్తూ విగ్రహానికి క్రమానుసారం పూజ చేయాలి. అనంతరం ఈ స్తోత్రం చదవడం ప్రారంభించాలి. మీరు గరిష్ట ప్రయోజనాలు పొందాలనుకుంటే ప్రతిరోజు ఉదయాన్నే ఈ స్తోత్రాన్ని పఠించాలి. దీన్ని పూర్తి చేసిన తర్వాత వినాయకుడికి హారతి ఇచ్చి ఆశీర్వాదం పొందాలి.
గణేశ స్తోత్రం పాటించడం వల్ల ప్రయోజనాలు
ఈ గణేశ స్తోత్రం పఠించిన వ్యక్తికి అన్ని రకాల ఆటంకాల నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ స్తోత్రం చాలా శక్తివంతమైనది. ప్రతిరోజు పారాయణం చేయడం వల్ల వినాయకుడు భక్తుల కోరికలు అన్నింటినీ తీరుస్తాడని నమ్ముతారు. దుష్టశక్తులతో బాధపడేవారు ఈ స్తోత్రాన్ని రోజూ జపించవచ్చు. ఈ స్తోత్రం పారాయణం చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.